గ్రేటర్‌ను వీడని కరోనా

ABN , First Publish Date - 2022-01-22T15:23:57+05:30 IST

గ్రేటర్‌లో కరోనా కేసులు భయపెడుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో శుక్రవారం కొత్తగా 1,670 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో యూపీహెచ్‌సీ

గ్రేటర్‌ను వీడని కరోనా

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌లో కరోనా కేసులు భయపెడుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో శుక్రవారం కొత్తగా 1,670 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో యూపీహెచ్‌సీ కేంద్రాల్లో కొవిడ్‌ టెస్ట్‌లు చేయించుకునేందుకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. టెస్ట్‌లు చేయించుకునేం దుకు ఉదయం నుంచే క్యూ కడుతున్నారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌లలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఆయా ప్రాంతాల్లోనే శుక్రవారం సుమారు వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.


క్లినిక్‌ల వద్ద క్యూ 

గాజుల రామారం: ఓ పక్క కరోనా నిర్ధారణ పరీక్షలు, మరో పక్క వ్యాక్సినేషన్‌.. సిటీ జనం ఆస్పత్రుల ఎదుట క్యూ కడుతున్నారు. సీజనల్‌ వ్యాధులూ విజృంభిస్తుండటంతో చిన్న క్లినిక్‌లకు బాధితుల తాకిడి పెరుగుతోంది. గాజుల రామారం డివిజన్‌ పరిధిలోని దేవేందర్‌ నగర్‌లోని ఓ క్లినిక్‌కు వారం క్రితం 30 నుంచి 40 మంది వచ్చే వారు. ప్రస్తుతం రోజుకు వంద మంది వస్తున్నారు. వీరిలో ఎక్కువగా జ్వరం, జలుబు, స్వల్పంగా దగ్గుతో బాధపడుతున్నారని అక్కడి వైద్యుడు చెప్పారు. ఇలా ఏ ప్రాంతంలో చూసినా.. స్థానికంగా ఉన్న చిన్న చిన్న క్లినిక్‌లు, ఆర్‌ఎంపీల వద్ద రద్దీ కనిపిస్తోంది. 


 రైల్వే సిబ్బందికి..

బర్కత్‌పుర: కాచిగూడ రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పలువురు  ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. స్టేషన్‌లోని 200మంది సిబ్బందిలో 15మంది కరోనా బారిన పడ్డారు. స్టేషన్‌ మేనేజర్‌ ఐఓడబ్ల్యూతోపాటు టీసీలు, టికెట్‌   బుకింగ్‌ క్లర్కులు, లోకో పైలెట్స్‌ కరోనా బారిన పడ్డారు. దీంతో స్టేషన్‌లోని సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


జ్వరమొచ్చిందా? 

సిటీలో సర్వే షురూ..

బంజారాహిల్స్‌/మారేడ్‌పల్లి: గ్రేటర్‌లో ఫీవర్‌ సర్వేను జీహెచ్‌ఎంసీ బృందాలు శుక్రవారం ప్రారంభించాయి. బస్తీలు, కాలనీల్లో వైద్యసిబ్బందితో కలిసి జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ ఫీవర్‌ సర్వే చేపడుతున్నారు. గ్రేటర్‌లో సుమారు 1,400కు పైగా బృందాలు ఫీవర్‌ సర్వేలో పాల్గొంటున్నాయని అధికారులు తెలిపారు. బంజారాహిల్స్‌ ఎన్‌బీటీ నగర్‌లో నిర్వహించిన ఫీవర్‌ సర్వేను మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి పరిశీలించారు. ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లకు ప్రైవేట్‌ ఆస్పత్రుల ల్యాబ్‌లలో రూ.500 మాత్రమే చార్జ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దానికంటే ఎక్కువ చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. కంటోన్మెంట్‌ బోర్డు 5వ వార్డు పరిధిలోని సంజీవయ్యనగర్‌, రసూల్‌పురా ప్రాంతాల్లో నిర్వహించిన ఫీవర్‌ సర్వేను కలెక్టర్‌ రెవెన్యూ, వైద్య బృందంతో కలిసి పరిశీలించారు. 

Updated Date - 2022-01-22T15:23:57+05:30 IST