కరోనా వైద్యంలో రోబో సిబ్బంది!

ABN , First Publish Date - 2020-03-28T05:39:31+05:30 IST

ఇటీవల కేరళలోని కలమస్సేరిలోని ‘హైటెక్‌ పార్క్‌’లో కరోనా వైరస్‌పై అవగాహన కలిగించేందుకు, ఉద్యోగులకు మాస్క్‌లు, శానిటైజర్‌లు పంపిణీ చేసేందుకు రోబోలను ఏర్పాటుచేసిన...

కరోనా వైద్యంలో రోబో సిబ్బంది!

ఇటీవల కేరళలోని కలమస్సేరిలోని ‘హైటెక్‌ పార్క్‌’లో కరోనా వైరస్‌పై అవగాహన కలిగించేందుకు, ఉద్యోగులకు మాస్క్‌లు, శానిటైజర్‌లు పంపిణీ చేసేందుకు రోబోలను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. వాటిని తయారుచేసిన అసిమోవ్‌ రోబోటిక్స్‌ అనే సంస్థ తాజాగా కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలందించేందుకు ‘కర్మి బోట్‌’ పేరుతో సరికొత్త రోబోలను ఇప్పుడు కేరళలో అందుబాటులోకి తెచ్చింది. 


ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది!

రోబో నడవడానికి వీలుగా మూడు చక్రాలు అమర్చారు. హాస్పిటల్లో అవసరమైన చోటికి భోజనం, వైద్య పరికరాలు, మందులు చేర్చటం వీటి పని.  రోబో లోపల ఏర్పాటుచేసిన అరల్లో ఆహారం, పరిశుభ్రమైన కంటెయినర్స్‌ ఉన్నాయి. రోబోల తయారీలో డ్రిస్టిబ్యూటెడ్‌ సెన్సర్‌ నెట్‌వర్క్‌, మెషీన్‌ లెర్నింగ్‌, కృత్రిమమేధ వంటి సాంకేతికత పరిజ్ఞానం వాడడం వల్ల  సొంతంగా స్పందించి పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటాయి. అవసరమనుకుంటే రిమోట్‌తోనూ ఆపరేట్‌ చేయవచ్చు. 


ప్రధానంగా కరోనా అనుమానితులు, వ్యాధిగ్రస్తుల వార్డుల్లో పని చేసేందుకు ఈ రోబోలను వాడుతున్నారు. వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో మనుషులు ఒకరికొకరు ఎడం పాటించాల్సిన పరిస్థితుల్లో ఈ రోబోలు ఉపయోగకరంగా ఉన్నాయి. వీటివలన ఇన్ఫెక్షన్‌ సోకదు. ఈ రోబోలో ఉన్న ఇంకో ప్రయోజనం ఏమిటంటే రోగులతోటి వారి బంధువులు, డాక్టర్లు వీడియో కాల్‌ ద్వారా మాట్లాడొచ్చు. ఆరోగ్య కార్యకర్తలు, హాస్పిటళ్లకు వచ్చే సందర్శకులకు రోబోలు సాయపడుతున్నాయి. దీనివల్ల హాస్పిటళ్లలో వైద్య సిబ్బంది మీద ఒత్తిడి  తగ్గుతోంది. ‘‘ఇప్పటికే మార్కెట్లో ఉన్న రోబోలతో పోల్చితే వీటి ధరలు చాలా తక్కువ. ఏడుగురు నిపుణుల బృందం 15 రోజులు కష్టపడి ఈ రోబోలను తయారుచేసింది. ప్రస్తుతం ఇలాంటి రోబోలను రోజుకొకటి తయారుచేస్తున్నాం. ఇంకా మార్కెట్లోకి రాకమునుపే వీటికి గిరాకీ పెరిగింది. మధ్య ఆసియా, అమెరికాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.’’ అని ‘అసిమోవ్‌’ సీఈవో జయకృష్ణన్‌ చెప్పారు. తాజాగా జైపూర్‌లో కూడా కరోనా బాధితులకు సేవలందించేందుకు ఇదే తరహా రోబోను అందుబాటులోకి తీసుకొచ్చారు. 

Updated Date - 2020-03-28T05:39:31+05:30 IST