కొవిడ్‌ కల్లోలంలో... ‘ఆశా’కిరణం

ABN , First Publish Date - 2021-06-05T05:08:16+05:30 IST

‘‘ప్రపంచంలోనే అత్యున్నతమైన, అతి పెద్ద సాంకేతిక నైపుణ్యం మన దేశంలో ఉంది. కరోనా విలయతాండవం చేస్తున్న ఈ పరిస్థితుల్లో దాన్ని మనం సరైన మార్గంలో వినియోగించుకుంటే మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు’’

కొవిడ్‌ కల్లోలంలో... ‘ఆశా’కిరణం

‘‘ప్రపంచంలోనే అత్యున్నతమైన, అతి పెద్ద సాంకేతిక నైపుణ్యం మన దేశంలో ఉంది. కరోనా విలయతాండవం చేస్తున్న ఈ పరిస్థితుల్లో దాన్ని మనం సరైన మార్గంలో వినియోగించుకుంటే మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు’’ అంటున్నారు అలైషా మరియా లోబో. సుప్రసిద్ధ కంపెనీల భాగస్వామ్యంతో ఆమె ప్రారంభించిన ‘కొవిడ్‌ ఆశా’ ఛాట్‌బోట్‌ కొవిడ్‌ రోగులకు సకాలంలో, కచ్చితమైన సమాచారాన్ని అందించడానికి కృషి చేస్తోంది. ఎందరినో ప్రాణాపాయం నుంచి తప్పిస్తోంది.


సింగపూర్‌ కేంద్రంగా నడుస్తున్న ఒక స్టార్టప్‌లో అలైషా ఉద్యోగి. ప్రస్తుతం గోవాలోని సొంత ఇంటి నుంచి పని చేస్తున్నారు. కరోనా సోకిన ఆమె బంధువును ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చినప్పుడు వైద్యపరమైన సమాచార లోపం ఎంత తీవ్రంగా ఉందో ఆమెకు అర్థమయింది. పడకలు ఎక్కడ ఉన్నాయో, ఆక్సిజన్‌ ఎక్కడ లభ్యమవుతోందో, ఎక్కడ ఎలాంటి వైద్య సదుపాయాలు దొరుకుతాయో స్పష్టమైన వివరాలు అందుబాటులో లేవని ఆమె గ్రహించారు. ‘‘సమాచారం లేకనో, తెలిసిన సమాచారం సరైనదో కాదో ధ్రువీకరించుకొనే అవకాశం లేకనో రోగులు కీలకమైన సమయాన్ని వృథా చేసుకోవాల్సి వస్తోంది.


ఇది చివరకు ప్రాణాలు పోవడానికి దారి తీస్తోంది. కొంతవరకూ ప్రధాన నగరాల్లోని సౌకర్యాలపై సమాచారం సంపాదించవచ్చు. కానీ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల విషయంలో కష్టమవుతోంది’’ అంటారామె. సాంకేతికతను ఉపయోగించి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించవచ్చని భావించారు. ఆ ఆలోచనలోంచి రూపుదిద్దుకున్నదే ‘కొవిడ్‌ ఆశా’ ఛాట్‌బోట్‌.


9 భాషల్లో సమాచారం

కొవిడ్‌ సెకెండ్‌ వేవ్‌ ఉద్ధృతం అవుతున్న తరుణంలో... ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో ఈ ఛాట్‌బోట్‌ను ఆమె ప్రారంభించారు. వాట్సప్‌, టెలిగ్రామ్‌, వెబ్‌ ద్వారా నిజ సమయంలో బ్లడ్‌ ప్లాస్మా, ఆక్సిజన్‌ సరఫరా, అంబులెన్స్‌లు తదితర అత్యవసర సేవల సమాచారాలను తెలుసుకోడానికి ఈ ఛాట్‌బోట్‌ వీలు కల్పిస్తోంది. ‘‘దీనికి సంబంధించిన సమాచారాన్ని నేను మాధ్యమాల ద్వారా షేర్‌ చేసినప్పుడు... తొలి గంటలో ముగ్గురు స్పందించారు. ఒక రోజులో 50 మంది సభ్యులుగా నమోదు చేసుకున్నారు. ఇప్పుడు లక్ష మందికి పైగా వాలంటీర్లు ఈ బాధ్యతల్లో పాలుపంచుకుంటున్నారు’’ అని చెప్పారు అలైషా. ప్రస్తుతం దేశంలోని 65కు పైగా నగరాలు, పట్టణాల్లో ‘కొవిడ్‌ ఆశా’ సేవలు అందిస్తోంది. తెలుగుతో సహా తొమ్మిది భాషల్లో సమాచారం లభిస్తుంది. మొదట్లో ఇంగ్లీషు, హిందీ భాషల్లో మాత్రమే సమాచారం ఉండేది. కానీ మాతృభాష మాత్రమే తెలిసిన వారి కోసం ఏదైన చెయ్యాలని ఒక విద్యార్థి కోరడంతో... తొమ్మిది భాషలకు దీన్ని విస్తరించారు. 


వాలంటీర్ల సైన్యమే బలం

‘‘ఈ ఏడాది  ఏప్రిల్‌ నెలలో నా ఫ్రెండ్‌ ఒకరు బెంగళూరు ఎయిర్‌ పోర్టు నుంచి కాల్‌ చేసి, ఢిల్లీలో ఉన్న తన తండ్రిని కలుసుకోవడానికి బయలుదేరాననీ, ఆయనకు కొవిడ్‌ సోకి, ఆక్సిజన్‌ స్థాయిలు తక్కువగా ఉండడంతో ఇబ్బంది పడుతున్నారనీ చెప్పింది. ‘ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న అంబులెన్స్‌ ఏర్పాటు చేసే అవకాశమేమైనా ఉందా?’ అని అడిగింది నేను ‘కొవిడ్‌ ఆశా వాట్సప్‌ గ్రూప్‌’లో ఈ సమాచారాన్ని ఉంచాను. ఆమె ఢిల్లీ చేరే సరికి, అన్ని సదుపాయాలతో అంబులెన్స్‌ సిద్ధం చెయ్యగలిగాం’’ అని చెప్పారు అలైషా. ‘కొవిడ్‌ఆశా’కు వాలంటీర్ల సైన్యమే పెద్ద బలం. సౌకర్యాల వివరాలు సేకరించడంతో పాటు ఆక్సిజన్‌ సమకూర్చడం, ఖాళీ అయిన సిలిండర్ల భర్తీ, అంబులెన్స్‌ సేవలకు వీరందరూ ఇతోధికంగా సాయం చేస్తున్నారు. 


సంస్థల సహకారంతో...

అలైషా చొరవపై స్పందించిన గూగుల్‌, ఇవిఎంవేర్‌, హెచ్‌పి తదితర సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి. ఆ సంస్థలకు చెందిన ఇంజనీర్లు, ఇతర విభాగాల నిపుణులు దీనికోసం పని చేస్తున్నారు. అలాగే ఆర్‌సి మెడిక్యూకు చెందిన డాక్టర్‌ విధి షా చొరవతో దేశ వ్యాప్తంగా 65 నగరాల్లో ఆ సంస్థకు చెందిన దాదాపు 350 వైద్య విద్యార్థులూ, నిపుణులు ‘కొవిడ్‌ఆశా’తో చేతులు కలిపారు. సౌకర్యాల లభ్యతపై సమాచారాన్నీ, రోగుల పరిస్థితిపై వాస్తవాలనూ ఎప్పటికప్పుడు ధ్రువీకరిస్తున్నారు.


వారందరి చొరవతోనే ఈ కార్యక్రమం నిరాటంకంగా సాగుతోందంటారు ఆలైషా. దాదాపు అయిదువేల మంది సరఫరాదారులు కూడా ‘కొవిడ్‌ఆశా’కు సహకారం అందిస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 1.38 లక్షల మంది సేవల కోసం సంప్రతించారు. 14 వేలకు పైగా యూజర్లు ఉన్నారు. ‘‘ఈ విపత్కర పరిస్థితుల్లో ఏ చిన్న సాయమైనా ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది. సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చేవారు కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ వారికి ఒక వేదిక కావాలి. నేను చేసిందల్లా అలాంటి ఒక వేదికను ఏర్పాటు చేయడమే. సమష్టిగా పని చేస్తే ఈ మహమ్మారిని దేశం నుంచి సమూలంగా తరిమి కొట్టగలం అనే నమ్మకం నాకుంది’’ అంటారు అలైషా.్ఙ


వాట్సప్‌, టెలిగ్రామ్‌, వెబ్‌ ద్వారా నిజ సమయంలో బ్లడ్‌ ప్లాస్మా, ఆక్సిజన్‌ సరఫరా, అంబులెన్స్‌లు తదితర అత్యవసర సేవల సమాచారాలను తెలుసుకోడానికి ఈ ఛాట్‌బోట్‌ వీలు కల్పిస్తోంది. ఇందులో తొలి రోజు 50 మంది సభ్యులుగా నమోదు చేసుకున్నారు. ఇప్పుడు లక్ష మందికి పైగా వాలంటీర్లు ఈ బాధ్యతల్లో పాలు పంచుకుంటున్నారు. 

Updated Date - 2021-06-05T05:08:16+05:30 IST