పాజిటివ్‌ ప్రాంతంలో శానిటైజేషన్‌

ABN , First Publish Date - 2020-04-04T10:30:50+05:30 IST

కావలిలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇంటికి మూడు కిలో మీటర్ల పరిధిలో శుక్రవారం ఉదయం అధికారులు ట్యాంకర్లతో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.

పాజిటివ్‌ ప్రాంతంలో శానిటైజేషన్‌

కావలి, ఏప్రిల్‌ 3: కావలిలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇంటికి మూడు కిలో మీటర్ల పరిధిలో శుక్రవారం ఉదయం అధికారులు ట్యాంకర్లతో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.  ఆ ప్రాంతన్ని అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే.  మున్సిపల్‌ కార్మికులు ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని శుభ్రపరచి బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌ రెడ్డి, సబ్‌కలెక్టర్‌ సీహెచ్‌. శ్రీధర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ కె. వెంకటేశ్వరరావు, తహసీల్దార్‌ శ్రీరామకృష్ణ, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో విజయకుమార్‌ ఆ ప్రాంతాన్ని సందర్శిచి అక్కడ ప్రజలకు కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.


ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి అధికారులు ప్రత్యేక రక్షణ చర్యలు చేపడుతున్నారన్నారు. ప్రజలు ఎవరూ ఇళ్లలో నుంచి అనవసరంగా బయటకు  రొవొద్దని, ఇతరులు ఎవరూ ఈ ప్రాంతానికి రాకుడదని చెప్పారు. ఈ ప్రాంతంలో ఎవరూ లాక్‌డౌన్‌ చర్యలను అతిక్రమించినా పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని  చెప్పారు. సబ్‌కలెక్టర్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ ఢిల్లీ మతప్రచారానికి వెళ్లిన వ్యక్తిని నెల్లూరుకు తరలించి వైద్యపరీక్షలు చేయించగా ఆయనకు పాజిటివ్‌ వచ్చిందని అధికారులు నిర్ధారించారన్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులందరినీ నెల్లూరు ఐసోలేషన్‌కు తరలించామని తెలిపారు. ఆ వ్యకితో సంబంధాలున్న వారిని గుర్తించి ఐసోలేషన్‌కు తరలిస్తామని చెప్పారు.


రోడ్లకు అడ్డంగా కంచె

 కావలిలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆందోళన చెందిన ఆ పక్క ప్రాంతం బీకేనగర్‌ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. తమ ప్రాంతానికి ఎవరంటే వారు రాకుండా రోడ్లకు అడ్డంగా ముళ్ల కంచె వేశారు. బీకేనగర్‌  చుట్టూ ఉన్న వీధులకు ముళ్లకంచె, టైర్లు అడ్డంగా ఉంచారు. వివిధ ప్రాంతాలో పలు సామాజిక వర్గాల ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. వారిలో కూడా ఒకరిపై ఒకరికి నమ్మకం లేక ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలో వీధులకు ఒక వీధి నుంచి మరొక వీధికి రాకుండా కూడా కంచె వేశారు.


అనవసరంగా రోడ్డుమీదకొస్తే రెండేళ్ల జైలు : సబ్‌కలెక్టర్‌

 ప్రజలు అనవసరంగా రోడ్లపైకి వచ్చి కరోనా వ్యాప్తికి కారకులైతే రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామని కావలి సబ్‌ కలెక్టర్‌ సీహెచ్‌. శ్రీధర్‌ హెచ్చరించారు. కావలి సబ్‌కలెక్టర్‌ కార్యాలయ సమావేశమందిరంలో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని చోట్ల ప్రజలు రోడ్లపైకి రాకుండా కంచెలు వేయడం మంచి పద్ధతి కాదన్నారు. పోలీసులే నియంత్రిస్తారన్నారు. రెడ్‌జోన్‌ ప్రకటిం చిన కావలి డివిజన్‌లోని కరోనా పా జిటివ్‌ ప్రాంతాల్లో ఎవరూ ఇళ్లనుంచి బయటకు రాకూడదని, ఆ ప్రాంతాలకు ఇతరులు వెళ్ల కూడదన్నారు.


ఆయా ప్రాంతాల్లో రెవెన్యూ సిబ్బందే  రేషన్‌ సరుకులు ఇంటికి తెచ్చిస్తారన్నారు. ఇతర ప్రొవిజన్స్‌, కూరగాయలు, పాలు తదితరాలను ఆయా ప్రాంతాల్లోనే ఏర్పాటుచేస్తారని తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో ప్రతి రోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకే కూరగాయలు, ప్రొవిజన్స్‌, పాలు, పండ్లు దుకాణాలు తెరచి ఉంటాయన్నారు. ఆ సమయం తర్వాత బయట తిరిగితే  చర్యలు తీసుకుంటామన్నారు.  సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ కె. వెంకటేశ్వరరావు, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో విజయకుమార్‌, తహసీల్దార్‌ శ్రీరామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2020-04-04T10:30:50+05:30 IST