కరోనా కాలం..అప్రమత్తత లేకపోతే ఆపదే

ABN , First Publish Date - 2020-08-11T09:37:29+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నగరంలో ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నా..

కరోనా కాలం..అప్రమత్తత లేకపోతే ఆపదే

వరుసగా వచ్చే పండుగల వేళ మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి 

సామూహిక వేడుకలకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నగరంలో ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నా.. కొన్నిచోట్ల మాత్రం  స్వచ్ఛందంగా కట్టడి జోన్లను ఏర్పాటు చేసుకుని జాగ్రత్తపడుతున్నారు. ఈ సమయంలో ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించడానికే భయపడుతున్న వేళ పండుగల సీజన్‌ కూడా వచ్చేసింది. శ్రావణ మాసం ఆరంభంతో పండుగల సీజన్‌ ప్రారంభమైంది. ఈ నెలలో రక్షాబంధన్‌, తీజ్‌, కృష్ణాష్టమి, స్వాతంత్య్రదినోత్సవం, వినాయక చవితి, ఓనం, మొహరం.. ఇలా పండుగలన్నీ వరుసగా వస్తున్నాయి.  కృష్ణాష్టమి, వినాయకచవితి లాంటి పండుగలు జన సందోహం ఉండాల్సిందేనన్నట్లు ఉంటాయి. దురదృష్టవశాత్తు ఆ సంప్రదాయాలే కరోనా వేళ పెను విపత్తుగా పరిణమించే అవకాశాలు లేకపోలేదన్నది నిపుణుల భావన. కృష్ణాష్టమి వేడుకల పేరిట బుజ్జాయిలను రాధా-కృష్ణుల్లా అలంకరించడం, దేవాలయాలను సందర్శించడం, ఇంకా ఆసక్తి ఉన్నవారు బాలకృష్ణుల పోటీల్లో పాల్గొనడం జరుగుతుంటుంది. వినాయకచవితి అయితే వీధి వీధిలో బొజ్జ గణపయ్య కొలువుండటం కనిపిస్తుంటుంది. కరోనా విజృంభణ వేళ సామూహిక వేడుకలపై నియంత్రణ కొనసాగే అవకాశాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. 


అపదీ కర్తవ్యో ధర్మః

ప్రస్తుత కరోనా సమయంలో, వినాయక నవరాత్రి వేడుకలు మాత్రమే కాదు.. పరిస్థితులు అనుకూలించకపోతే బతకమ్మ, దసరా వేడుకలపై కూడా నియంత్రణలు కొనసాగే అవకాశాలున్నాయి. మహమ్మారి విజృంభణ సమయంలో వినాయక చవితి లాంటి వేడుకలను ఇంటికే పరిమితం చేసుకోవడం ఉత్తమమన్నది నిపుణుల భావన. మనహిందూ ధర్మంలో ప్రతి దానికీ ఓ ప్రత్యామ్నాయాన్ని కూడా సూచించారని, ఈ సంక్షోభ సమయంలో ఆ ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించి పండుగ స్ఫూర్తిని కొనసాగించవచ్చంటున్నారు ఓ దేవాలయంలోని పూజారి వెంకటేశ్వర్‌రావు. ఆయన మాట్లాడుతూ.. అపదీ కర్తవ్యో ధర్మః అన్నారు. అంటే ఆపదల సమయంలో మనం ఆచరించే విధానాలను ధర్మశాస్త్రాలు సైతం అంగీకరిస్తాయనే! సంక్షోభ సమయంలో ఆపద్ధర్మంగా విభిన్న విధానాలను అనుసరించవచ్చని చాలా వరకూ పూజా విధానాలలోనే ఉంటుంది. వినాయక చవితినే చూస్తే ఏకవింశతి పత్రాలని చెబుతాం. కానీ అందుబాటులో లేనప్పుడు ఉన్న వాటితోనే చేయాలని చెబుతాం. అలాగే మిగిలిన పండుగలు. శాస్త్రోక్తంగా పండుగ, పూజ చేయాలంటే ఇప్పుడు కుదరని పని, ఆ నాటి వాతావరణ పరిస్థితులు ఇప్పుడు లేవు. నిష్కల్మషమైన మనసుతో ఆరాధన చేయడం మాత్రమే ముఖ్యం. ఇప్పుడు కావాల్సింది ఆ నిష్కల్మషమైన మనస్సు మాత్రమే అని చెప్పుకొచ్చారు.


మనసుంటే మార్గముంటుంది

సంక్షోభ వేళ పండుగలు చేసుకునేందుకు హైరానా పడాల్సిన అవసరమే లేదు. మనసు పెడితే పండుగను వేడుకగా చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇదే విషయమై ఆధ్యాత్మిక వేత్త సత్యవాణి గొట్టిపాటి మాట్లాడుతూ.. కృష్ణాష్టమికి ఉట్టికొట్టడం మన సంప్రదాయం ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అపార్ట్‌మెంట్‌లోనే ఎవరింట్లో వారు ఉట్టి కొట్టించవచ్చు. బాలాగంగాధర్‌ తిలక్‌ సామూహికంగా వినాయక చవితి వేడుకలు చేయడాన్ని అప్పుడున్న పరిస్థితుల కారణంగా చేశారు.  


ప్రకృతిని కాపాడటం మన బాధ్యత  

మటి ్ట విగ్రహాలు లభ్యం కాని పరిస్థితుల్లో వినాయకుడిని పసుపు ముద్దతో చేసుకోవచ్చు. ప్రసాదంగా బెల్లం ముక్క, అటుకులు, మన ఇంట్లో అందుబాటులో ఉండే పిండి పదార్థాలు ఏవైనా వినాయకుడు స్వీకరిస్తాడు. పత్రులను బయటి నుంచి తీసుకొస్తుంటాం. వీటిని తెచ్చినప్పుడు.. లేదంటే తెంపినప్పుడు వచ్చే గాలివల్ల విషక్రిములు రాకుండా ఉంటాయి. మనం వినాయకచవితిని ఇప్పుడు ఏ స్ఫూర్తితో చేసుకోవాలంటే.. ఏ పర్యావరణ పరిరక్షణ కోసమైతే 21 పత్రులను గుర్తు పెట్టుకుని సంరక్షించుకోవాలనే భావనతో పూజ చేసుకుంటున్నామో అటువంటి ఔషధ గుణాలు కలిగిన పత్రిని కాపాడటం మనం ఈ ప్రకృతికి ఇచ్చే నివాళి. ప్రకృతిని కాపాడటం మన బాధ్యత. ఆ బాధ్యతను స్వీకరించడమే మనం చేయాల్సిన పూజ. ఇప్పటి వరకూ ఓ తంతులా చేశాం. భీతావహ క్రతువునూ అనుసరించాం. ఈ సంవత్సరం మనకు వినాయకుడు ఓ అవకాశం ఇచ్చాడు. ఆ క్రతువును అర్థవంతంగా ఇంటిలో ఉండి మన మనసును సమర్పించుకునేలా చేసుకునే అవకాశం అది. ఆ సానుకూల ధోరణితో  పండుగ చేసుకుంటే ఆ భగవంతుడు బాగా స్వీకరిస్తాడు. బాధ పడాల్సింది ఏమిటంటే.. కొన్ని వృత్తుల వారు ఇబ్బంది పడవచ్చు. వారికి మనం సహాయం చేస్తే అందరూ హ్యాపీగా ఉండవచ్చు.

- సత్యవాణి గొట్టిపాటి, ఆధ్యాత్మిక వేత్త 


ఇవి పాటించాలి

వీలైనంత వరకూ పండుగలను ఇంట్లో చేసుకోవడంతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో జనసమూహాలకు దూరంగా ఉండడం మంచిది. 

కృష్ణాష్టమికి పిల్లలను కృష్ణుడిలా అలంకరించినా బయటకు లేదా పోటీలకు తీసుకెళ్లవద్దు. వీలైతే ఆన్‌లైన్‌లో పోటీల్లో పాల్గొనవచ్చు. 

స్వాతంత్య్ర దినోత్సవాల్లో భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. 

వినాయక చవితి పూజ కోసం మట్టి విగ్రహాలు దొరికితే మంచిది. నిమజ్జనం ఇంట్లోనే చేసుకోవడానికి ప్రయత్నించాలి. 

మట్టి విగ్రహాలు దొరకకపోతే పసుపు ముద్దనే వినాయకుడిగా పూజించవచ్చు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలతో ఇప్పటికే నాశనమైన ప్రకృతిని మరింత నాశనం చేయడానికి ప్రయత్నించవద్దు.

గణేశ్‌ మండపాలను సందర్శించడం తగ్గించుకుంటే మంచిది.  

Updated Date - 2020-08-11T09:37:29+05:30 IST