కరోనా వ్యాప్తి కేంద్రాలుగా గ్రామీణ వైద్యశాలలు

ABN , First Publish Date - 2020-08-04T10:05:56+05:30 IST

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం గ్రామీణ వైద్యులు చికిత్స చేయకుండా ఆంక్షలు విధించింది

కరోనా వ్యాప్తి కేంద్రాలుగా గ్రామీణ వైద్యశాలలు

కొవిడ్‌ లక్షణాలున్న వారికి వైద్యం చేస్తున్న ఆర్‌ఎంపీలు

వైరస్‌ ట్రాన్స్‌పోర్టర్లవుతున్న పల్లె డాక్టర్లు

అధికారుల హెచ్చరికలను పట్టించుకోని వైనం

 

నేలకొండపల్లి, ఆగస్టు 3: కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి  ప్రభుత్వం గ్రామీణ వైద్యులు చికిత్స చేయకుండా ఆంక్షలు విధించింది. కొవిడ్‌కు కేవలం ప్రభుత్వ వైద్యశాలల్లోనే చికిత్స అందించాలని, ప్రైవేటు, గ్రామీణ వైద్యులు చికిత్స చేయటానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. అయినా కొంత మంది గ్రామీణ వైద్యులు తమ పద్ధతిని మార్చుకోవటం లేదు. నేలకొండపల్లిలో నమోదైన తొలి కరోనా వ్యక్తికి సైతం గ్రామంలోని కనీస అర్హత లేని ఓగ్రామీణ వైద్యుడు దాదాపు 10 రోజుల పాటు చికిత్స అందించటం అప్పట్లో కలకలం రేగింది.  కరోనా పాజిటివ్‌ వచ్చిన మెడికల్‌ షాపు యజమానికి అదే కాంప్లెక్స్‌లో ఉన్న ఓ ఆర్‌ఎంపీ వారం రోజులుగా చికిత్స అందిస్తున్నాడన్న సమాచారం సోమవారం గ్రామంలో కలకలం సృష్టించింది.  


మూడు రోజుల క్రితమే హెచ్చరించిన ఎస్‌ఐ

కొవిడ్‌ లక్షణాలున్న వ్యక్తులకు ఎట్టి పరిస్ధితుల్లో గ్రామీణ వైద్యులు చికిత్స చేయరాదని, అలా చేసినా, తమ దృష్టికి వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని నేలకొండపల్లి ఎస్‌ఐ అశోక్‌ గ్రామీణ వైద్యులను హెచ్చరించారు. మూడు రోజుల క్రితం స్ధానిక పోలీస్‌స్టేషన్‌లో మండలంలోని గ్రామీణ వైద్యులతో సమావేశం నిర్వహించినా గ్రామీణ వైద్యులు తమ వైఖరిని మార్చుకోక పోవటం గమనార్హం.


నిలువెత్తు నిర్లక్ష్యం

గ్రామంలోని తొలి కరోనా వ్యక్తికి మే నెలలోనే చికిత్స చేసిన గ్రామీణ వైద్యునిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈపరిస్ధితి ఉత్పన్నమయ్యోది కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వివాహాలు, ఫంక్షన్లు చేస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోక పోవటం పలు విమర్శలకు దారి తీస్తోంది. వివాహాలకు ఎక్కడెక్కడి నుంచో వచ్చే వారి వల్ల కూడా తెలియకుండానే ప్రజలు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.


ఆందోళన కలిగిస్తున్న సామాజిక వ్యాప్తి 

గ్రామీణ వైద్యుల ద్వారా కరోనా సామాజిక వ్యాప్తి జరుగుతున్నదనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గ్రామీణ వైద్యుల వద్దకు వచ్చే రోగులకు ఈకరోనా అంటే ప్రమాదముంది. కొంత మంది గ్రామీణ వైద్యులు ఇళ్లకు వెళ్లి కూడా చికిత్సలు చేసి వస్తుంటారు. తెలిసి కొంత, తెలియక కొంత కరోనా లక్షణాలున్న వారికి చికిత్సలు చేయటం, తమ వద్దకు వచ్చిన వారికి గ్లూకోజ్‌ కెక్కించటం తదితరాల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందనటంలో అతిశయోక్తి లేదు

Updated Date - 2020-08-04T10:05:56+05:30 IST