Abn logo
Aug 4 2020 @ 10:54AM

విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలో ఘోరం.. 40 నిమిషాల పాటు కేకలు పెట్టినా..

తృణప్రాణమా..!


ఆంధ్రజ్యోతి, విజయవాడ : కళ్లు మూతలు పడుతున్నాయి. కాలు భూమిపై నిలవడం లేదు. అవయవాలు సరిగ్గా పనిచేయట్లేదని తెలుస్తూనే ఉంది. ‘ప్రాణాలు పోతున్నాయి. ..’ అంటూ నేను పెడుతున్న కేకలు ఎవరికీ వినిపించట్లేదా..? అని సందేహం. జీవచ్ఛవంలా మారిన నేను నేలపైనే ఓ మూలన కొట్టుకుంటున్నా ఎవరూ దయ చూపలేదు. నా ఎదురుగా వెళ్తున్న వారివైపు మూతలుపడుతున్న నా కళ్లు అలాగే చూస్తున్నాయి. ఎవరికైనా కనికరం కలుగుతుందా అని. నేను బెడ్‌ మీద నుంచి కింద పడిపోయి 40 నిమిషాలు గడిచింది. డాక్టర్ల జాడ లేదు. అయ్యా.. కనికరించడయ్యా.. అని ఎవరి కాళ్లయినా పట్టుకుందామనుకున్నాను. చచ్చుబడిన నా చేతులు పైకి రాలేదు. కళ్లలో నీరు ధారలవుతున్నాయి. అయినవారు కూడా దగ్గరలేని నా బతుకెందుకు.. అనిపించింది. ఏమైందో కొద్దిసేపటికి ఎవరో నర్సులు నా వద్దకు వచ్చారు. సరిగ్గా అప్పుడే నా గుండెచప్పుడు నెమ్మదించింది. కాసేపటికే నా శరీరం నిర్జీవంగా మారిపోయింది. విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో నిర్దయకు బలైన మృతుల్లో నా శవమూ చేరింది. తెల్లారేసరికి శవాగారానికి తరలింది. అప్పుడు నా ఆత్మరోదన నాకు వినిపించింది. అయ్యా.. మాలాంటి పేద రోగులకు మీరే దేవుళ్లు. కాస్తంత మానవత్వంతో మమ్మల్ని మనుషులుగా చూడండయ్యా.. అంటూ ఏడ్వాలనిపించింది. 


విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో మారణ హోమానికి నిదర్శనం ఈ ఘటన. ప్రాణాపాయంలో ఉన్న కరోనా బాధితుల ఆర్తనాదాలకు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. ప్రాణాలు పోతున్నాయి.. కాపాడండి.. అంటూ ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు 40 నిమిషాల పాటు కేకలు పెట్టినా పట్టించుకోని దయనీయ పరిస్థితి. రెండు రోజుల కిందట జరిగిన ఈ దారుణాన్ని అదే వార్డులో చికిత్స పొందుతున్న మరో బాధితుడు వీడియో తీసి ‘ఆంధ్రజ్యోతి’కి పంపారు.   ‘నా పక్క బెడ్డుపైనే ఉన్న ఓ కరోనా బాధితుడు దాదాపు 40 నిమిషాల పాటు పెద్దగా కేకలు పెట్టి అరిచినా వైద్యులు, నర్సులు ఎవరూ రాలేదు. అతని బాధను చూడలేక నీరసంగా ఉన్నా నేనే వార్డు బయట ఉన్న స్టాఫ్‌నర్సులకు చెప్పాను. రాత్రి 2.30 గంటలకు చెబితే అరగంట తర్వాత అతని వద్దకు వచ్చారు. అప్పటికే అతను చనిపోయాడు. మృతదేహాన్ని ఉదయం వరకు మార్చురీకి తరలించలేదు. మరొక వ్యక్తి ఆక్సిజన్‌ అందక చనిపోయాడు. రాత్రిపూట ఊపిరి అందక ఇబ్బంది పడుతున్న అతనికి నేనే మూడుసార్లు ఆక్సిజన్‌ మాస్క్‌ తగిలించాను. అయినా ఆయన బతకలేదు. మరొక వ్యక్తి అయితే కుటుంబ సభ్యులతో ఫోన్‌ మాట్లాడుతూనే చనిపోయాడు. అక్కడ డ్యూటీ డాక్టర్‌ ఉన్నా కూడా కనీసం పట్టించుకోలేదు. ఆసుపత్రిలో ఎంఎన్‌వోలు, పారిశుధ్య కార్మికులు తప్ప నర్సులు, వైద్యులు పిలిచినా కూడా కరోనా రోగుల దరిదాపులకే రావట్లేదు. కాలేయం, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలు దెబ్బతిని సీరియస్‌ కండీషన్‌లో ఉన్న రోగులను ఐసీయూలో ఉంచి చికిత్స చేయాల్సిన అవసరమున్నప్పటికీ ఐసోలేషన్‌ వార్డుల్లోనే ఉంచేస్తున్నారు.’ అని ఆయన వివరించారు. 


నెగెటివ్‌ రిపోర్టులు రాకుండానే డిశ్చార్జిలు 

బాధితులు కోలుకున్నాక కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి నెగెటివ్‌ రిపోర్టులు వస్తేనే డిశ్చార్జి చేయాల్సి ఉండగా, విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో అలాంటిదేమీ జరగట్లేదు. కరోనా లక్షణాలున్నా బలవంతంగా డిశ్చార్జి చేసేస్తున్నారు. ఇంట్లోనే ఉండి ఇతరులను కలవకుండా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంట్లో చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారని, వేరే గదిలో ఉండే అవకాశం లేదని, ఇరుకిరుకు అద్దె ఇళ్లలో ఉంటున్నామని చెబుతున్నా ఆసుపత్రి వైద్యాధికారులు వినిపించుకోవడం లేదని బాధితులు చెబుతున్నారు. ఇంకా గొడవ చేస్తే.. వారం తర్వాత ఇక్కడ ఉండటానికి కుదరదని, కావాలంటే వేరే క్వారంటైన్‌ సెంటరుకు తరలిస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోతున్నారు. ఆసుపత్రిలో చేరిన  తొలి నాలుగు రోజులు పారాసిట్మాల్‌, బి-కాంప్లెక్స్‌, కాల్షియం, విటమిన్‌ ట్యాబ్లెట్లు ఇస్తున్నారని, ఆ తర్వాత అడిగినా ఇవ్వడం లేదని మరో బాధితుడు ఫోన్‌లో చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement