మంటగలిసిన మానవత్వం

ABN , First Publish Date - 2020-07-14T19:43:54+05:30 IST

రానురాను మానవత్వం మంటగలుస్తోంది. అందులోనూ కరోనా మహమ్మారి..

మంటగలిసిన మానవత్వం

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పట్టించుకోని వైనం 

రెండు రోజులుగా ముళ్లకంపలోనే బాధితుడు 


రాజంపేట(కడప): రానురాను మానవత్వం మంటగలుస్తోంది. అందులోనూ కరోనా మహమ్మారి దృష్ట్యా మానవ సంబంధాలు తెగిపోతున్నాయి. రెండు రోజుల కిందట రైల్వేకోడూరులో కరోనా బారిన పడి అంబులెన్స్‌ను చూసి ఓ వృద్ధురాలు ఇంటి ఎదుటే కుప్పకూలి మృతి చెందింది. అమెను నాలుగు గంటల పాటు ఎవ్వరూ పట్టించుకోకుండా అలాగే వదిలేశారు. అలాంటి సంఘటనే రాజంపేటలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల కిందట కడప-చెన్నై జాతీయ రహదారిలోని పద్మప్రియ కల్యాణ మండపం వద్ద బబ్లూ(32) అనే వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో రహదారి పక్కనే ఉన్న ముళ్లకంపల్లో పడిపోయాడు. వాహనం బలంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు.


రెండు రోజులుగా హైవేపై అటూ ఇటూ వందలాది వాహనాలు వెలుతున్నా అతన్ని పట్టించుకునేవారు కరువయ్యారు. చుక్క నీరు ఇచ్చే వారు లేక, కనీసం పలకరించే దిక్కులేక అనాథగా మిగిలిపోయాడు. అయితే సోమవారం రాత్రి అటు వైపు వెలుతున్న అలీషేర్‌ అనే ముస్లిం నేత పోలీసులకు సమాచారం అందించారు. పెట్రోలింగ్‌ పోలీసులు శ్రీనివాస్‌, చంద్రమోహన్‌ హుటాహుటిన అక్కడికి వచ్చి అతన్ని ముళ్లకంపల్లో నుంచి బయటకు తీసి పక్కకు చేర్చా రు. కాగా గాయపడిన వ్యక్తి తనది ఉత్తర ప్రదేశ్‌ అని, తన సహచరులు ముగ్గురితో కాలినడకన చెన్నై వైపు వెలుతున్నాం అని.. వారు ముందు వెలుతుండగా నన్ను వెనక నుంచి వచ్చిన వాహనం ఢీకొందని... దీంతో తాను పడిపోయానని, తరువాత తనకు ఏమీ తెలియడం లేదని హిందీ భాషలో చెప్పాడు. కరోనా వ్యాప్తి ఎక్కువ కావడం...రాత్రి సమయం కావడంతో అతన్ని పక్కనే ఉన్న ఓ షెడ్డ వద్దకు చేర్చారు.


Updated Date - 2020-07-14T19:43:54+05:30 IST