ఇక కరోనా పేషెంట్లకే పెద్దాస్పత్రి

ABN , First Publish Date - 2020-08-04T11:32:37+05:30 IST

ఉభయగోదావరి జిల్లాల కు సర్వజన ఆస్పత్రిగా పేరొందిన కాకినాడ జీజీ హెచ్‌లో ఈనెల 6 నుంచి ఓపీ నిలిచిపోనుంది.

ఇక కరోనా పేషెంట్లకే పెద్దాస్పత్రి

ప్రత్యేక కొవిడ్‌ ఆసుపత్రిగా కాకినాడ జీజీహెచ్‌

ప్రాణాపాయంలో ఉన్న రోగుల పరిస్థితి ఏంటి

అన్ని విభాగాల్లో ఉన్న ఇన్‌ పేషెంట్‌ల డిశ్చార్జ్‌

ఈనెల 6 నుంచి ఓపీ బంద్‌

సర్వజన ఆస్పత్రిలో అత్యవసర రోగులను చేర్చుకోరనేటప్పటికి సర్వత్రా ఆందోళన


జీజీహెచ్‌(కాకినాడ): ఉభయగోదావరి జిల్లాల కు సర్వజన ఆస్పత్రిగా పేరొందిన కాకినాడ జీజీ హెచ్‌లో ఈనెల 6 నుంచి ఓపీ నిలిచిపోనుంది. కొవిడ్‌ కేసులు ఉధృతమవుతున్న తరుణంలో దీన్ని ప్రత్యేక కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చనున్నారు. దీంతో ఇక్కడకు ప్రాణాపాయంలో వచ్చే రోగుల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జీజీహెచ్‌ అన్ని విభాగాల్లో ఉన్న ఇన్‌ పేషెంట్‌లను డిశ్చార్జ్‌ ప్రక్రియ చేపట్టారు.


గురువారంనుంచి సర్వజన ఆస్పత్రి కొవిడ్‌ ఆస్పత్రిగా మారుతుందని, అత్యవసర రోగులను చేర్చుకోరనే విషయం బయటకు రావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మెడిసిన్‌, సర్జరీ, క్యాన్సర్‌, న్యూరో సర్జరీ, న్యూరో మెడిసిన్‌, పిడియాట్రిక్స్‌ పిడియాట్రిక్‌ సర్జరీ, గైనిక్‌ విభాగాలకు నిత్యం ఆయా జిల్లాలనుంచి ఇక్కడకు వేలల్లో వస్తుంటారు. ఇప్పుడు ఈ విభాగాలన్నీ కొవిడ్‌ బెడ్‌లతో నిండిపోనున్నాయి. మరో 16 విభాగాలతో ఈ ఆస్పత్రి కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా రోగులకు వైద్యసేవలందిస్తోంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా ఇక్కడ వైద్యం చేయించుకోడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు.


కొవిడ్‌ బాధితులను కాపాడాలని..

రోజూ పెరుగుతున్న కొవిడ్‌ పాజిటివ్‌ బాధితుల సంఖ్యను చూసి వారిని కాపాడాలనే ఉద్ధేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాకినాడ జీజీహెచ్‌ను ప్రత్యేక కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం జీజీహెచ్‌ అన్ని విభాగాల్లో ఉన్న ఇన్‌పేషెంట్‌లను ఇంటికి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో గైనిక్‌ విభాగంలో ఉన్న గర్భిణులు, బాలింతలు, పిడియాట్రిక్స్‌ విభాగంలో ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉన్న చిన్న పిల్లలు, పసికందుల పరిస్థితి ఇంకా కొలిక్కి రాలేదు. రోగులు, క్షతగాత్రులు, గర్భిణులు, ఇతర బాధితులకు ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచితంగానే వైద్యం అందుతోందని వైద్యాధికారులు చెబుతున్నారు.


ప్రజాసంఘాల ఆగ్రహం

సాధారణంగా ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ పథకంలో చేరే ఆయా రోగులకు సకాలంలో, సరైన వైద్యం అందదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ఇటువంటి ఉదంతాల్లో ఎంతోమంది ఆయా ఆస్పత్రుల్లో చేరిన వారు తిరిగి జీజీహెచ్‌కు వచ్చేవారు. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పుపై ప్రజాసంఘాలు పెదవి విరుస్తున్నాయి.


జీజీహెచ్‌ పరిస్థితి

ఇక్కడ అధికారికంగా 1165 బెడ్‌లున్నాయి. అనధికారికంగా 1850 బెడ్‌ల సామర్ధ్యానికి సర్ధుబాటు చేశారు. ప్రభుత్వ వైద్యులు 300, నర్సులు 350, ఎంఎన్‌వోలు 100, శానిటరీ, తదితర సిబ్బంది 220, ఎఫ్‌ఎన్‌వోలు 80, పీజీలు 350, హౌస్‌ సర్జన్‌లు 200 మంది ఈ ఆసుపత్రిలో రోగులకు సేవలందిస్తున్నారు. వీరంతా ఇప్పుడు కొవిడ్‌ విధులకు మాత్రమే పరిమితం కానున్నారు.

Updated Date - 2020-08-04T11:32:37+05:30 IST