కరోనా కష్టాలు

ABN , First Publish Date - 2020-03-27T09:32:25+05:30 IST

స్వస్థలాలకు వెళ్లనివ్వాలని విద్యార్థులు.. క్వారంటైన్‌కు ఒప్పుకొంటేనే అని అనుమతిస్తామని పోలీసులు.. ఇరువైపులా వాదోపవాదాలు.. ఉద్రిక్తత..!

కరోనా కష్టాలు

1100 కిలోమీటర్ల నడక..

లాక్‌డౌన్‌తో సొంత ప్రాంతాలకు విద్యార్థులు

చెక్‌పోస్టుల వద్ద అడ్డుకుంటున్న పోలీసులు

అశ్వారావుపేటలో 1000 మంది నరకయాతన

స్వరాష్ట్రంలోకి అనుమతించని ఏపీ అధికారులు

అలంపూర్‌లో తెలంగాణ విద్యార్థుల ఇక్కట్లు

ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలస కూలీలు

పనులు లేక.. పస్తులతో ఉండలేక సొంతూళ్లకు 

భైంసా నుంచి యూపీ.. కొత్తగూడెం టు ఛత్తీ్‌సగఢ్‌

కన్నీరు పెట్టిస్తున్న వలస కూలీల నడక


హైదరాబాద్‌, దాచేపల్లి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): స్వస్థలాలకు వెళ్లనివ్వాలని విద్యార్థులు.. క్వారంటైన్‌కు ఒప్పుకొంటేనే అని అనుమతిస్తామని పోలీసులు.. ఇరువైపులా వాదోపవాదాలు.. ఉద్రిక్తత..! చివరకు.. గంటల కొద్దీ నిరీక్షణతో సహనం కోల్పోయిన విద్యార్థులు రాళ్ల దాడికి దిగడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఏపీలోని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టు గురువారం ఉదయం ఆరు గంటల నుంచి సాయింత్రం ఏడు గంటల వరకు రణరంగంగా మారింది. తెలంగాణ నుంచి వచ్చినవారు తిండి తిప్పలు లేక నానా అవస్థలు పడ్డారు. 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని, అప్పుడు మాత్రమే సరిహద్దు దాటి వచ్చేందుకు అనుమతి ఇస్తామని పోలీసులు తెలిపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసినవారు పోలీసులపై రాళ్లు విసిరారు. పోలీసులు లాఠీలకు పని చెప్పడంతో ప్రజలు పరుగులు తీయాల్సి వచ్చింది.


ఈ క్రమంలో కొంతమంది ప్రయాణికులతో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. లాఠీచార్జీతో భయపడిన గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఓ యువకుడు భయంతో కృష్ణానది బ్రిడ్జిపై నుంచి దూకడంతో కాలు విరిగినట్లు స్థానికులు తెలిపారు. సత్తెనపల్లి పరిధిలోని ఓ పంచాయతీ కార్యదర్శి  సహా గాయపడిన ప్రయాణికులు, పోలీసులను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులు వదిలి వెళ్లిన ద్విచక్ర వాహనాలను లారీలలో పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పొందుగల చెక్‌పోస్టు వద్ద జరిగిన ఘటనపై రూరల్‌ ఎస్పీ విజయరావు, ఏఎస్పీ చక్రవర్తి పరిశీలించారు. ప్రజలు సమన్వయం వహించాలని వారు సూచించారు. ప్రభుత్వ ఆదేశాలు ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. పోలీసులపై రాళ్ల విసరడం సరికాదన్నారు. పోలీస్‌ పై దాడికి పాల్పడిన వారిని గుర్తించామన్నారు.


విద్యార్థుల కష్టాలివీ..

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులను లాక్‌డౌన్‌ కష్టాలు చుట్టుముట్టాయి. సొంతూళ్లకు వెళ్తున్న వారిని సరిహద్దుల వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారు. విద్యా సంస్థలు, శిక్షఽణ సంస్థల నుంచి అనుమతి పత్రాలున్నా అనుమతించడం లేదు. ఫలితంగా గురువారం తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివిధ సరిహద్దుల వద్ద విద్యార్థులు నరకయాతన అనుభవించారు. 


తెలుగు రాష్ట్రాల అధికారులు, పోలీసుల మధ్య సమన్వయ లోపం శాపంగా మారింది. తిండి, నీళ్లు లేక విద్యార్థులు చెక్‌పోస్టుల వద్ద పడిగాపులు కాశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న ఏపీ విద్యార్థులు దాదాపు వెయ్యి మంది సొంత రాష్ట్రానికి వెళుతుండగా బుధవారం రాత్రి అశ్వారావుపేట చెక్‌పోస్ట్‌ వద్ద ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. గురువారం ఉదయం 10 గంటల దాకా నిరీక్షించినా అనుమతి దక్కలేదు. 


నల్లగొండ జిల్లా కోదాడ సమీపంలోని వాడపల్లి బ్రిడ్జి వద్ద పెద్దసంఖ్యలో వాహనదారులు ఏపీవైపు వెళ్లేందుకు నిరీక్షిస్తున్నారు. తప్పనిసరిగా ఏపీలోకి రావాలనుకునే వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాలని ఏపీ సీఎం ఆదేశించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. క్వారంటైన్‌కు ముందుకొచ్చిన 300 మందిని 8 బస్సుల్లో మాచర్ల, నరసరావుపేట ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.


ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాలలో బ్యాంకు ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న 600 మందికిపైగా తెలంగాణ విద్యార్థులు తిరిగివస్తుండగా అలంపూర్‌ టోల్‌ప్లాజా దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ఏపీవైపు వెళ్తున్న వలస కూలీలను సరిహద్దులు దాటించడంతో విద్యార్థులు చెక్‌పోస్టు వద్ద బైఠాయించారు. తెలంగాణ-ఏపీ సరిహద్దు వద్ద ఉన్న పరిస్థితిని మంత్రి జగదీశ్‌ రెడ్డి బుధవారం రాత్రి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇరు రాష్ట్రాల సీఎంలు సంప్రదింపులు జరిపి.. గురువారం ఒక్క రోజు అనుమతించాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి జగదీ్‌షరెడ్డి వాడపల్లి వద్ద స్పష్టమైన ప్రకటన చేయటంతో కోదాడ వద్ద ఏపీ వైపునకు అనుమతించారు. కాగా, సరిహద్దు వద్ద నిలిచిపోయిన వాహనదారులకు వాడపల్లి గ్రామస్థులు ఆహారం అందజేశారు. 


విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు: తలసాని

ఉన్నత చదువులు, ఉద్యోగావకాశాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఎస్‌ఆర్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయవద్దని, పెయింగ్‌ గెస్ట్‌గా ఉన్నవారందరికీ భోజన వసతులు కల్పించాలని యాజమాన్యాలను మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ కోరారు. గురువారం ఆయన అమీర్‌పేటలోని వివేకానంద కమ్యూనిటీ హాల్లో హాస్టల్‌ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నో వ్యయప్రయాసలు పడి నగరానికి చేరుకుని హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థులకు ప్రభుత్వపరంగా అన్ని సహాయ సహకారాలు ఉంటాయన్నారు. హాస్టళ్ల నిర్వాహకులు పెయింగ్‌ గెస్ట్‌లను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు.

Updated Date - 2020-03-27T09:32:25+05:30 IST