దడ పుట్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్.. టెన్షన్లో ప్రపంచ దేశాలు..
ABN , First Publish Date - 2021-11-27T13:13:32+05:30 IST
ప్రపంచ దేశాలను కొత్త కరోనా వేరియంట్ వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తున్న బి.1.1.529 వేరియంట్ దడ పుట్టిస్తోంది.
దడ పుట్టిస్తున్న ‘బి.1.1.529’ కరోనా వేరియంట్
‘ఒమైక్రాన్’ అని పేరు పెట్టిన డబ్ల్యూహెచ్‌వో
‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటన
ముందుజాగ్రత్త చర్యల్లో బ్రిటన్, సింగపూర్,
మలేషియా, జపాన్, ఇజ్రాయెల్, ఇటలీ, జర్మనీ
6 ఆఫ్రికా దేశాల విమాన సర్వీసులపై నిషేధం
అదే బాటలో ఈయూ దేశాలు
దక్షిణాఫ్రికాలో వందకుపైగా కేసులు
బొట్స్వానా, హాంకాంగ్‌లోనూ పలువురికి..
అప్రమత్తమైన భారత్.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ
ఆ 3 దేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి
కొత్త వేరియంట్లో 50 ఉత్పరివర్తనాలు
ప్రపంచ దేశాలను కొత్త కరోనా వేరియంట్ వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తున్న బి.1.1.529 వేరియంట్ దడ పుట్టిస్తోంది. దీనికి ఒమైక్రాన్ అని డబ్ల్యూహెచ్‌వో పేరు పెట్టింది. ప్రభావిత ఆఫ్రికా దేశాల నుంచి విమాన సర్వీసులపై పలు దేశాలు నిషేధాన్ని ప్రకటించాయి.
లండన్/జెనీవా/న్యూఢిల్లీ, నవంబరు 26 : దేశాల సరిహద్దులు మూసుకుపోతున్నాయి.. ‘రెడ్ లిస్ట్’ దేశాలు పెరుగుతున్నాయి.. రాత్రికి రాత్రే విమాన సర్వీసులు రద్దవుతున్నాయి.. క్వారంటైన్ నిబంధనలు మళ్లీ మొదలవుతున్నాయి.. టెస్టులు తప్పనిసరి అవుతోంది.. మొత్తానికి.. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొవిడ్ కొత్త వేరియంట్ (బి.1.1529) ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
శీతాకాలం ముంగిట కేసులు పెరుగుతూ ఉలికిపడుతున్న యూరోపియన్ యూనియన్ (ఈయూ)లోని దేశాలు.. మరింత అప్రమత్తం అవుతున్నాయి. దక్షిణాఫ్రికా, నమీబియా తదితర ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలోని 11 దేశాల నుంచి విమానాలను నిలిపివేసే ప్రతిపాదనపై ఈయూ తమ సభ్య దేశాలతో చర్చిస్తోంది. జర్మనీ శుక్రవారం రాత్రి నుంచే దీనిని అమలుచేయాలని కోరుతోంది. విమానయాన సంస్థలు దక్షిణాఫ్రికా నుంచి తమ దేశస్థులను మాత్రమే తీసుకురావాలని, టీకా తీసుకున్నా, తీసుకోకపోయినా అక్కడి నుంచి వచ్చినవారు 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని స్పష్టం చేస్తోంది. 14 రోజులుగా 7 ఆఫ్రికా దేశాల్లో ఉన్నవారు తమ దేశానికి రావడాన్ని ఇటలీ నిషేధించింది. బ్రిటన్, సింగపూర్, మలేషియా, జపాన్, ఇజ్రాయెల్ ముందుజాగ్రత్తగా దక్షిణాఫ్రికా, బోట్స్వానా, నమీబియా, జింబాబ్వే, ఎస్వతిని, లెసొతో దేశాల విమాన సర్వీసులపై తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించాయి.
ఎక్కడెక్కడ.. ఎన్నెన్ని కేసులు
కొన్ని వారాలుగా దక్షిణాఫ్రికాలో రోజూ 200 పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. అకస్మాత్తుగా ఈనెల 25న 2,465 కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న గ్వాటెంగ్ ప్రావిన్స్ పరిధిలోని రోగుల నుంచి శాంపిళ్లను సేకరించి పరీక్షించగా కొత్త వేరియంట్ (బి.1.1.529)ను గుర్తించారు. కేసులు వేగంగా పెరగడానికి కొత్త వేరియంటే ప్రధాన కారణమని ఆరోగ్య మంత్రి జో పాహ్లా వెల్లడించారు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ కేసులు 100 పైగా బయటపడగా, పొరుగు దేశం బొట్స్వానాలో నలుగురికి ోకింది. దక్షిణాఫ్రికా నుంచి హాంకాంగ్‌కు వచ్చిన ఇద్దరు పర్యాటకుల్లోనూ గుర్తించారు. మరో ఆఫ్రికా దేశం మలావీ నుంచి వచ్చిన పౌరుడికి కొత్త వేరియంట్ సోకినట్లు నిర్ధారణ అయిందని ఇజ్రాయెల్ ప్రకటించింది.
బెల్జియంలోనూ ఓ కేసు తేలింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత్.. దక్షిణాఫ్రికా, బోట్వ్సానా, హాంకాంగ్ నుంచి వచ్చే ప్రయాణికులకు పకడ్బందీగా స్ర్కీనింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విమానాశ్రయాల్లో పాజిటివ్ నిర్ధారణ అయ్యే వారి శాంపిళ్లను జన్యుక్రమ విశ్లేషణ కోసం ఎప్పటికప్పుడు ల్యాబ్‌లకు పంపాలని నిర్దేశిస్తూ రాష్ట్రాలు, యూటీలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. వ్యాప్తి వేగం ఎక్కువగా ఉండటం, స్పైక్ ప్రొటీన్‌లో ఎక్కువ సంఖ్యలో ఉత్పర్తివర్తనాల దృష్ట్యా బి.1.1.529 వేరియంట్.. డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరమైందనే ప్రచారం జరుగుతోంది. కొత్త వేరియంట్‌పై చర్చించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సాంకేతిక సలహా బృందం శుక్రవారం అత్యవసరంగా సమావేశమైంది. బి.1.1.529 వేరియంట్‌కు ‘ఒమైక్రాన్’ అని పేరుపెట్టింది. దాన్ని ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించింది.
నిశితంగా పరిశీలిస్తున్నాం..: ఇన్సాకాగ్
బి.1.1.529 వేరియంట్‌ను నిశితంగా పరిశీలిస్తున్నామని సార్స్‌కొవ్-2పై భారత జీనోమిక్స్ కన్సార్షియం (ఇన్సాకాగ్) తెలిపింది. దేశంలో ఈ వేరియంట్ కేసులు బయటపడలేదని చెప్పింది. అంతర్జాతీయ ప్రయాణికుల్లో ఎవరికైనా పాజటివ్ వస్తే.. ‘బి.1.1.529’ వేరియంట్ ఉందో లేదో తెలుసుకోడానికి నమూనాల జన్యు విశ్లేషణను ఇన్సాకాగ్ వేగిరం చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది.
వామ్మో.. 50 ఉత్పరివర్తనాలు
‘బి.1.1.529’ స్పైక్ ప్రొటీన్‌లో అత్యధికంగా 30కిపైగా ఉత్పరివర్తనాలు (మ్యుటేషన్లు) జరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మరో 20 ఉత్పరివర్తనాలు కూడా ‘బి.1.1.529’లో జరిగాయని వెల్లడైంది. ప్రస్తుత వ్యాక్సిన్లన్నీ వైరస్ స్పైక్ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకొని పనిచేసేవే. స్పైక్ ప్రొటీన్‌లో పెద్దసంఖ్యలో ఉత్పరివర్తనాలు జరిగిన ఈ కొత్త వేరియంట్ వ్యాక్సిన్లను లొంగని జగమొండిగా మారే అవకాశాలు ఉన్నాయా ? అనే కోణంలోనూ పరిశోధనలను ముమ్మరం చేశారు.
ఇంకొన్ని వారాల తర్వాతే ఈవిషయమై స్పష్టత రావచ్చు. ఇప్పటివరకు తాము చూసినవాటిలో ఈ వేరియంట్‌నే ప్రమాదకరమైనదిగా పేర్కొన్న యూకే.. అత్యవసర పరిశోధనలు చేస్తామని ప్రకటించింది. ‘‘బహుశా.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న హెచ్ఐవీ రోగిలో ఈ కరోనా వేరియంట్ ఉత్పరివర్తనాలకు గురై ఉండొచ్చు’’ అని లండన్‌లోని యూసీఎల్ జెనెటిక్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఫ్రాంకోయిస్ బలౌక్స్ అభిప్రాయపడ్డారు.