Abn logo
Sep 23 2021 @ 00:26AM

టీకా.. చకచకా..

ములుగు జిల్లాలో వేగంగా వ్యాక్సిన్‌ స్పెషల్‌ డ్రైవ్‌

ఆరు రోజుల్లో 42,348 మందికి మొదటి డోసు

నెలాఖరు వరకు కొనసాగనున్న  కార్యక్రమం

క్రమంగా తగ్గుముఖం పడుతున్న పాజిటివ్‌ కేసులు

క్వారంటైన్‌ కేంద్రాలు ఖాళీ


ములుగు, సెప్టెంబరు 22: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. ఏడాదిన్నర కాలంగా పట్టి పీడిస్తోంది. అనేక కుటుంబాలను ఆగం చేసింది. అయితే.. కటిక చీకట్లో కాంతిరేఖలా ఉద్భవించిన వ్యాక్సిన్‌ భవిష్యత్తుపై ఆశలు పుట్టిస్తోంది.. కరోనా కట్టడికి ఇప్పటికిదే బ్రహ్మాస్త్రంగా మారగా క్రమంగా వైరస్‌ తీవ్రత తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది.. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సిన్‌ స్పెషల్‌ డ్రైవ్‌తో టీకా పంపిణీ ఊపందుకుంది. ఈనెల 16న ములుగు జిల్లాలో ప్రారంభమైన టీకా ప్రక్రియ వేగంగా సాగుతోంది. కానీ... కొందరిలో అపోహ మాత్రం తొలగిపోలేదు. టీకా వేసుకునేందుకు వెనుకాడుతున్నారు. అందరూ వ్యాక్సిన్‌ తీసుకుంటేనే కరోనా రక్కసిని సమర్ధంగా ఎదుర్కొనే వీలుందని వైద్యులు చెబుతున్నారు.

జోరుగా వ్యాక్సినేషన్‌ 

 మొన్నటి వరకు వ్యాక్సిన్ల కొరతతో జనం ఇబ్బంది పడ్డారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొన్నిసార్లు టీకా కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఎదురైంది. కానీ, ఇప్పుడా ఇబ్బంది తప్పిస్తూ ప్రభుత్వం సరిపడా టీకా డోసులను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో 18 ఏళ్ల వయసు నిండిన వారు 2లక్షల46వేల మంది ఉన్నట్టు అంచనా. గడిచిన ఆరు రోజుల్లోనే 42,348 మందికి మొదటి డోసు టీకా వేయడం విశేషం.  వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన తొమ్మిది నెలల్లో జిల్లాలో 97 వేల మొదటి డోసులు, 34 వేల రెండు డోసులు మాత్రమే వేశారు. స్పెషల్‌ డ్రైవ్‌ ముందు వరకు 39 శాతంగా ఉన్న టీకా పంపిణీ ఈనెల 16 నుంచి 21వ తేదీ వరకు 53 శాతానికి వృద్ధి చెందింది. మొత్తంగా ఇప్పటి వరకు 1,30,09 మందికి మొదటి డోసు, 47,410 మందికి రెండు డోసులు ఇచ్చారు. ఇప్పటికే ప్రజల్లో స్వతహాగా రోగ నిరోధకశక్తి పెరిగినట్టు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. మరో లక్షమందికి టీకాలు వేస్తే దాదా పు కరోనా వ్యాప్తికి అడ్డుకట్టవేసే వీలుందంటున్నారు.

విధుల్లో 89 బృందాలు

జిల్లాలోని 13 పీహెచ్‌సీలు, ములుగు ఏరియా హాస్పిటల్‌, ఏటూరునాగారం, వెంకటాపురం(నూగూరు) కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు, 89 ఉపకేంద్రాల పరిధిలో 126 టీకా పంపిణీ కౌంటర్లను ఏర్పాటు చేశారు. నలుగురితో కూడిన(ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్త, అంగన్‌వాడీ టీచర్‌,  పంచాయతీ కార్యదర్శి) 89 బృందాలను నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం జోరు వ్యవసాయ పనులు జరుగుతుండగా రైతులు, కూలీలు ఉదయమే పొలాలకు వెళ్తున్నారు. ఈ బృందం సభ్యులు నేరుగా వారు పనిచేస్తున్న ప్రదేశానికే వెళ్లి వ్యాక్సిన్‌ అవసరాన్ని తెలియజేసి అక్కడే టీకా వేస్తున్నారు.

ఏజెన్సీ పల్లెల్లో తొలగని అపోహలు

 అక్షరాస్యతకు దూరంగా ఉన్న ఏజెన్సీ మండలాల్లోని పలు గూడాలు, పల్లెల్లో వ్యాక్సిన్‌పై నెలకొన్న అపోహలు తొలగడంలేదు. టీకా వేసుకుంటే దుష్ప్రభావాలు వస్తున్నాయంటూ కొందరు బలంగా నమ్ముతున్నారు. ఇళ్ల వద్దకే వెళ్లిన వైద్య సిబ్బంది వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేసినా మొండిగా వ్యవహరిస్తున్న సందర్భాలూ చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో టీకా వేసుకోకుంటే రేషన్‌ కట్‌ చేస్తామంటూ కొందరు సర్పంచ్‌లు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్‌ ప్రయోగ దశలో ఉన్నప్పుడు గర్భిణులు, బాలింతలు టీకా వేసుకోవద్దని సూచించిన శాస్త్రవేత్తలు ఇప్పుడు వారు కూడా నిర్భయంగా టీకా వేసుకోవచ్చని ధ్రువీకరించారు. ఇదే విషయాన్ని అధికారులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్‌, బీపీ, థైరాయిడ్‌తోపాటు కిడ్నీ, లివర్‌, గుండె, ఆస్తమా, టీబీ తదితర వ్యాధులున్న వారు కూడా టీకా తీసుకోవాలని సూచిస్తున్నారు. వీరికి సాధారణ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, వారికి కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వారంతా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని పిలుపునిస్తున్నారు. రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉండే యువతలో వైరస్‌ సోకినా లక్షణాలు కనిపించవని, వీరి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకుంటే వైరస్‌  వ్యాిప్తి చెందకుండా ఆపొచ్చని చెబుతున్నారు.

తగ్గుముఖం పట్టిన కేసులు

గడిచిన రెండు నెలలుగా కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సెప్టెంబరులో ఐదురోజులు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మిగతా రోజుల్లో పదిలోపే పాజిటివ్‌లు వెలుగు చేస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 37 యాక్టివ్‌ కేసులు కొనసాగుతున్నాయి. కొవిడ్‌ రోగుల సంఖ్య తగ్గడంతో ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాలు ఖాళీ అయ్యాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో ములుగు ఏరియా వైద్యశాలలో ముగ్గురు, ఏటూరునాగారం ఆస్పత్రిలో ఒకరు చికిత్స పొందుతున్నారు.