కష్టాల్లో కాసులకు కక్కుర్తి

ABN , First Publish Date - 2021-05-04T15:23:55+05:30 IST

ప్రాణాంతక కరోనా వైరస్‌ బారినపడుతున్న..

కష్టాల్లో కాసులకు కక్కుర్తి

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆగని దందా!

ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్లు లేక పరుగులు 

కరోనా లేకున్నా చికిత్స పేరుతో దోపిడీ 

జనరల్‌ వార్డుల్లో రూ.40 నుంచి 50 వేలు

షేరింగ్‌ అయితే రూ. 60 నుంచి 70 వేలు

వెంటిలేటర్‌తో ఐసీయూలో చికిత్సకు రూ. 75వేల నుంచి రూ.లక్షపైనే.. 

అడ్డగోలు ఫీజులకు బిల్లులు ఇవ్వని వైనం 

ప్రభుత్వ ధరలు, ఆరోగ్యశ్రీ పేరెత్తితే నో బెడ్‌


ఆంధ్రజ్యోతి-విజయవాడ: ప్రాణాంతక కరోనా వైరస్‌ బారినపడుతున్న బాధితులకు ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్స్‌ దొరకడం లేదు. బాధితులు రెండు, మూడు రోజుల్లోనే ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోయి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోతున్నారు. వెంటనే ఆక్సిజన్‌ అందించి చికిత్స ఇవ్వకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక భారమైనా ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. కొందరైతే చిన్న అనుమానం వచ్చినా ముందుగానే ఆసుపత్రిలో చేరిపోతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు అడ్డగోలు ఫీజులతో దోచేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు చూపిస్తుంటే బెడ్స్‌ ఖాళీలు లేవని వెనక్కి పంపేస్తున్నారు. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో రూ. లక్షలు ధారబోస్తున్నామని బాధితులు వాపోతున్నారు. 


స్థానిక ఆటోనగర్‌లో మెకానిక్‌గా పనిచేసే పి. వెంకట నాగభూషణం కరోనా అనుమానంతో ఈనెల 9న సన్‌రైజ్‌ ఆసుపత్రిలో చేరాడు. 10రోజుల తరువాత చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యల్లో ఆగ్రహం పెల్లుబుకింది. ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. రోజుకు రూ.లక్షన్నర చొప్పున 10 రోజులకు 15లక్షలు చెల్లించామని, అయినా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించటతో నాగభూషణం ప్రాణాలను కాపాడలేకపోయారని, పైగా వాటికి బిల్లులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. వివాదం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లటంతో వారు విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యుల ఆరోపణలు నిజమని తేలటం, పైగా అనధికారికంగా ఆసుపత్రిలో చికిత్స చేయటం వంటి కారణాలతో ఆసుపత్రి రిజిస్ర్టేషన్‌ రద్దు చేశారు. ఇంకెవరైనా ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికి 15రోజులు గడిచినా ప్రైవేటు ఆసుపత్రుల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. బాధితుల నుంచి అడ్డగోలుగా దోపిడీని కొనసాగిస్తూనే ఉన్నారు. 


విరేచనాలని వెళితే.. 

విరేచనాలతో బాధపడుతూ చికిత్సకు వెళ్లిన మహిళకు కరోనా వచ్చిందని చెప్పి చికిత్స పేరుతో రూ. లక్షలు వసూలు చేసిన మరో ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం 1వ తేదీన వెలుగు చూసింది. సీతారామపురరానికి చెందిన వణుకూరు లక్ష్మి (51) విరేచనాలతో బాధపడుతూ గత నెల 16న పుష్పహోటల్‌కు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చిందని చికిత్సకు రూ.2లక్షలు వసూలు చేశారు. తీరాచూస్తే గత శనివారం ఆమె మరణించింది. పెండింగ్‌ బిల్లు మరో రూ.2లక్షలు కట్టి మృతదేహాన్ని తీసుకువెళ్లాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి మృతదేహం నుంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్ష చేయించగా నెగెటివ్‌ వచ్చింది. దీంతో యజమాన్యం రాజీకి వచ్చిన కుటుంబ సభ్యులు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేసి కేసు లేకుండా రాజీ చేసుకున్నారు. ఈ సంఘటనలు ఉదాహరణలు మాత్రమే. వెలుగులోకి రాని ఇలాంటి ఉదంతాలు ఇంకా ఎన్నెన్నో... 


చికిత్సకు రూ. వేలు.. లక్షలే!

ఐసీయూలో చేర్చి వెంటిలేటర్‌పై చికిత్స అందించడానికి రోజుకు రూ. 75 వేల నుంచి రూ. లక్షకు పైగా పీజు వసూలు చేస్తున్నారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న బాధితులను జనరల్‌ వార్డుల్లో చికిత్స అందించడానికి రోజుకు రూ. 40 నుంచి 50 వేలు వసూలు చేస్తున్నారు. అలా కాదంటే షేరింగ్‌ రూములను ఆఫర్‌ చేస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు బాధితులు కలిసి రూము షేర్‌ చేసుకుంటే రోజుకు రూ. 60 నుంచి రూ. 70 వేల వరకు ఛార్జి చేస్తున్నారు. ఈ చికిత్సకు వారం నుంచి రెండు పాటు చికిత్స తీసుకోవాల్సి ఉండటంతో వారం రోజులకు ఒక ప్యాకేజీ, రెండు వారాలకు మరో ప్యాకేజీ కింద ధరలు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారు. ఈటికి బిల్లులు ఇస్తున్నారా? అంటే అదీ లేదు. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్లు, మెడికల్‌ ఇన్స్యూరెన్స్‌ పథకాల కింద బిల్లులు రాబట్టుకునేందుకు కొంతమంది బిల్లులు అడుగుతుంటే ఇవ్వమని కచ్చితంగా చెబుతున్నారు. తమ కండిషన్లకు ఒప్పుకున్న వారికే వైద్యసేవలందిస్తున్నారు.


జిల్లాలో 73 ‘ప్రైవేటు’కు అనుమతులు 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్‌ లేక జిల్లా అధికారులు ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. జిల్లాలో 73 ప్రైవేటు ఆసుపత్రులకు 4,600 బెడ్స్‌ కేటాయించి చికిత్సకు అనుమతులిచ్చారు. ఆరోగ్యశ్రీ పథకం కింద బాధితులకు వైద్యం అందించాలని, ఐసీయూలో వెంటిలేటర్‌పై క్రిటికల్‌ కేర్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తే రోజుకు రూ. 14వేల నుంచి రూ. 16వేలు, కేవలం ఐసీయూలో ట్రీట్‌మెంట్‌కు రూ. 10 నుంచి 12 వేలు, నాన్‌ క్రిటికల్‌ కేర్‌ వార్డుల్లో ఆక్సిజన్‌ అందిస్తూ చికిత్స చేస్తే రోజుకు రూ. 5వేల నుంచి 6,500లు, నాన్‌ క్రిటికల్‌ కేర్‌ వైద్యానికి రోజుకు రూ. 3నుంచి రూ. 6 వేలు మించకుండా ఫీజులు వసూలు చేయాలని ధరలు నిర్ణయించింది. ఇవి ఎక్కడా అమలు కావడం లేదు. గట్టిగా ప్రశ్నిస్తే.. బెడ్స్‌ ఖాళీలు లేవంటూ తేల్చేస్తున్నారు. కొన్నిచోట్ల రెండింతల బెడ్స్‌ను వేసుకుని రూ.కోట్లు దండుకుంటున్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌ హోమ్‌లు, క్లినిక్‌లు కూడా అనధికారికంగా బాఽధితులకు వైద్యసేవలందిస్తూ రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేసుకుంటున్నారు. 


టెస్టుల నిర్వహణకూ నిలువు దోపిడీ 

ప్రభుత్వం నిర్వహిస్తున్న కొవిడ్‌ టెస్టులు నామమాత్రంగానే ఉండటంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబొరేటరీలను ఆశ్రయిస్తున్నారు. వీటికి కూడా ప్రభుత్వం పరిమిత సంఖ్యలో పర్మిషన్‌ ఇచ్చి.. ఫీజులు నిర్ధారించింది. కరోనా పరీక్షకు రూ.499, సీటీ స్కాన్‌కు రూ.3వేలకు మించి వసూలు చేయకూడదు. కానీ ప్రైవేటు ల్యాబ్‌లో కొవిడ్‌ టెస్టుకు రూ.2నుంచి రూ. 3వేలు, సీటీ స్కాన్‌కు రూ.5 నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారు. 24 గంటల్లో రిపోర్టు కావాలంటే అదనం. అనుమతులు లేని అనేక ప్రైవేటు ల్యాబ్‌ల నిర్వాహకులు అనుమానితులను దోపిడీ చేస్తున్నారు. 


పర్యవేక్షణ ఏదీ?  

అధిక ఫీజులు చేయకుండా బాధితులకు మెరుగైన వైద్యసేవలందించేలా పర్యవేక్షించేందుకు నోడల్‌ అధికారులు, ప్రైవేటు ల్యాబ్‌లలో టెస్టుల నిర్వహణపైనా పర్యవేక్షణకు కమిటీలను ఏర్పాటు చేశారు. కానీ వీరేమి సమర్థవంతంగా పనిచేయడం లేదు. 


Updated Date - 2021-05-04T15:23:55+05:30 IST