మేము కొవిడ్‌ సెంటర్‌కు వస్తే... మా ఇంట్లో మీరు వంట చేస్తారా ?

ABN , First Publish Date - 2021-06-18T06:13:48+05:30 IST

‘మాకు..

మేము కొవిడ్‌ సెంటర్‌కు వస్తే... మా ఇంట్లో మీరు వంట చేస్తారా ?
కరోనా బాధితులను అంబులెన్స్‌లో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలిస్తున్న దృశ్యం

అధికారులపై తిరగబడ్డ కరోనా బాధితులు

అతికష్టంపై అంబులెన్స్‌లలో తరలించిన అధికారులు


పలమనేరు(చిత్తూరు): ‘మాకు పాజిటివ్‌ వచ్చింది నిజమే... అయితే మేము కొవిడ్‌ సెంటర్‌కు వస్తే... మా మొగుళ్లకు మీరు వంటచేసి పెడతారా’ అంటూ కరోనా బాధితులు అధికారులపై తిరగబడ్డ ఘటన పలమనేరు మండలంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... కొలమాసనపల్లె పంచాయతీ మాదిగబండలో 14 మంది కరోనా పాజిటివ్‌లు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండకుండా తిరుగుతున్నారని తెలిసి మండల కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ సభ్యులు డీటీ ధనంజయ, ఎంపీడీవో విద్యాసాగర్‌, వైద్యాధికారి మల్లికార్జున్‌, పోలీసులు గురువారం ఆ గ్రామానికి చేరుకున్నారు. సదరు బాధితులు కొంతమంది వీధుల్లో తిరుగుతూ, మరికొంతమంది పొలాలవద్ద  కనిపించారు. వెంటనే అధికారులు కరోనా బాధితులను పిలిపించి బయట తిరగరాదని హెచ్చరించారు. మిమ్మల్ని కొవిడ్‌ సెంటర్‌కు తరలిస్తున్నామని తెలపడంతో ఒక్కసారిగా బాధితులు అధికారులపై తిరగబడ్డారు.


మేము ఆస్పత్రికి వచ్చి బెడ్‌పై పడుకొంటే, మా మొగుళ్లతోపాటు బిడ్డపాపలకు మీరు వంటచేసి పెడతారా అని ప్రశ్నించారు. మేము ఆస్పత్రికి వస్తే వ్యవసాయపనులు నిలిచిపోవడంతోపాటు, ఇంటిదగ్గరున్న పశువులకు మేతపెట్టేవారు కూడా ఉండరని, మేము మాత్రం వచ్చే ప్రసక్తే లేదని మొండికేశారు. దీంతో కొద్దిసేపు కొవిడ్‌ బాధితులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు అధికారులు సర్దిజెప్పి ‘మీ కుటుంబాన్ని విలేజ్‌ ఐసోలేషన్‌కు తరలిస్తామని, వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, మీరు భయపడాల్సిన పనిలేదని నచ్చజెప్పగా 14 మందిలో 11 మంది మాత్రం స్వచ్ఛందంగా వచ్చి అంబెలెన్సులు ఎక్కి కొవిడ్‌ సెంటర్‌కు చేరుకున్నారు. మిగిలిన ముగ్గురు మొండికేయడంతో అతికష్టంపై అంబులెన్సులో ఎక్కించి కొవిడ్‌ సెంటర్‌కు తరలించారు. ఇలా రెండుగంటలపాటు బాధితులు అధికారులకు ముచ్చెమటలు పట్టించారు.

Updated Date - 2021-06-18T06:13:48+05:30 IST