కరోనా కలవరం

ABN , First Publish Date - 2022-01-24T06:30:38+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. నిత్యం వందలాది మంది కరోనా వైరస్‌బారిన పడుతుండడం కలవరానికి గురిచేస్తున్నది. ఆదివారం కొత్తగా 2,258 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

కరోనా కలవరం

జిల్లాలో భారీగా నమోదవుతున్న కరోనా కేసులు

తాజాగా 2,258 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ

39.92 పాజిటివీటీ రేటు

మరొకర మృతితో 1,127కు చేరిన కొవిడ్‌ మరణాలు

నేడు కలెక్టరేట్‌లో స్పందన రద్దు


విశాఖపట్నం, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి. నిత్యం వందలాది మంది కరోనా వైరస్‌బారిన పడుతుండడం కలవరానికి గురిచేస్తున్నది. ఆదివారం కొత్తగా 2,258 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. మొత్తం 5,657 మందికి పరీక్షలు నిర్వహించగా 39.92 పాజిటివీటి రేటుతో ఈ కేసులు నమోదయినట్టు అధికారులు పేర్కొన్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు జిల్లాలో 1,78,111 మంది వైరస్‌బారిన పడగా, వీరిలో 1,61,289 మంది కోలుకున్నారు. మరో 15,695 మంది ఆస్పత్రులు, ఇళ్ల వద్ద చికిత్స పొందుతున్నారు. కాగా వైరస్‌బారిన పడిన వారిలో ఆదివారం మరొకరు మృతిచెందగా మొత్తం కొవిడ్‌ మరణాలు 1,127కు పెరిగాయి.. ఇదిలావుండగా థర్డ్‌ వేవ్‌లో వైరస్‌బారిన పడి, కోలుకుంటున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతున్నదని వైద్యాధికారులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం 309 మంది డిశ్చార్జ్‌ కాగా శనివారం 684 మంది, ఆదివారం 854మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపఽథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. 


ఉక్కునగరంలో 55.61 శాతం పాజిటివిటీ

ఉక్కుటౌన్‌షిప్‌, జనవరి 23: స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉక్కు జనరల్‌ ఆస్పత్రిలో శనివారం 196 మందికి టెస్ట్‌లు చేయగా, 109 మందికి పాజిటివ్‌గా ఆదివారం నిర్ధారణ అయ్యింది. 55.61 శాతం పాజిటివిటీ రేటుతో కరోనా కేసులు నమోదు కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 


నేడు కలెక్టరేట్‌లో స్పందన రద్దు

మహారాణిపేట, జనవరి 23: జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం (24వ తేదీ) జరగాల్సిన స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.

Updated Date - 2022-01-24T06:30:38+05:30 IST