వలస కార్మికుల అంశంపై కేంద్ర రాష్ట్రాలపై సుప్రీంకోర్టు కన్నెర్ర

ABN , First Publish Date - 2020-05-28T21:44:38+05:30 IST

న్యూఢిల్లీ: వలస కార్మికుల అంశంపై కేంద్ర రాష్ట్రాలకు సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.

వలస కార్మికుల అంశంపై కేంద్ర రాష్ట్రాలపై సుప్రీంకోర్టు కన్నెర్ర

న్యూఢిల్లీ: వలస కార్మికుల అంశంపై కేంద్ర రాష్ట్రాలకు సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. బస్సు, రైలు ప్రయాణాల్లో వలస కార్మికుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఛార్జీలు వసూలు చేయరాదని, రాష్ట్రాలు భరించాలని ఆదేశించింది. అంతేకాదు వలస కార్మికులకు బస్సులు, రైళ్లలో ఆహారం అందించాలని స్పష్టం చేసింది. రైలు ప్రయాణం చేస్తున్న వలస కార్మికులకు మార్గ మధ్యంలో రైల్వే శాఖనే ఆహారం అందించాలని సూచించింది. వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు బయలు దేరే ముందే ఆయా రాష్ట్రాలు మంచినీళ్లు, ఆహారం అందించాలని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. ముఖ్యంగా రోడ్ల వెంబడి నడుస్తోన్న వలస కార్మికులకు తక్షణమే సాయం అందించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది.  సహాయ శిబిరాలకు తరలించి ఆహారంతో పాటు కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సొంతూళ్లకు వెళ్లేందుకు వలస కార్మికులు పడుతున్న కష్టం చూసి గుండె తరుక్కుపోతోందని సుప్రీంకోర్టు తెలిపింది. వలస కార్మికుల విషయంలో అనేక లోటుపాట్లను తాము గుర్తించామని తెలిపింది. రిజిస్ట్రేషన్, ట్రాన్స్‌పోర్టేషన్‌తో పాటు ఆహారం మంచినీళ్లు అందించే ఏర్పాట్లలో లోపాలు గుర్తించామని సుప్రీంకోర్టు తెలిపింది. 


మరోవైపు ఇప్పటివరకూ కోటి మంది వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చినట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. వలస కార్మికులను ఆలస్యంగా తరలించాల్సి రావడానికి గల కారణాలపై సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. కరోనా వ్యాప్తి చెందకుండా చూడటంతో పాటు ఆసుపత్రుల్లో తగిన ఏర్పాట్లు చేసుకున్నాకే కార్మికుల తరలింపు ప్రారంభించామని కేంద్రం తెలిపింది. 

Updated Date - 2020-05-28T21:44:38+05:30 IST