కరోనాను జయించి కోలుకున్న బాధితులకు కొత్త సమస్యలు!

ABN , First Publish Date - 2020-05-26T18:17:19+05:30 IST

ఇప్పుడు దేని గురించి మాట్లాడినా.. కరోనాకు ముందు, కరోనాకు తర్వాత అనేలా..

కరోనాను జయించి కోలుకున్న బాధితులకు కొత్త సమస్యలు!

ఆ ప్రేమానురాగాలు ఏవీ..?

ఫోన్‌లో ఎంతసేపైనా మాట్లాడతారు

మనిషి ఎదురుపడితే పలకరింపుల్లో ఎంతో తేడా

బయటికి చెప్పుకోలేని బాధలు అనుభవిస్తున్నాం

కరోనాను జయించి కోలుకున్న బాధితుల ఆవేదన

వారి పట్ల వివక్ష చూపడం సరి కాదు

భవిష్యత్తులో కరోనా బాధితులకు వారే ప్రాణదాతలు : కలెక్టర్‌


కడప(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఇప్పుడు దేని గురించి మాట్లాడినా.. కరోనాకు ముందు, కరోనాకు తర్వాత అనేలా మారిపోయింది. కరోనా వైరస్‌ సోకి కోలుకున్న వారి పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. జిల్లాలో 112 మంది కరోనా బారిన పడ్డారు వారిలో 88 మంది వైర్‌సపై గెలుపు సాధించి సంపూర్ణ ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం హౌస్‌ క్వారంటైన్‌ కూడా పూర్తి చేశారు. వీరిలో పలువురిని ఆంధ్రజ్యోతి ఫోన్‌లో సంప్రదించగా వైరస్‌ సోకక ముందు.. కరోనా బారిన పడి కోలుకుని ఇంటికి చేరిన తరువాత మనుషుల సంబంధాల తీరులో చాలా మార్పు వచ్చిందని అన్నారు. కనిపిస్తే మొహమాటానికి బాగున్నారా..! అంటూ ఓ మాట మాట్లాడి దూరంగా వెళ్లిపోతున్నారని, కరోనా సోకిన బాధ కన్నా ప్రజల తీరు చూస్తుంటేనే ఎక్కువ బాధేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.


దూరంగా వెళ్లాలనిపిస్తోంది..

కరోనా సోకి కడప కోవిడ్‌-19 ఆసుపత్రిలో చికిత్స పొందాను. వైద్యుల చికిత్స, అధికారుల ప్రోత్సాహం, మాలోని ఆత్మస్థైర్యంతో కరోనాను జయించి ఇంటికి వచ్చా. ఒకటి రెండు రోజుల్లో హౌస్‌ క్వారంటైన్‌ కూడా పూర్తవుతుంది. నాలో ఏ వైరస్‌ లేదు. నేను ఇంట్లో నుంచి వాకిలి ముందుకు రాగానే ప్రజలు నన్ను విచిత్రంగా చూస్తున్నారు. మునుపటి పలకరింపులు కరువయ్యాయి. ప్రేమానురాగాలు కనిపించడం లేదు. అదే ఫోన్‌లో అయితే ఎంతసేపైనా మాట్లాడుతున్నారు. కరోనా మనుషుల మధ్య ఇంత దూరం పెంచుతుందా అనిపిస్తోంది. ఎక్కడికైనా దూరంగా వెళ్లి ఈ పరిస్థితులు పూర్తిగా సద్దుమణిగిన తరువాత వద్దామనిపిస్తోంది. ఎవరేమనుకున్నా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళతాం.

-  కరోనాను జయించిన ఓ బాధితుడు, ఎర్రగుంట్ల


సమాజం చిన్నచూపు చూస్తోంది..

తెలియకుండానే మా శరీరంలో కరోనా వైరస్‌ చేరింది. కోవిడ్‌-19 ఆసుపత్రిలో చికిత్స పొంది సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వచ్చాను. కోవిడ్‌-19ని జయించానన్న ఆనందం కన్నా.. ఇంటికి వచ్చాక హౌస్‌ క్వారంటైన్‌ ముగించి బయటికి వస్తే సమాజం చిన్న చూపు చూస్తుంటే అదే ఎక్కువ బాధగా ఉంది. కరోనా రాక ముందు బంధువులు, మిత్రులు ప్రజలతో ఎంతో గౌరవంతో, సత్సంబంధాలు కొనసాగించాను. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. లాక్‌డౌన్‌ వల్ల ఎక్కువ సమయం ఇంట్లోనే కుటుంబ సభ్యులతో గడిపాను. కరోనా మహమ్మారి భయం నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నాం.

- కరోనాను జయించిన ఓ బాధితుడు, బద్వేలు


కరోనా విజేతలు భవిష్యత్‌ ప్రాణదాతలు..

కరోనాను జయించిన బాధితుల పట్ల వివక్ష చూపడం ప్రజల అవగాహన రాహిత్యమే. అది మంచి పద్ధతి కాదు. ఒకసారి కరోనాను జయిస్తే ఆ వ్యక్తి శరీరంలోకి వైరస్‌ రాదు. కోలుకున్న వ్యక్తి రక్తాన్ని సేకరించి భద్రపరిచి ప్లాస్మా థెరపి ద్వారా భవిష్యత్తులో కరోనా వ్యాపించే ప్రజలకు చికిత్స అందించే అవకాశాలపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. అంటే వారు భవిష్యత్‌ ప్రాణదాతలు. వారి పట్ల వివక్ష చూపడం సరైంది కాదు. వారితో స్నేహంగానే ఉండవచ్చు. కరోనా నిబంధనలు పాటిస్తూ సాధారణ ప్రజలతో ఎలా గడుపుతామో కరోనాను జయించిన వారితో కూడా అలాంటి స్నేహ పూర్వక వాతావరణాన్నే కొనసాగించవచ్చు. వివక్ష చూపవద్దు. దీని పట్ల ప్రజల్లో సంపూర్ణ అవగాహన కూడా కల్పిస్తాం.

- సి.హరికిరణ్‌, జిల్లా కలెక్టర్‌


గల్ప్‌ దేశాల నుంచి మరో కేసు నమోదు 

గల్ఫ్‌ దేశాలకు ఉపాధి కోసం వెళ్లిన జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రులు 112 మంది నాలుగురోజుల క్రితం జిల్లాకు వచ్చారు. రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్‌ కళాశాల క్వారంటైన్‌లో ఉంటున్నారు. వారిలో ఇప్పటికే 14 మందికి కరోనా నిర్ధారణ అయింది. వారందరినీ కడప ఫాతిమా మెడికల్‌ కాలేజీ కోవిడ్‌-19 జిల్లా ఆసుపత్రికి తరలించారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన మరొక వ్యక్తికి సోమవారం కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ కేసుతో గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా సోకిన వారి సంఖ్య 15కు చేరింది. ప్రవాసాంధ్రులకు నెగటివ్‌ వచ్చిందని, ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్‌ హరికిరణ్‌ సూచించారు. క్వారంటైన్‌లో వారికి అవసరమైన సౌకర్యాలతో పాటు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, బంధువులు వారిని కలిసేందుకు వెళ్లకుండా ఉండాలని కోరారు.


ఆరుగురు డిశ్చార్జ్‌

జిల్లాలో కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పూర్తిగా కోలుకుని సోమవారం 6గురు డిశ్చార్జ్‌ అయ్యారు. వీరిలో ప్రొద్దుటూరుకు చెందిన వారు ముగ్గురు, కడప వాసులు ఇద్దరు ఉన్నారు. మరొకరు మహారాష్ట్రకు చెందన వ్యక్తి. గల్ఫ్‌ నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులతో కలుపుకుని జల్లాలో మొత్తం 127 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 94 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 33 మంది చికిత్స పొందుతున్నారు.


Updated Date - 2020-05-26T18:17:19+05:30 IST