చికిత్స కోసం వెళితే.. చితికేనా..!?

ABN , First Publish Date - 2021-05-06T05:40:47+05:30 IST

కరోనా కరాళనృత్యం చేస్తున్న వేళ.. సామాన్యుల ప్రాణాలను కాపాడాల్సిన ఎంజీఎం ఆస్పత్రి చేతులెత్తేసి చోద్యం చూస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఖరీదైన చికిత్స పొందే స్థోమత లేని వారు, అక్కడ బెడ్‌లు దొరకని వారు ఎంజీఎంకు చికిత్స కోసం వస్తుండగా వారికి సకాలంలో సరైన వైద్యం అందే పరిస్థితులే కనిపించడం లేదు.

చికిత్స కోసం వెళితే.. చితికేనా..!?
ఎంజీఎం కోవిడ్‌ వార్డుకు చికిత్స కోసం అంబులెన్స్‌లో తరలివస్తున్న కరోనా రోగులు, ఎంజీఎంలోని కోవిడ్‌ వార్డు వద్ద చికిత్స అందక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వృద్ధుడు,ఎంజీఎంకు వచ్చి కారులోనే కన్ను మూసిన కరోనా రోగి

కొవిడ్‌ బాధితులకు చివరి మజిలీగా మారుతున్న ఎంజీఎం
సకాలంలో అందని అత్యవసర వైద్యం
చూస్తుండగానే ప్రాణాలు కోల్పోతున్న రోగులు
అవసరానికి సరిపడా లేని బెడ్లు, ఆక్సిజన్‌, వెంటిలేటర్లు
ఆస్పత్రిలో చేరే క్రమంలోనే మరణాలు
కనీస వసతులు కొరవడిన కొవిడ్‌ వార్డు
బెడ్లు, ఆక్సిజన్‌, ఇంజక్షన్ల పేరుతో సిబ్బంది దందా
మరణాల వాస్తవ సంఖ్యను వెల్లడించని అధికారులు
రెండు నెలల్లో 536 మరణాలు సంభవించినట్టు అంచనా
ప్రజలు అల్లాడుతున్నా చోద్యం చూస్తున్న పాలకులు


హన్మకొండ అర్బన్‌ /హన్మకొండ, మే 5 (ఆంధ్రజ్యోతి): కరోనా కరాళనృత్యం చేస్తున్న వేళ.. సామాన్యుల ప్రాణాలను కాపాడాల్సిన ఎంజీఎం ఆస్పత్రి చేతులెత్తేసి చోద్యం చూస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఖరీదైన చికిత్స పొందే స్థోమత లేని వారు, అక్కడ బెడ్‌లు దొరకని వారు ఎంజీఎంకు చికిత్స కోసం వస్తుండగా వారికి సకాలంలో సరైన వైద్యం అందే పరిస్థితులే కనిపించడం లేదు. ఆక్సీజన్‌ సరఫరా చేసే పరికరాలు, వెంటిలేటర్లు రోగుల సంఖ్యకు అనుగుణంగా లేవు. అత్యవసర పరిస్థితుల్లో వేసే రెమిడెసివర్‌ ఇంజక్షన్ల పరిస్థితీ కూడా అదే. ఇక బెడ్లు, ఆక్సీజన్‌ సిలిండర్లు, రెమిడెసివర్‌ ఇంజక్షన్లు ఇప్పిస్తామని బేరసారాలు చేసే దళారులకు ఎంజీఎం ఇప్పుడు అడ్డాగా మారింది. రోగుల అవసరాన్ని ఆసరా చేసుకొని వేలకు వేలు గుంజుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా... అటు ప్రజాప్రతినిధులు, ఇటు ఉన్నతాధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.  

అధ్వానంగా కొవిడ్‌ వార్డు
ఎంజీఎం ఆస్పత్రిలోని కొవిడ్‌ వార్డు అత్యంత అధ్వానంగా ఉంది. నరక కూపాన్ని తలపిస్తోంది. కరోనా చికిత్స కోసం వెళ్లిన రోగులు శవాలై బయటకు వస్తున్నారు. సకాలంలో అత్యవసర చికిత్స అందక మృత్యువాత పడుతున్నారు.  మరోవైపు వార్డులో కరోనా రోగులను చేర్చుకోవడంలో జాప్యం జరుగుతోంది. అడ్మిషన్‌ కోసం వేచి చూస్తున్న కరోనా బాధితులు వార్డు ఆవరణలోనే మరణిస్తున్నారు. మంగళవారం చికిత్స కోసం వచ్చిన ఓ కరోనా రోగి వార్డులో కూర్చున్న చోట మృతి చెందగా, బుధవారం కారులో వచ్చిన ఓ కరోనా రోగి కూడా వార్డులోకి తీసుకువెళ్లేలోగానే అందులోనే మరణించాడు. కరోనా బారిన పడిన ఓ వృద్ధుడు ఎంజీఎం కొవిడ్‌ వార్డుకు వచ్చాడు. వార్డులో చేరేందుకు అడ్మిషన్‌ దొరక్కపోవడంతో  శ్వాస అందక ఆవరణలోనే గిలగిలా కొట్టుకుంటుండడం కనిపించింది. ఈ హృదయ విదారక దశ్యం అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది. ఇలాంటి దృశ్యాలు ఎంజీఎం కొవిడ్‌ వార్డు ఆవరణలో సర్వసాధారణమయ్యాయి. ప్రతీ రోజు అనేక మంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. సకాలంలో సమర్ధవంతమైన చికిత్సను అందించగలిగితే ఈ మరణాలను ఆపవచ్చునని డాక్టర్లే స్వయంగా చెబుతున్నారు. కానీ ఎంజీఎంలో ఆ పరిస్థితులు ప్రస్తుతం లేవని నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. కరోనా రెండో దశ విజృంభించిన తర్వాత రెండు నెలల కాలంలో ఎంజీఎంలో 536 మంది మరణించినట్టు సమాచారం.

సౌకర్యాలు కరువు
ఎంజీఎం కొవిడ్‌ వార్డులో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కరోనా రెండో దశ రోగుల్లో ఎక్కవ మంది శ్వాస సమస్యతో బాధపడుతున్నారు. ప్రతీ రోగికి ఆక్సీజన్‌ అవసరమవుతోంది. డిమాండ్‌ పెరగడంతో కొరత ఏర్పడింది. వెంటిలేటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఎంజీఎంలో 80 వెంటిలేటర్లు ఉండగా, ప్రస్తుతం 30 మాత్రమే పని చేస్తున్నాయి. కొవిడ్‌ రోగులు పెద్దసంఖ్యలో వస్తున్నందువల్ల ఇవి ఏ మాత్రం సరిపోవడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో 300 వెంటిలేటర్లు అవసరమవుతాయి. వీటిని అత్యవసరంగా సమకూర్చాల్సిన అసవరం ఉంది. ఆస్పత్రి అధికారులు వెంటిలేటర్ల కోసం ప్రతిపాదనలు పంపించినా అధికారుల నుంచి స్పందన లేదు. రోగులను వేధిస్తున్న మరో సమస్య ఆక్సీజన్‌ సప్లయి మిషన్లు. ఇవి కనీసం 500 వరకైనా అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం ఆస్పత్రిలో 30 కన్నా ఎక్కవ లేవు. రోగులనే కొనుక్కోమని డాక్టర్లు చెబుతున్నారు. వాస్తవంగా వీటి  ధర రూ.1200. కానీ ఇవి ఇప్పుడు బ్లాక్‌లో రూ.3వేలకు అమ్ముతున్నారు. నగరంలో మెడికల్‌, సర్జికల్‌ ఏజెన్సీలు కృత్రిమ కొరత సృష్టించి విపరీతంగా ధరలు పెంచి అమ్ముతున్నారు.

అన్నీ అరకొరే..
కొవిడ్‌ వార్డులో పని చేసే డాక్టర్లు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది పీపీఈ కిట్లు, గ్లౌజ్‌లు, మాస్క్‌లు ఇతర స్వీయరక్షణ పరికరాల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. రోగులకు ప్రాణాధార మందు అయిన రెమిడ్‌సివిర్‌ కొరత కూడా తీవ్రంగా ఉంది. రోగులకు సరిపడా అందుబాటులో లేవు. కొవిడ్‌ రోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నందు వల్ల రోజుకు 600 నుంచి 700 వరకు రెమిడ్‌సివిర్‌ వాయిల్స్‌ అవసరమవుతున్నాయి. కానీ ప్రభుత్వం రోజుకు 130 నుంచి 150 వరకు మాత్రమే సరఫరా చేస్తోంది. ఇవి కూడా రోగులకు పూర్తిస్థాయిలో వినియోగం కావడం లేదు. ఇందులో కొన్ని పక్కదారి పడుతున్నాయి. రోగులకు ఇచ్చినట్టు రికార్డుల్లో రాసి బయటకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. వీటిని బ్లాక్‌ మార్కెట్‌లో ఎక్కువ ధరలకు దొంగచాటున అమ్ముకుంటున్నారు.

రోగుల అవసరాన్ని బట్టి రెమిడ్‌సివిర్‌ను ఎప్పటికప్పుడు సరఫరా చేయాల్సిన అవసరం ఉన్నది. వీటి వినియోగంపై నిఘా పెట్టాల్సి ఉంది. కొవిడ్‌ వార్డులో పల్స్‌ ఆక్సీమీటర్లు కూడా చాలినన్ని లేవు. ఉన్నవి సరిగా పని చేయడం లేదు. కొత్తవాటి కోసం అధికారులు ఇండెంట్‌ పెట్టినా రావడం లేదు. కరోనా రోగుల ఆక్సీజన్‌ స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు పల్స్‌ ఆక్సీమీటర్ల అవసరం ఎంతో ఉంటుంది. డాక్టర్లు రోగులనే కొనుక్కోమంటున్నారు. వీటి డిమాండ్‌ కూడా పెరిగింది. సాధారణంగా రూ.1000కి దొరికే ఆక్సీమీటర్‌ ఇప్పుడు రూ.1500 నుంచి రూ.2000కు విక్రయిస్తున్నారు.

సిబ్బంది దందా
కొవిడ్‌ వార్డులో బెడ్లు, ఆక్సీజన్‌ కొరత ఉండడంతో ఆస్పత్రిలో పనిచేసే కొందరు సిబ్బంది ఇదే అవకాశంగా తీసుకొని దందా నడుపుతున్నారు. ఆస్పత్రికి వచ్చిన రోగుల బంధువులు, కుటుంబసభ్యులతో బేరసారాలు సాగిస్తున్నారు. బెడ్‌, ఆక్సీజన్‌ ఇప్పిస్తామని రూ.5వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. చికిత్స కోసం వచ్చిన రోగులకు వార్డులో బెడ్లు లేవని, ఆక్సీజన్‌ అందుబాటులో ఉన్నా... లేదని తిప్పి పంపుతున్నారు. నలుగురైదుగురు ముఠాగా ఏర్పడి బేరాలకు దిగుతున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో రోగుల బంధువులు అడిగినంత ఇచ్చేస్తున్నారు.

డాక్టర్ల లేరు..
ఎంజీఎంలో హౌస్‌సర్జన్లు ఇప్పుడు లేరు. కోర్సు కాలం పూర్తవడంతో ఆస్పత్రికి ఎవరూ రావడం లేదు. పీజీ డాక్టర్లు కూడా పరీక్షలవల్ల విధులకు దూరంగా ఉంటున్నారు. పని భారమంతా సాధారణ వైద్యుల మీదే పడుతోంది. కరోనా భయం వల్ల వారు కూడా విధులకు తరుచూ గైర్హాజరవుతుండడంతో నర్సులే దిక్కవుతున్నారు. ఎంజీఎం కొవిడ్‌వార్డులో టోల్‌ఫ్రీ నెంబర్‌ లేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలో తెలియడం లేదు. సలహాలు సూచనలు ఇచ్చేవారు లేరు. దీంతో రోగులు, వారి బంధువులకు దిక్కుతోచడం లేదు. ఎప్పటికప్పుడు తగిన సమచారం ఇవ్వడానికి కొవిడ్‌వార్డులో టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయలని కోరుతున్నారు.

ఫార్మసీ వింగ్‌ అవసరం
మందులు సకాలంలో అందక కరోనా రోగులు మృత్యువాత పడుతున్నారు. కొవిడ్‌ వార్డులోని రోగులకు రాసిచ్చిన మందులను ఆస్పత్రిలో దూరంగా ఉన్న ఫార్మసీ స్టోర్‌కు వెళ్ళి తీసుకురావడంలో ఆలస్యం జరుగుతోంది. అలా కాకుండా వార్డులోనే 24గంటల పాటు పనిచేసేలా ఒక ఫార్మసీ స్టోర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది.  

మృతదేహం ప్యాకింగ్‌కు రూ.4వేలు
ములుగు, మే 5: ములుగు జిల్లాకేంద్రంలోని ఏరియా వైద్యశాలలో కొంతమంది వైద్యసిబ్బంది కరోనా మృతదేహాన్ని ప్యాకింగ్‌ చేసేందుకు డబ్బులు అడిగారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ బుధవారం ఉదయం మృతిచెందింది. కుటుంబసభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఆస్పత్రికి వచ్చారు. అయితే మృతదేహాన్ని కరోనా నిబంధనలకు అనుగుణంగా ప్యాక్‌చేసి అంబులెన్స్‌లోకి ఎక్కించాలంటే రూ.4వేలు ఇవ్వాలని సిబ్బంది డిమాండ్‌ చేశారు. దీంతో మృతురాలి బంధువులు ఎంతో కొంత డబ్బు చేతిలో పెట్టి మృతదేహాన్ని తీసుకెళ్లారు. అందుకు సంబంధించిన వీడియోను కుటుంబసభ్యుల్లో ఒకరు రహస్యంగా తీసి మీడియాకు పంపారు. ఈ విషయమై డీఎంహెచ్‌వో డాక్టర్‌ అల్లెం అప్పయ్య స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.  

అందరూ ఉన్నా అనాథగా..

లింగాలఘణపురం మే 5: జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కళ్లెం గ్రామానికి చెందిన కానుగంటి రాంనర్సమ్మ(65) ఈనెల 29న కరోనా కారణంగా మృత్యువాత పడింది. ఆమెకు భర్త యాదగిరితో పాటుగా నలుగురు కొడుకులున్నారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఊరికి దూరంగా దహనసంస్కారాలు జరిపించారు. అనంతరం మృతురాలి నలుగురు కొడుకులు హోంక్వారంటైన్‌లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. కాగా, కరోనా మహమ్మారి కారణంగా అమ్మ చనిపోయిన బాధ నుంచి తేరుకోకపోవడం ఒకటైతే.. పలువురి సూటిపోటి మాటలు తమను మరింత కుంగదీస్తున్నాయని వారంటున్నారు.

తండ్రీకొడుకులు మృతి
నెల్లికుదురు మే 5 : మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలకేంద్రంలో తండ్రీకొడుకులను కరోనా బలితీసుకుంది. ఈనెల 2న మద్ది భిక్షం(61) కరోనాతో చనిపోగా, ఈ నెల 4న తన పెద్ద కుమారుడు మద్ది వీరన్న (45) హైదరాబాద్‌లో చికిత్సపొందుతూ మృతిచెందారు. మద్ది భిక్షం రెండేళ్ల కిందట అటెండర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందగా, పెద్ద కుమారుడు మద్ది వీరన్న నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సెరికల్చర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించాడు. ఇద్దరి మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కాగా, మద్ధి భిక్షం భార్య, కోడలు సైతం ఇప్పుడు కరోనాతో పోరాడుతున్నారు. వారి దయనీయ స్థితిని చూసి గ్రామస్థులు కన్నీటి పర్వంతమవుతున్నారు.

Updated Date - 2021-05-06T05:40:47+05:30 IST