కరోనా.. కొత్త లక్షణాలు!

ABN , First Publish Date - 2021-04-07T07:09:12+05:30 IST

కరోనా లక్షణాలంటే జలుబు, పొడి దగ్గు, కొద్దిగా జ్వరం, ఒళ్లునొప్పులు, అలసట, వాసన, రుచి తెలియకుండా పోవడం.. ఇవే చెప్పేవారు! కానీ,

కరోనా.. కొత్త లక్షణాలు!

పొత్తికడుపులో నొప్పి, వాంతులు, వికారం, కీళ్లు, కండరాల నొప్పులు

సెకండ్‌ వేవ్‌లో ఆస్పత్రుల్లో చేరుతున్నవారు ఎక్కువ


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6: కరోనా లక్షణాలంటే జలుబు, పొడి దగ్గు, కొద్దిగా జ్వరం, ఒళ్లునొప్పులు, అలసట, వాసన, రుచి తెలియకుండా పోవడం.. ఇవే చెప్పేవారు! కానీ, ఇప్పుడు సెకండ్‌ వేవ్‌లో కరోనా సోకినవారిలో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. మరణాల రేటు తక్కువగానే ఉన్నా ఈసారి కరోనా వల్ల ఆస్పత్రుల పాలవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది.


బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, బ్రిటన్‌ వేరియంట్ల వల్ల వైర్‌సలో జరుగుతున్న ఉత్పరివర్తనాల వల్ల ఇన్ఫెక్షన్‌ తీవ్రత బాగా పెరుగుతోందని వైద్యనిపుణులు అంటున్నారు. వైరస్‌ మరింత శక్తిమంతంగా మారి సోకినవారిలో కొత్త లక్షణాలకు కారణమవుతోందని, శరీరంలోని కీలకమైన అవయవాలపై దాడి చేస్తోందని చెప్పారు.


వైరస్‌ సోకిన వారిలో పొత్తికడుపులో నొప్పి, వాంతులు, వికారం, కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు, నీరసం, ఆకలి లేకపోవడం వంటి కొత్త లక్షణాలను గుర్తించారు. జీర్ణవ్యవస్థలో భారీగా ఉండే ఏసీఈ2 గ్రాహకాలకు అతుక్కుని వైరస్‌ తన సంఖ్యను పెంచుకుంటోందన్నారు. ఈ లక్షణాలు కనిపించినవారిలో జ్వరం, దగ్గు వంటి సమస్యలు లేకపోవడాన్ని గమనించారు. 



తీవ్ర ఇన్ఫెక్షన్‌?

మొదటి వేవ్‌లో కరోనా సోకిన చాలా మందిలో ఎలాంటి లక్షణాలూ కనిపించలేదు. కొందరిలో కొద్దిపాటి లక్షణాలు మాత్రం కనిపించాయి. అతి తక్కువ మందికి సీరియస్‌ అయినా బతికి బయటపడ్డారు. ప్రాణాలు కోల్పోయినవారు 1.4ులోపే. కానీ సెకండ్‌ వేవ్‌లో కరోనా మరింత ఉధృతంగా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య 50 వేల నుంచి 97 వేలకు చేరడానికి నిరుడు కొన్ని నెలలు పడితే ఈసారి రోజువారీ కేసుల సంఖ్య కొన్ని రోజుల్లోనే లక్ష దాటేయడమే ఇందుకు నిదర్శనం.


బీపీ, షుగర్‌, హృద్రోగాల వంటివి ఉన్నవారిలో ఇన్ఫెక్షన్‌ తీవ్రంగా ఉంటోంది. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అయితే.. సమర్థమైన చికిత్సా విధానాలు అందుబాటులో ఉండడం వల్ల మరణాల సంఖ్య మాత్రం మొదటి వేవ్‌తో పోలిస్తే సగమే. ఆస్పత్రుల పాలయ్యేవారి సంఖ్య మరింత పెరిగితే వైద్య వ్యవస్థలన్నీ కుప్పకూలే ముప్పు ఉందని నిపుణులు అంటున్నారు. గతేడాది చివరి నుంచి చాలామంది మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జా


గ్రత్తలు తీసుకోవడం మానేశారు. ఫలితంగా కేసుల సంఖ్య కిందటి ఏడాది నాటి పతాకస్థాయిని దాటింది. ఈసారి వైరస్‌ సోకినవారిలో వైరల్‌లోడ్‌ ఎక్కువగా ఉండడాన్ని వైద్యులు గుర్తించారు. వైరల్‌ లోడ్‌ ఎంత ఎక్కువ ఉంటే వారి నుంచి ఇతరులకు సోకే ముప్పు అంత ఎక్కువ. కాగా, ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న పలువురి మెదడులో రక్తం గడ్డ కట్టిన దుష్ప్రభావానికి టీకాతో సంబంధం ఉండొచ్చని ఐరోపా ఔషధ ఏజెన్సీ, వ్యాక్సిన్‌ అధ్యయన బృంద సారథి మార్కో కవలెరీ అభిప్రాయపడ్డారు. 




మాస్క్‌, వెంటిలేషన్‌ ముఖ్యం


చిన్నసైజు గదుల్లో ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాపించకుండా ఉండాలంటే.. భౌతిక దూరం కంటే మాస్కులు ధరించడం, వెంటిలేషన్‌ ముఖ్యమని అమెరికా పరిశోధకులు తేల్చారు. దీనికి సంబంధించి సెంట్రల్‌ ఫ్లోరిడా వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయన ఫలితాలు ఫిజిక్స్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 9 అడుగుల ఎత్తు, 709 చదరపు అడుగుల వైశాల్యమున్న రెండు తరగతి గదులను ఈ పరిశోధన కోసం సృష్టించారు. అమెరికాలోని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ కూడా స్కూళ్లు, వ్యాపార కార్యాలయాల్లో మాస్కుధారణ తప్పనిసరిగా పేర్కొంటూ... దూరాన్ని మాత్రం 3 అడుగులకు తగ్గించింది. 


Updated Date - 2021-04-07T07:09:12+05:30 IST