‍కరోనా రాజకీయం

ABN , First Publish Date - 2020-04-23T08:15:36+05:30 IST

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఐదోవారంలోకి ప్రవేశించింది. మరోపక్క కొన్ని రాష్ట్రాల్లో పరిమిత సడలింపుల పర్వమూ ఆరంభమైంది. లాక్‌డౌన్‌తో వైరస్‌ వ్యాప్తి వేగాన్ని నియంత్రించుకుంటూనే, పాక్షిక సడలింపులతో...

‍కరోనా రాజకీయం

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఐదోవారంలోకి ప్రవేశించింది. మరోపక్క కొన్ని రాష్ట్రాల్లో పరిమిత సడలింపుల పర్వమూ ఆరంభమైంది. లాక్‌డౌన్‌తో వైరస్‌ వ్యాప్తి వేగాన్ని నియంత్రించుకుంటూనే, పాక్షిక సడలింపులతో ఆర్థికాన్ని కూడా కాస్తంత గాడినపెట్టేందుకు ఓ ప్రయత్నం జరుగుతోంది. ఆరోగ్యం రాష్ట్రాల అధీనంలో వ్యవహారం కనుక, కేంద్రం ప్రకటించిన సడలింపుల విషయంలోనూ అవి తమకు నచ్చిన నిర్ణయాలే తీసుకున్నాయి. తమ రాష్ట్రాల్లో పరిస్థితికి అనుగుణంగా, తమకు యోగ్యమైన విధానాలతో అవి వైరస్‌మీద యుద్ధం చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు కాస్తంత ధైర్యంగా ఉంటే, మరికొన్ని ఆర్థిక నష్టానికి కూడా వెరవకుండా నిర్బంధాన్ని కఠినంగా అమలు చేస్తున్నాయి. రాబోయే రోజులు మరింత భయానకమన్న వాదనలను అటుంచినా, ప్రస్తుతం దేశం నాలుగురోడ్ల కూడలిలో ఉంది. కనీసం పక్షం రోజుల తరువాత కానీ కరోనా నియంత్రణ విషయంలో మనం సాధించిందేమిటన్నది స్పష్టంగా తెలియదని నిపుణులు అంటున్నారు. కేంద్రమూ, రాష్ట్రాలు చక్కని సమన్వయంతో, సమష్టి పోరాటంతో ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ఈ విపత్కర స్థితిలో రాజకీయం వెర్రితలలు వేయడం విచారం కలిగిస్తున్నది.


ఒకపక్క రాష్ట్రాలు రోగంపై యుద్ధం చేస్తుంటే, మరోపక్క కేంద్రం రాష్ట్రాలతో పోరాడుతోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. మార్గదర్శకత్వం కేంద్రానిది కావచ్చునేమో కానీ, కరోనాను కట్టడిచేయాల్సింది అంతిమంగా రాష్ట్రాలే. కరోనాపై పోరులో ఎప్పటికప్పుడు రాష్ట్రాలను సంప్రదిస్తున్నట్టుగా ప్రధాని కూడా కనిపించారు. ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ సలహాలు, సూచనలు స్వీకరించారు. మరీముఖ్యంగా, లాక్‌డౌన్‌ కొనసాగింపు నిర్ణయాన్ని వారి సూచనలమేరకే తాను తీసుకున్నట్టు కూడా చెప్పుకున్నారు. ఏ అగ్రరాజ్యమూ చేయని రీతిలో తాను కరోనాపై యుద్ధం చేస్తున్నానని ఆయన పరోక్షంగా చెప్పుకోవడంలోనూ తప్పుబట్టాల్సిందేమీ లేదు. ఎవరు కాదన్నా, రాష్ట్రాలు సాధించిన విజయంలో సింహభాగం ఆయనకే దక్కుతుంది. మిగతా ప్రపంచమూ ఆయననే ప్రశంసిస్తుంది. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా ఈ సంక్షోభకాలంలో కేంద్రంతో ఎంతో చక్కగా ఉంటూ, దానిమాట వింటూవచ్చాయి. ఈ నేపథ్యంలో, కొన్ని రాష్ట్రాల పనితీరును మాత్రమే పరిశీలించేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా తన బృందాలను పంపడం విచిత్రం. ఇది రాష్ట్రాల పనితీరుపై తనకు నమ్మకంలేదన్న సందేశాన్నివ్వడంతో పాటు, రాజకీయ వివాదమూ రేపింది.


అనాదిగా సాగుతున్న మమత వర్సెస్‌ కేంద్రం యుద్ధం ఈ విపత్తుకాలంలో కొత్త పుంతలు తొక్కింది. బెంగాల్‌ కంటే ఎక్కువ కేసులు, మరణాలున్న రాష్ట్రాలకు కాక, విపక్ష పాలిత రాష్ట్రాలకు మాత్రమే ఈ బృందాలు వెళ్ళడం వెనుక రాజకీయ ఎజెండా ఉన్నదని తృణమూల్‌ కాంగ్రెస్‌ విమర్శిస్తున్నది. లేఖాస్త్రాలతో మొదలైన యుద్ధం ఆ తరువాత కేంద్ర బృందాలను నిరోధించడం వరకూ పోయింది. మాకు ముందుగా చెప్పకుండా ఈ అడ్వంచర్‌ టూరిజం ఏమిటంటూ కేంద్రబృందాలు బసచేసిన గెస్ట్‌హౌస్‌ నుంచి వారిని బెంగాల్‌ ప్రభుత్వం బయటకు అడుగుపెట్టనివ్వకపోవడం, ఈ సంక్షోభకాలంలో రాష్ట్రం పెడసరంగా వ్యవహరిస్తున్నదంటూ కేంద్రం విమర్శలు గుప్పించడం ఆవేదన కలిగించే పరిణామాలు. ఇలా సీఆర్‌పిఎఫ్‌ను కేంద్రం, రాష్ట్ర పోలీసులను పశ్చిమబెంగాల్‌ ఆయుధంగా వాడుతూ తమ కక్షపూరిత రాజకీయాలు నెరపిన ఘట్టాలు గతంలోనూ చూశాం. లాక్‌డౌన్‌ సరిగా అమలు కావడం లేదంటూ రాష్ట్ర గవర్నర్‌ విమర్శించడం, కరోనా కంటే ప్రమాదకరమైన దీదీ వైరస్‌తో పోరాడుతున్నామని కేంద్రమంత్రి బాబుల్‌సుప్రియో వ్యాఖ్యానించడం ఈ పరిస్థితుల్లో తగనివి. కేంద్రంతో నిత్యమూ ఘర్షణపడే మమత ఈ కష్టకాలంలోనూ అదే ధోరణితో వ్యవహరించడం ప్రజలు మెచ్చరు. బెంగాల్‌కు ఏరికోరి పనికిమాలిన టెస్టుకిట్లు ఇచ్చారంటూ ఆమె వ్యాఖ్యానించడం సముచితం కాదు. లాక్‌డౌన్‌ నిబంధనల అమలులోనూ, ప్రధానంగా రాష్ట్రంలోని ఏడుజిల్లాల్లో వైరస్‌ తీవ్రత విషయంలోనూ ఇరుపక్షాల మధ్యా భిన్నాభిప్రాయాలు ఉండవచ్చును కానీ, నిజాన్ని నిగ్గుతేల్చే మార్గం ఇది కాదు. అంతిమంగా మమత దిగివచ్చినప్పటికీ, ఈ విపత్తు రాజకీయం ఇరుపక్షాలకూ అప్రదిష్టే తెచ్చిపెట్టింది. కొవిడ్‌పై ప్రశంసనీయమైన పోరాటం చేస్తున్నదని అందరూ మెచ్చుకున్న కేరళతోనూ కేంద్రం ఘర్షణ పడటం చూశాం. ఈ వివాదం స్వల్పకాలంలోనే సమసిపోయినా, విపక్ష పాలిత రాష్ట్రాలపైనే కేంద్రం కన్నెర్ర చేస్తున్నదన్న భావనకు ఈ రెండు ఉదంతాలు వీలు కల్పిస్తున్నాయి. ఒక సమగ్రమైన వ్యూహానికి కేంద్రం పరిమితమై, తమ తమ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలను అడుగులు వేయనివ్వడం ఉభయులకూ శ్రేయస్కరం.

Updated Date - 2020-04-23T08:15:36+05:30 IST