నీ విరాళం వద్దుపో!

ABN , First Publish Date - 2020-03-30T11:11:16+05:30 IST

జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో..

నీ విరాళం వద్దుపో!

‘కరోనా’ సహాయక చర్యలకు విరాళం నిరాకరిస్తున్న అధికారులు

పుంగనూరులో వికృత రాజకీయం  


తిరుపతి(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో ప్రాణాలకు తెగించి పాల్గొంటున్న పోలీసు, వైద్య, పారిశుధ్య సిబ్బందికి చాలినన్ని మాస్కులు, శానిటైజర్లు అందడం లేదు. ఈ పరిస్థితి చూసి చలించి తన పరిధిలో సాయం చేద్దామని ముందుకొచ్చిన పెద్దమనిషికి రాజకీయ కారణాలతో అవమానాలు ఎదురవుతున్నాయి. తొలుత ఆ దాతను వేనోళ్ల ప్రశంసించిన అధికారులే ప్రస్తుతం అధికారపార్టీ నేతల వత్తిళ్లకు తలొగ్గి నీ విరాళం మాకు వద్దుపొమ్మంటున్నారు. ఇది పుంగనూరు నియోజకవర్గ వికృత రాజకీయాల పర్యవసానం. 


పుంగనూరు నియోజకవర్గంలో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పారిశ్రామికవేత్త బోడే రామచంద్రయాదవ్‌ కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించి తనవంతు సాయం అందించాలని నిర్ణయించుకున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు విశిష్ట సేవలందిస్తున్న పోలీసు, వైద్య, పారిశుధ్య సిబ్బందికి రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. దీంతోపాటు మాస్కులు, శానిటైజర్లు కూడా అందజేస్తామని ప్రకటించారు. తొలుత యాదవ్‌ను పలువురు కీలక అధికారులు ఆహా.. ఓహో అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. అయితే అరగంటలోనే వారి స్వరం మారిపోయింది. ‘నిన్ను సాయం చేయమని మేము అడిగామా? మాకు ప్రభుత్వం నుంచి నిధులు, మాస్కులు, శానిటైజర్లు అందుతాయి. నీ సాయం మాకు అక్కర్లేదు’ అంటూ ముఖం మీదే తిరస్కరించారు.


రామచంద్రయాదవ్‌ సాయం ఎవరూ తీసుకోవద్దంటూ కిందిస్థాయి అధికారులకు, సిబ్బందికీ అంతర్గతంగా ఆదేశాలు అందడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.  దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రామచంద్రయాదవ్‌ రూ.10 లక్షల నగదుతో కొన్న మాస్కులు, శానిటైజర్లను నేరుగా ప్రజలకే పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే కీలక అధికారులు నిస్సహాయులయ్యారని సమాచారం. ఈ ఏడాది జనవరిలోనూ సంక్రాంతి పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని పేదలకు కొత్త బట్టలు పంపిణీ చేయాలని రామచంద్రయాదవ్‌ ప్రయత్నించగా పంపిణీకి తెచ్చిన దుస్తులు, వాహనాలను పోలీసులు సీజ్‌ చేసి ఆయనపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.  

Updated Date - 2020-03-30T11:11:16+05:30 IST