థర్డ్‌ వేవ్‌

ABN , First Publish Date - 2022-01-20T04:24:12+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఈ సీజన్‌లోనే అత్యధికంగా బుధవారం ఒక్కరోజే 698 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

థర్డ్‌ వేవ్‌

వేగంగా విస్తరిస్తున్న వైరస్‌ 

భారీగా పెరిగిన పాజిటివిటీ

2005 శాంపిల్స్‌లో 698 కేసులు

11 రోజులలో 2,985 నమోదు

టెస్టులు పెరిగితే మరిన్ని కేసులు

తస్మాత్‌ జాగ్రత్త : వైద్య నిపుణులు


ప్రజలను రెండేళ్లుగా అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ మూడోసారి కూడా జిల్లాను కబళిస్తోంది. క్రిస్మస్‌, ఆంగ్ల సంవత్సరాది ఆ వెంటనే సంక్రాంతి పండుగ రావడంతో భారీ సంఖ్యలో జనం సంబరాల్లో పాల్గొనడం, ప్రయాణం చేయడంతో ఆకలి మీదున్న వైర్‌సకు మంచి ఆహారం దొరికినట్లయింది. ఆటపాటలు, షాపింగ్‌, సినిమాలు అంటూ వేలాది మంది ఒకేసారి రోడ్లమీదకు రావడంతో వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. పది రోజుల క్రితం వరకు స్వల్పంగా ఉన్న కేసులు ఇప్పుడు అమాంతం వందలకు చేరాయి. పరీక్ష కేంద్రాల సంఖ్య పెరిగి శాంపిల్స్‌ సేకరణ కూడా పెరిగితే ఇంకా పెద్ద మొత్తంలో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.


నెల్లూరు(వైద్యం), జనవరి 19 : జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఈ సీజన్‌లోనే అత్యధికంగా బుధవారం ఒక్కరోజే 698 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అది కూడా  కేవలం 2005 నమూనాలు సేకరించగా వాటిలో 698 పాజిటివ్‌లతో సుమారు 35 శాతం పాజిటివిటీ నమోదు కావడం ఇటు సామాన్యులను, అటు వైద్య వర్గాలను తీవ్ర ఆందోళ నకు గురిచేస్తోంది. ఈ క్రమంలో జిల్లాపై కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రభావం తీవ్రంగా కనిపి స్తోంది. ఈ నెల ప్రారంభంలో స్వల్పంగా ఉన్న కేసులు ఐదారు తేదీల నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చాయి. 2వ తేదీ 6 కేసులు నమోదుకాగా, 9వ తేదీ 103 కేసులు నమోద య్యాయి. అక్కడి నుంచి కేవలం 11 రోజుల వ్యవధిలో 2,985 పాజిటివ్‌లు నమోదు కావటం జిల్లాలో వైరస్‌ ఎంత వేగంగా వ్యాపిస్తోందో తెలియజేస్తోంది. 


జిల్లా అంతటా...

నెల్లూరు నగరంతోపాటు సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, ఆత్మకూరు, కావలి, కలువాయి, ఉదయగిరి, అనంతసాగరం, ఎస్‌ఆర్‌ పురం తదితర ప్రాంతాల్లో కరోనా కేసులు ఊపందుకుంటున్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఒమైక్రాన్‌ కేసులు నమో దవుతున్నా జిల్లాలో మాత్రం ఒక్క కేసు కూడా లేకపోవడం కొంత వరకు ఊరటనిచ్చే అంశం. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా 7 రోజులు హోం ఐసోలేషన్‌ లో ఉండాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం వల్ల కొంత వరకు ఒమైక్రా న్‌ను అరికట్టగలుగుతున్నారు. కానీ, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు గ్రామ స్థాయిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ చాలా మంది నిబంధనలు పాటించకపోవడం, అజాగ్రత్త వంటివి అనర్థాలకు దారితీస్తోంది. పట్టణాల్లో ఎక్కడ చూసినా గుంపులు, గుంపులుగా జనం చేరుతుండటం వైరస్‌ వ్యాప్తికి దోహదం చేస్తోంది. 


టెస్టులు పెరిగితే...

జిల్లాలో కొవిడ్‌ అనుమానితుల నుంచి శాంపిల్స్‌ సేకరణ ఇంకా వేగం పుంజుకోలేదు. ప్రస్తుతం రోజుకు 2 వేల నుంచి 3 వేల నమూనాలు సేకరిస్తున్నారు. వాటిలోనే వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. సెకండ్‌ వేవ్‌లో మాదిరిగా విస్తృతంగా పరీక్ష, శాంపిల్స్‌ సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తే భారీ సంఖ్యలో పాజిటివ్‌లు నమోదయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, 2020 మార్చిలో జిల్లాలో తొలి కరోనా కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య  1,50,360కు చేరింది. ఫస్ట్‌ వేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌లో ఎక్కువ మందిని కరోనా బలి తీసుకుంది. ప్రస్తుత థర్డ్‌వేవ్‌ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 


నిబంధనలు పాటించాలి


కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. నిబంధనలు పాటించక పోతే కొవిడ్‌ బారిన పడే అవకాశం ఉంది. ఒమైక్రాన్‌ కూడా పొంచి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మరిన్ని జాగ్రత్తలు అవసరం. మాస్క్‌ లేకుండా బయటకు రాకూడదు. వైద్యులు సూచించిన నిబంధనలు తప్పక పాటించాలి. 

- డాక్టర్‌ కృష్ణమార్తి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, జీజీహెచ్‌


Updated Date - 2022-01-20T04:24:12+05:30 IST