దెబ్బే.. కానీ అంకెలు దిగవు

ABN , First Publish Date - 2020-03-26T07:47:41+05:30 IST

కరోనా వైరస్‌ రాష్ట్ర సొంత ఆదాయాలను చావుదెబ్బ తీస్తుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్న

దెబ్బే.. కానీ అంకెలు దిగవు

కరోనా, లాక్‌డౌన్‌తో అంచనా కుదేలు

గణనీయంగా తగ్గనున్న ఆదాయాలు

అయినా,బడ్జెట్‌ అంకెల్లో మార్పుల్లేవు

టైం లేదని పాత లెక్కలే ఆర్డినెన్స్‌లో

1.99 లక్షల కోట్లకు కుదింపే లక్ష్యం


అమరావతి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ రాష్ట్ర సొంత ఆదాయాలను చావుదెబ్బ తీస్తుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు. కరోనా కట్టడి కోసం కేంద్రం వేలకోట్లు వెచ్చించాల్సి వస్తుండటం, ఆర్థిక మందగమనానికి తోడు లాక్‌డౌన్‌ కారణంగా దేశ ఆర్థికవ్యవస్థ కూడా చిన్నాభిన్నమైపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.10,000 కోట్లు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. రాబోయే నెలల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా గడ్డు పరిస్థితులు ఎదురవ్వక తప్పదని భావిస్తున్నారు. అయినా, కరోనా ప్రభావం రాబోయే రాష్ట్ర బడ్జెట్‌లోని అంకెలపై ఏమీ ప్రభావం చూపబోదని ఆ శాఖ అధికారులు చెప్పారు. 


గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో 14,000 పద్దులుండేవి. ఇప్పుడు తాజాగా వివరణాత్మక పద్దుల పేరుతో మరికొన్ని వేల పద్దులు చేర్చారు. కాబట్టి, మార్చి 31లోగా బడ్జెట్‌లో అంచనాలన్నీ సవరించాలంటే ఇంత తక్కువ సమయంలో ఇది అయ్యే పనికాదని ఆ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఆదాయాలు తగ్గుతాయని తెలిసినా ఇంతకుముందు బడ్జెట్‌లో వేసిన అంకెలనే ఆర్డినెన్స్‌ కోసం గవర్నర్‌ వద్దకు పంపే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో వేసిన అంచనాలకు, వాస్తవ ఆదాయానికి మధ్య రూ.90,000 కోట్ల తేడా ఉంది. కాబట్టి, వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా వాస్తవిక ఆదాయాల మేరకు బడ్జెట్‌ను రూపొందించాలన్నది లక్ష్యం. ఇందుకోసం ముందు రూ.1.8లక్షల కోట్లకు బడ్జెట్‌ కుదించాలనుకున్నప్పటికీ సాధ్యపడక రూ.1.99 లక్షల కోట్లుగా పెట్టుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.2.27 లక్షల కోట్లుగా అంచనా వేశారు. కాబట్టి, పాత బడ్జెట్‌కు రూ.28,000 కోట్లు కోత పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుత బడ్జెట్‌లో నవరత్నాలన్నీ అమల్లోకి రాలేదు. కానీ, వచ్చే బడ్జెట్‌లో వాటిని పూర్తిస్థాయిలో అమల్లోకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖర్చులు పెరిగినప్పటికీ బడ్జెట్‌కు ఎలా కోత పెట్టాలనే అంశంపై ఆర్థికశాఖ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. 

Updated Date - 2020-03-26T07:47:41+05:30 IST