కరోనా పీడించినా..సంక్షేమ బడ్జెట్‌

ABN , First Publish Date - 2021-03-07T07:40:42+05:30 IST

కరోనా అనంతర పరిస్థితుల్లో ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు.

కరోనా పీడించినా..సంక్షేమ బడ్జెట్‌

  • గత బడ్జెట్‌ కన్నా ఎక్కువ కేటాయింపులు.. 
  • కరోనాతో ఖజానాకు 50 వేల కోట్ల నష్టం
  • ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష కోట్ల ప్రభావం.. 
  • ఐనా సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం
  • మరో 3 లక్షల గొర్రెల యూనిట్లు అందజేస్తాం
  • ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ పుంజుకున్నాయి
  • సర్కారు రాబడి పెరుగుతోంది: సీఎం కేసీఆర్‌
  • బడ్జెట్‌ రూపకల్పనపై ఉన్నత స్థాయి సమీక్ష
  • మూడో వారంలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు
  • నేటి నుంచి శాఖల వారీగా సమీక్షలు

హైదరాబాద్‌, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): కరోనా అనంతర పరిస్థితుల్లో ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. వివిధ రూపాల్లో ప్రభుత్వానికి రాబడి పెరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాబోయే వార్షిక బడ్జెట్‌ (2021-22) కేటాయింపులు గత బడ్జెట్‌ కంటే ఎక్కువగానే ఉండే అవకాశముందని ప్రకటించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌ను రూ.1.82 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈసారి అంతకన్నా ఎక్కువ కేటాయింపులు ఉండనున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఈ నెల మూడోవారంలో శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపారు. బడ్జెట్‌ రూపకల్పన, బడ్జెట్‌ సమావేశాలపై శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఆర్థిక పద్దులో పొందుపరచాల్సిన శాఖలవారీ బడ్జెట్‌ అంచనాలను, అధికారులు అందించిన ఆర్థిక నివేదికలను సీఎం పరిశీలించారు. కరోనా కారణంగా రాష్ట్ర ఖజానాకు దాదాపు 50 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు. దాని ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.లక్ష కోట్ల వరకు ఉంటుందన్నారు. అయినా.. ఇప్పటికే అమల్లో ఉన్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకంతో గొల్ల కురుమ కుటుంబాలు ఆదాయాన్ని ఆర్జిస్తున్నందున.. దీనిని కొనసాగిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఇప్పటికే పంపిణీ చేసిన 3.70 లక్షల యూనిట్లకు కొనసాగింపుగా మరో 3 లక్షల గొర్రెల యూనిట్ల పంపిణీ చేస్తామని అన్నారు. ఇందుకుగాను రానున్న బడ్జెట్‌లో కేటాయింపులకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా మెచ్చుకుందని, దేశంలోనే అత్యధిక సంఖ్యలో గొర్రెలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ పురోగమిస్తుట్లు కేంద్రం గుర్తించిందని చెప్పారు. దీంతోపాటు చేపల పెంపకం కార్యక్రమం కూడా గొప్పగా కొనసాగుతోందని, మంచి ఫలితాలు కూడా వస్తున్నందున దానిని కూడా కొనసాగిస్తామని అన్నారు.


నేటి నుంచి శాఖల వారీగా సమీక్ష..

శనివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో బడ్జెట్‌ అంచనాలు, కేటాయింపులకు సంబంధించి విధి విధానాలు ఖరారయ్యాయి. ఆదివారం నుంచి ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ అడ్మినిరేస్టషన్‌, విద్య, నీటిపారుదల తదితరర శాఖలను వరుసగా పిలిచి, ఆర్థికశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సమావేశాలు నిర్వహిస్తారని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అన్ని శాఖలతో బడ్జెట్‌పై కసరత్తు ముగిసిన అనంతరం తుది దశలో ముఖ్యమంత్రి అధ్యక్షతన బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దనున్నారు. 


ఈ నెల 15-18 మధ్య బడ్జెట్‌ సమావేశాలు..!

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 15-18 మధ్య ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్‌ ఈ నెల 14న జరగనుండడంతో అవి ముగిశాకే బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. త్వరలో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక రానుండటంతో ఆ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న యాదవ సామాజికవర్గం ఓటర్లకు ఆకట్టుకోవడానికే ప్రభుత్వం గొర్రెల పంపిణీ కొనసాగిస్తామని ప్రకటించినట్లు భావిస్తున్నారు. 

Updated Date - 2021-03-07T07:40:42+05:30 IST