కడపలోని విజయదుర్గా కాలనీలో భోగిమంట దగ్గర నృత్యాలు
మూడురోజులు పండుగ సంబరాలు
ముగ్గులమయంగా పల్లెలు.. పట్టణాలు
కరోనాదెబ్బకు ఆహ్వానాలకు..నో.. పరిమితంగా పలకరింపులు
కడప(మారుతీనగర్), జనవరి 13: తెలుగువారికి అత్యంత ప్రీతికరమైన పండుగ సంక్రాంతి. కుటుంబసమేతంగా ఆనందకర వాతావరణంలో మూడురోజులపాటు జరుపుకోవడం ఆనవాయితీ. కొత్తపంట చేతికొచ్చినవేళ, కష్టపడి రైతన్నపండించిన పంటకు చేయూతనిచ్చిన బసవన్నలకు కృతజ్ఞత తెలియపరిచే సందర్భం. పట్టణాలలో కంటే పల్లెల్లో సంక్రాంతి హడావిడి అంతాఇంతా కాదు. స్వచ్ఛమైన గాలులు, ఆహ్లాదకర వాతావరణం, ఆప్యాయతతో పిలిచే బంధుమిత్రులు, ఇంటిముంగిట పేడనీటితో కల్లాపిచల్లి తీర్చిదిద్దిన రంగవల్లులు, యువతుల గొబ్బిమ్మపాటలు, యువకుల గాలిపటాల కేరింతలు, కోడిపందాలు, బసవరాజుల పోటీలు, భోగిమంటలు.. ఇవన్నీ ఒక ఎత్తైతే అమ్మచేతివంట ఘమఘమలతో సంక్రాతి సంబరాల తాలూకు కిక్కే వేరబ్బా అన్నట్లుగా ఉంటుందని చెప్పక తప్పదు.
సంక్రాంతికీ తప్పని కరోనా బెంగ
గతంలో సంక్రాంతి సంబరాలు జిల్లాలో అంబరాన్ని తాకేవి. ప్రస్తుతం కరోనా కారణంగా ప్రభుత్వ ఆదేశాలమేరకు సంబరాలు ఆ స్థాయిలో లేవనే చెప్పాలి. రిమ్స్ సమీపంలోని శిల్పారామంలో ప్రభుత్వం ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు నిర్వహించలేదు. గుంపులుగుంపులుగా సంచరించే ప్రదేశాల్లో ప్రజలు మాస్క్‌లను విధిగా ధరించేవిధంగా ప్రజలను అప్రమత్తంచేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయనాయకులు, అధికారులు కూడా ఈ సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియపరిచేందుకు వచ్చే అభిమానులను ప్రత్యక్షంగా కలుసుకోవద్దని ముందస్తుగా సమాచారం అందజేశారు. సంక్రాంతి పండుగరోజున కూడా కరోనా బెంగ మాత్రం ప్రజలకు తప్పడంలేదు. దీంతో ఈ సారి కాస్త సందడి తగ్గింది.
ముగ్గులతో కళకళలాడిన వీధులు
పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా భోగిసందర్భంగా వీధులన్నీ ముగ్గులతో కళకళలాడాయి. బుధవారం తెల్లవారుజామున రెండుంగటల నుంచే చాలా చోట్ల భోగిమంటలు వేశారు. ఇంటిల్లిపాదీ అక్కడ చేరి సందడి చేశారు.
కిక్కిరిసిన వైవీ సీ్ట్రట్
సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటి అవసరాలకోసం కావాల్సిన వివిధ వస్తువులు, దుస్తుల కొనుగోలు కోసంగా జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజలతో కడప నగరంలోని వైవీసీ్ట్రట్ కిక్కిరిసింది. 11 నెలలుగా కరోనా కారణంగా బయటుకు రాని పల్లెప్రాంతాల ప్రజలు పండుగ రాకతో వంటలకు అవసరమైన వాటిని కొనుగోలుచేసేందుకు కడపకు రావాల్సివచ్చింది. అలాగే పిల్లలకు పెద్దలకు అవసరమైన దుస్తులను కొనడానికి ఇంటిల్లిపాది మార్కెట్‌కు వచ్చారు. దీంతో వైవీసీ్ట్రట్ ప్రజలతో నిండిపోయినట్లయింది.