’కరోనా ఆస్పత్రిలో ఉన్న మా అమ్మ ఫోన్ చేసి.. ఆకలేస్తోందిరా.. అంటోంది..’

ABN , First Publish Date - 2020-08-04T19:58:50+05:30 IST

రాష్ట్రస్థాయి ప్రాంతీయ కొవిడ్‌ ఆస్పత్రి విమ్స్‌(విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)లో వైరస్‌ బాధితులకు అందుతున్న వైద్యం, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు పట్ల

’కరోనా ఆస్పత్రిలో ఉన్న మా అమ్మ ఫోన్ చేసి.. ఆకలేస్తోందిరా.. అంటోంది..’

ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..?

చనిపోయినా... సమాచారం ఇవ్వడం లేదు 

మాకు చెప్పకుండానే అంత్యక్రియలు చేసేస్తున్నారు

వైద్యం, మందులు సకాలంలో అందడం లేదు

విమ్స్‌లో కొవిడ్‌ బాధితుల కుటుంబ సభ్యుల ఆరోపణ

విమ్స్‌ను సందర్శించిన మంత్రి ముత్తంశెట్టి నిలదీత


విశాఖపట్టణం (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి ప్రాంతీయ కొవిడ్‌ ఆస్పత్రి విమ్స్‌(విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)లో వైరస్‌ బాధితులకు అందుతున్న వైద్యం, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు పట్ల రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమక్షంలోనే అధికారులను బాధితుల బంధువులు కడిగి పారేశారు. ‘చికిత్స పేరుతో ఆస్పత్రులకు తీసుకువచ్చి పట్టించుకోవడంలేదని, అంతకన్నా  ఇళ్లల్లోనే ఉంచేస్తే సరిపోయేది కదా? అంటూ సోమవారం ఉదయం విమ్స్‌ సందర్శనకు వచ్చిన మంత్రిని నిలదీశారు. సకాలంలో వైద్యం అందక, మందులు ఇవ్వక, ఆహారం పెట్టకపోవడంతో బాధితులు విలవిలలాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రాణాలుపోతున్నా సిబ్బంది పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వాళ్లు ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? అని అడుగుతున్నా... ఎవరూ స్పందించడం లేదని, చనిపోయినట్టు కూడా తమకు సమాచారం ఇవ్వడంలేదని వాపోయారు. ఈ సందర్భంగా కొంతమంది బాధితులు వ్యక్తం చేసిన ఆవేదన వారి మాటల్లోనే...


రెండు రోజులు అవుతున్నా.. వస్తువులు చేరలేదు:  పి.సూర్యారావు, వైరస్‌ బాధితురాలి కుమారుడు

మా అమ్మకు కొవిడ్‌ సోకడంతో ఒకటో తేదీన కేజీహెచ్‌ నుంచి విమ్స్‌కు పంపారు. ఆ రోజు నుంచి ఆమె పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. సమాచారం ఇచ్చేవారు లేరు. దుస్తులు, సెల్‌ఫోన్‌ పంపించి రెండు రోజులు అవుతున్నా.... ఆమెకు చేరలేదు. సిబ్బందిని అడిగితే మాకేమీ తెలియదంటున్నారు.


చనిపోయిన ఐదు రోజులకు సమాచారం.. : -పి.కుమార్‌(మృతి చెందిన వ్యక్తి అల్లుడు)

మా మామయ్య సూర్యనారాయణను గత నెల 28వ తేదీ ఉదయాన్నే విమ్స్‌లో జాయిన్‌ చేశాం. అదే రోజు 10:30 గంటలకు మృతి చెందాడు. ఈ విషయాన్ని అధికారులు గానీ, సిబ్బంది గానీ తెలియజేయలేదు. సిబ్బందిని అడిగితే.. మీ పేషెంట్‌ కనిపించడం లేదని చెప్పారు. రోజూ అదే సమాధానం చెబుతుంటే... 30వ తేదీ మా బావమరిది పీపీఈ కిట్‌ వేసుకుని ఆస్పత్రిలోని అన్ని బ్లాకుల్లో వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. ఆస్పత్రిలో చేరిన రోజే చనిపోయాడని ఒకటో తేదీన సిబ్బంది తెలియజేశారు.  ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు. చివరి చూపు కూడా దక్కకుండా చేశారు. 


చనిపోయినా బాగుణ్ణు అంటోంది..: - ఆర్‌.సత్యనారాయణ, వైరస్‌ బాధిత బంధువు

మా అమ్మ జగ్గయ్యమ్మకు గత నెల 25న కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో విమ్స్‌కు తరలించారు. మూడు రోజుల వరకు కనీసం ఎవరూ పట్టించుకోలేదు. మూడో రోజు ఫోన్‌ చేసి ఆకలేస్తోందిరా! అని దీనంగా చెప్పింది.  సిబ్బందికి ఈ విషయం చెబితే... ఇస్తారులెండి అని సమాధానమిచ్చారు. మరుసటి రోజు ఫోన్‌ చేసి.... ‘ఇక్కడ(ఆస్పత్రిలో) ఉండడం కంటే చనిపోతే బాగుండు’ అని వాపోయింది. వైద్యులు, సిబ్బంది పట్టించుకోవడంలేదు.

Updated Date - 2020-08-04T19:58:50+05:30 IST