Abn logo
May 7 2021 @ 04:14AM

కరోనా సోకిందని.. అమ్మనే వదిలేశారు

మార్టేరు పీహెచ్‌సీ వద్ద ఆ తల్లి ఆర్తనాదాలు


పెనుమంట్ర, మే 6: కరోనా బంధాలను చిదిమేస్తోంది. కొవిడ్‌ సోకిందని కన్నతల్లిని కుమార్తెలు చెట్టుకింద వదిలేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో చోటుచేసుకుంది. కొప్పిశెట్టి వెంకాయమ్మ (65)కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం ఆమె పెనుగొండ మండలం కొఠాలపర్రులోని కూతురు వద్ద ఉంటోంది. ఆమెకు కరోనా లక్షణాలు బయటపడడంతో కుమార్తెలు ఆమెను గురువారం మార్టేరు పీహెచ్‌సీ చెట్టు కింద వదిలేసి వెళ్లిపోయారు. అక్కడామె ఆర్తనాదాలు చేస్తున్నా పీహెచ్‌సీ సిబ్బంది పట్టించుకోలేదు. సమాచారం అందుకున్న మార్టేరు గ్రామ కార్యదర్శి నాగబాబు అక్కడకు చేరుకుని వద్ధురాలి వివరాలను సేకరించారు. తనకు కరోనా సోకిందని కూతుళ్లు ఇక్కడ వదలివేశారని ఆమె కన్నీటి పర్యంతమైంది. ఇటీవలే రూ.5 లక్షల ఆస్తిని పంచుకుని ఇప్పుడు వదలివేశారని వాపోయింది. పంచాయతీ కార్యదర్శి నాగబాబు పోలీసుల సాయంతో ఆమెను కుమార్తె ఇంటికి చేర్చారు.

Advertisement