పంపిణీలో పొలికేక

ABN , First Publish Date - 2020-04-05T10:56:49+05:30 IST

కరోనా.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొంతలోకొంత పేదలను ఆదుకోవాలని, అర్హులైన కుటుంబాలకు వెయ్యి రూపాయల నగదును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శనివారం పంపిణీ చేశాయి.

పంపిణీలో పొలికేక

గ్రామాల్లో అధికారపక్షానిదే పెత్తనం

 రంగంలోకి దిగిన అభ్యర్థులు 

  వలంటీర్లను పక్కన పెట్టి మరీ దూకుడు   

  అంతా తమదే అన్నట్టుగా వ్యవహారం

 మధ్యాహ్నం వరకు సర్వర్‌ మొరాయింపు   

  తొలి రోజు 70 శాతం మందికి వెయ్యి నగదు  

  చాలా చోట్ల కొందరికి మొండి చెయ్యే 


మొన్న రేషన్‌ సరఫరా.. నిన్న పింఛన్ల పంపిణీ.. నేడు వెయ్యి రూపాయలు ఆర్థికసాయం. అన్నింటిలోనూ అధికారపక్షం ఏకపక్షంగా తమదైన పాత్ర పోషించింది. ప్రభుత్వ పథకాల అమలులో వేరెవరి ప్రమేయం ఉండకూడదనే నిబంధనలను కాలరాశారు. అంతకంటేమించి ఒక అడుగు ముందుకేసి భవిష్యత్‌లో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయదలచినవారు కూడా ఏకంగా అంతా తామే అన్నట్టుగా వ్యవహరించారు. ఈ మూడు పథకాల పంపిణీలో అంతా తామే అన్నట్టుగా వ్యవహరించారు. కొందరు వ్యతిరేకిస్తున్నా, మరికొందరు సర్దిచెబుతున్నా బేఖాతరు చేస్తున్నారు. 


(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :కరోనా.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొంతలోకొంత పేదలను ఆదుకోవాలని, అర్హులైన కుటుంబాలకు వెయ్యి రూపాయల నగదును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శనివారం పంపిణీ చేశాయి. దీనిని ఆసరాగా తీసుకుని పలు గ్రామాల్లో స్థానిక నేతలు వలంటీర్ల సమక్షంలోనే పెత్తనం చేశారు. వెయ్యి రూపాయలు పంపిణీ చేశారు. ఫోజులిస్తూ ఫొటోలు దిగారు. ఐదుగురికంటే మించి ఎక్కడ గుమిగూడరాదన్న నిబంధనను పక్కనపెట్టారు. పలకరింపులు, పరామర్శలతో ఎన్నికల సీను సృష్టించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 11 లక్షల కుటుం బాలకు 114 కోట్ల రూపాయలు ఆర్థికసాయం అందించాలని సంకల్పించారు. ప్రతీ కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున వలంటీర్ల చేతులమీదుగానే చేర్చాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది.


ఎప్పుడైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికసాయాన్ని ప్రకటించాయో తగ్గట్టుగానే ప్రజల్లోనూ కొంత ఊరట లభించింది. కరోనా కష్టం నుంచి కొంతలోకొంత తాము ఒత్తిడికి దూరమవుతామని భావించారు. అయితే అందివచ్చిన ఏ అవకాశాన్ని అధికారపక్షం వదులుకోవడానికి సిద్ధంగా లేనేలేదు. అందుకనే రేషన్‌, పింఛను పంపిణీలోనూ తమకంటూ ‘గుర్తింపు’ వచ్చేలా గ్రామ, పట్టణస్థాయిలో పెత్తనం చేశారు. ప్రత్యేకించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే నామినేషన్లు వేసిన అభ్యర్థులతోపాటు భవిష్యత్‌లో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార పగ్గాలు చేజిక్కించుకోవాలనుకునేవారు తాజాగా కార్యరం గంలోకి దూకారు. వలంటీర్లతో సమానంగా వీధుల్లో తిరిగారు. ఒక పక్కన వలంటీర్లు తమ పని తాము చేసుకుంటుండగా, ఆర్థికసాయం ఏదో తామే అందిస్తున్నట్టుగా కొంతమంది అభ్యర్థులు రెచ్చిపోయి వ్యవహరించారు. ‘కరోనా కష్టాల్లో ఉన్నారు,  వెయ్యి రూపాయల నగదు తీసుకోండి, పొదుపుగా వాడుకోండి. ఈ పదిరోజులు ఇళ్ళ వద్దే జాగ్రత్త’ అంటూ పలకరింపులకు దిగారు.  గోపాలపురం మండలంలో మాత్రం కొన్ని పార్టీలకు చెందినవారు ఏకంగా దూకుడుగా వ్యవహరించారు.


వలంటీర్‌ లేకుండానే వెయ్యి రూపాయలను చేతిలో పెట్టిమరీ జాగ్రత్త అంటూ తామే కీలక బాధ్యతలు పోషించారు. వాస్తవానికి పరిషత్‌, మునిసిపల్‌ ఎన్నికలను ఇప్పటికే ఎన్నికల సంఘం వాయిదా వేసింది. అనుకోని రీతిలో లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి అభ్యర్థులందరికీ చేతినిండా పని లేకుండా పోయింది. అనుకున్నట్టుగానే రేషన్‌, పింఛను పంపిణీ వీరందరికీ కలిసొచ్చింది. వరుసగా వారం రోజుల వ్యవధిలోనే మూడు పథకాలకు సంబంధించి పంపిణీలు జరుగుతుండడంతో ఇదే అదునుగా భావించి అభ్యర్థులు, వారి అను చరగణం, బంధువులు ఎక్కడికక్కడ వీటన్నింటిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నించారు.


మిగతా పార్టీలను స్వరం ఎక్కడ వినిపించకపోవడంతో అధికారపక్షమే అంతా తామే అన్నట్టుగా వ్యవహరించింది. చాగల్లు, తాళ్ళపూడిల్లో మంత్రి వనిత వెయ్యి రూపాయల పంపిణీని ఆరంభించారు. పేదలను ఆదుకునేందుకే వెయ్యి రూపాయలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ కష్టకాలంలో ఇది మీకు ఉపయోగపడుతుంది ’ అని అందరికీ ఊరటనిచ్చే విధంగా అనునయ వ్యాఖ్యలు చేశా రు. ఎమ్మెల్యేలు సైతం తమ నియోజకవర్గాల్లో వీలైన చోటల్లా వెయ్యి రూపాయల పంపిణీలోనూ ఒక చేయి వేశారు. 


Updated Date - 2020-04-05T10:56:49+05:30 IST