ఆస్పత్రుల బయట ‘ఊపిరి’ తీసుకుంటూ..!

ABN , First Publish Date - 2021-04-28T07:51:52+05:30 IST

వీల్‌చైర్‌లో ఆక్సిజన్‌ సిలిండర్‌ పెట్టుకుని ‘ఊపిరి’ తీసుకునేది ఒకరు. ఆస్పత్రి బయట సిలిండర్ల వద్ద శ్వాస తీసుకునే బాధితులు మరికొందరు. చాలాసేపు అంబులెన్సులోనే ఆక్సిజన్‌ పెట్టుకునే బాధితుడు. తిరుపతి ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్ల కొరతతో మంగళవారం తలెత్తిన పరిస్థితులివీ.

ఆస్పత్రుల బయట ‘ఊపిరి’ తీసుకుంటూ..!


 తిరుపతిలో ఆక్సిజన్‌ బెడ్ల కొరతతో సమస్యలు 


 సిలిండర్లే కాదు కాన్సంట్రేటర్లూ దొరకని వైనం


(తిరుపతి, ఆంధ్రజ్యోతి) 

వీల్‌చైర్‌లో ఆక్సిజన్‌ సిలిండర్‌ పెట్టుకుని ‘ఊపిరి’ తీసుకునేది ఒకరు. ఆస్పత్రి బయట సిలిండర్ల వద్ద శ్వాస తీసుకునే బాధితులు మరికొందరు. చాలాసేపు అంబులెన్సులోనే ఆక్సిజన్‌ పెట్టుకునే బాధితుడు. తిరుపతి ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్ల కొరతతో మంగళవారం తలెత్తిన పరిస్థితులివీ. 

కొవిడ్‌ బాధితులకు జిల్లాలో దిక్కుగా వున్న పద్మావతి, రుయాస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లన్నీ నిండిపోయాయి. కొత్తగా వచ్చే బాధితులకు బెడ్లు దొరకడం దుర్లభంగా మారుతోంది. రుయాలోని 135 ఐసీయూ బెడ్లు నిండిపోయాయి. ఆక్సిజన్‌ సదుపాయమున్న నాన్‌ ఐసీయూ బెడ్లు 465 ఖాళీగా లేవు. కానీ, మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత 48 ఆక్సిజన్‌ పడకలు (అందులో ఐసీయూ నాలుగు) ఖాళీగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రెండింటిలో ఆక్సిజన్‌ పడకలు ఖాళీ లేవని మంగళవారం బోర్డే పెట్టేశారు. దీంతో పలువురు కొవిడ్‌ బాధితులు, ఆస్మ్తా రోగులు ఈ రెండు ఆస్పత్రులకు వచ్చి గంటల తరబడి పడకల కోసం పడిగాపులు పడుతున్నారు. ఆస్పత్రిలో పడకలు లేకపోవడంతో వెలుపల ఆవరణలో సిలిండర్లు ఏర్పాటు చేసి వాటి నుంచి బాధితులకు ఆక్సిజన్‌ అందజేస్తున్నారు.


ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి

నగరంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్‌ బెడ్లన్నీ నిండిపోయాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో అసలే బెడ్ల సంఖ్య తక్కువ. అందులోనూ ఆక్సిజన్‌ సరఫరా ఉన్నవి మరింత తక్కువ. అవన్నీ వారం పదిరోజులుగా ఫుల్‌ అయిపోయాయని సమాచారం. ఏదైనా బెడ్‌ ఖాళీ అయినా రాజకీయ నేతలు, ఇతర పలుకుబడి కలిగిన వారు ముందుగానే ఒత్తిడి తెచ్చి అడ్వాన్సుగా బుక్‌ చేసేసుకుంటున్నారు. 


ఆక్సిజన్‌కూ కొరత 

తిరుపతిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లన్నీ నిండిపోవడంతో అనివార్యంగా ఆక్సిజన్‌కు కూడా కొరత ఏర్పడుతోంది. ఆక్సిజన్‌ సిలిండర్లు ఇదివరకూ రూ.వెయ్యితో సరఫరా చేస్తుండగా తాజాగా తలెత్తిన డిమాండ్‌ వల్ల రూ.1500 పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోందని ప్రైవేటు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఐసీయూ వార్డుల్లోనూ, సాధారణ ఆక్సిజన్‌ బెడ్లలో కొవిడ్‌ బాధితులతో పాటు, ఇతర సీరియస్‌ పేషెంట్లు చికిత్స తీసుకుంటున్నందున వారి కోసం ఎక్కువ ధరైనా కొనుగోలు చేయక తప్పడం లేదంటున్నారు. బెడ్ల కొరతతో ప్రైవేటు ఆస్పత్రుల వెలుపల కూడా పలువురు కొవిడ్‌ బాధితులు అంబులెన్సుల్లోనే నిరీక్షించాల్సి వస్తోంది. మంగళవారం భవానీనగర్‌ ప్రాంతంలో ఒక ప్రైవేటు ఆస్పత్రి వెలుపల కొవిడ్‌ బాధితుడు అంబులెన్సులోనే పడుకుని సిలిండర్‌ నుంచీ ఆక్సిజన్‌ తీసుకుంటూ నిరీక్షించడం కనిపించింది.


ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లకూ డిమాండ్‌

కొవిడ్‌ బాధితులకు, ఆస్త్మా తదితర శ్వాస సంబంధ సమస్యలున్న రోగులకు ఎంతగానో ఉపకరించే ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లకూ నగరంలో విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. పలువురు బాధితులు ఇప్పుడు ఆస్పత్రులకు వెళ్ళకుండా ఇళ్లలోనే ఉండి ఆక్సిజన్‌ అవసరమైనపుడు తీసుకునేందుకు వీలుగా వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో వీటికీ డిమాండ్‌ ఏర్పడి దుకాణాల్లో దొరకని పరిస్థితి. నగరంలో ఇదివరకు ఓ ప్రముఖ కంపెనీకి చెందిన కాన్సంట్రేటర్‌ ధర రూ. 39 వేలు ఉండేది. ఇప్పుడది రూ.90 వేలు చెబుతున్నారని, అయినా కూడా స్థానికంగా దొరకడం లేదని బాధితులు చెబుతున్నారు. సరఫరా కావడం లేదని, అవసరముంటే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోండని ఆ షాపుల వారు సలహా ఇస్తున్నారు. 


ఇప్పుడే ఇలాగైతే.. 

జిల్లాలో కొవిడ్‌ కేసుల సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఈ తొలిదశలోనే పరిస్థితి ఇలా వుంటే గతేడాది జూలై, ఆగస్టు, ఆక్టోబర్‌ నెలల తరహాలో కేసులు విపరీతంగా పెరిగితే ఆస్పత్రుల్లో పడకలు.. ఆక్సిజన్‌ కొరత తీవ్రమయ్యే ప్రమాదముంది. అధికార యంత్రాంగం ఇప్పటి నుంచే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరముంది.







Updated Date - 2021-04-28T07:51:52+05:30 IST