లక్షణాలు లేకుండానే ఒకరికి కరోనా.. అదే బస్సులో పది మంది రాక...

ABN , First Publish Date - 2020-05-27T18:59:58+05:30 IST

వివిధ పనుల కోసం లాక్‌డౌన్‌ కంటే ముందు మహా రాష్ట్రకు వలస వెళ్లి లాక్‌డౌన్‌ సడలింపుతో తిరిగి స్వస్థలాలకు చేరుకుం టున్న వారి నుంచి కరోనా ముప్పు పెరుగుతోంది. మహా రాష్ట్ర నుంచి ఖమ్మం జిల్లాకు వచ్చిన వారిలో ఇప్పటికే మధిర మండలం

లక్షణాలు లేకుండానే ఒకరికి కరోనా.. అదే బస్సులో పది మంది రాక...

ఇదీ మహారాష్ట్ర లింకే..

ఇప్పటికే వైరస్‌బారిన పడిన ఇద్దరు

పెనుబల్లి మండలం వీఎంబంజరలో కలకలం


పెనుబల్లి/ ఖమ్మం (ఆంధ్రజ్యోతి): వివిధ పనుల కోసం లాక్‌డౌన్‌ కంటే ముందు మహా రాష్ట్రకు వలస వెళ్లి లాక్‌డౌన్‌ సడలింపుతో తిరిగి స్వస్థలాలకు చేరుకుం టున్న వారి నుంచి కరోనా ముప్పు పెరుగుతోంది. మహా రాష్ట్ర నుంచి ఖమ్మం జిల్లాకు వచ్చిన వారిలో ఇప్పటికే మధిర మండలం మహదేవపురంలో ఓ వ్యక్తికి, పెను బల్లి మండలం వీఎం బంజరకు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ రాగా.. వారితో పాటు అదే బస్సులో వచ్చిన వీఎం బంజరకు చెందిన మరోవ్యక్తికి కూడా పాజిటివ్‌ వచ్చినట్టు మంగళవారం నిర్ధారణైంది. 


ఒకే బస్సులో పది మంది రాక...

ఖమ్మం జిల్లాకు చెందిన ఏడుగురు, హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి, మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ఇద్దరు వ్యక్తులు.. లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు రావడంతో స్వస్థలాలలకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. వీరంతా కలిసి మహారాష్ట్ర నుంచి ఖమ్మానికి వచ్చేందుకు ఓ బస్సును రూ.50వేల కిరాయికి మాట్లాడుకున్నారు. ఒకరు హైదరాబాద్‌, ఇద్దరు మహబూబాబాద్‌లో దిగగా.. మిగిలిన ఏడుగురు ఖమ్మం జిల్లాకు చేరుకున్నారు. అయితే ఆ ఏడుగురు జిల్లాకు చేరుకోగానే అధికారులు పెనుబల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచగా ఈనెల 20వతేదీన వారిలోని ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ రాగా.. ఆమెతో పాటు క్వారంటైన్‌లో ఉంచిన మిగిలిన ఆరుగురిని కూడా ఈనెల 23న ఖమ్మంలోని శారదా కళాశాలలోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. దశల వారీగా వీరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 40ఏళ్ల వయసున్న వ్యక్తికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చినట్టు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం తెలిపారు. శారద క్వారంటైన్‌ నుంచి పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని నేరుగా 108ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు.


లక్షణాలు లేకుండానే కరోనా మహమ్మారి

ప్రభుత్వం ఓ వైపు కరోనా లక్షణాలు ఉన్నవారికి మాత్రమే నిర్ధారణ పరీక్షలు చేస్తామని, దారిన పోయే వారికి పరీక్షలు చేయమని చెబుతోంది. కానీ ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో కరోనా బారిన పడిన వారికి ఎలాంటి లక్షణాలు లేకుండానే వెలుగులోకి వచ్చాయి. మంగళవారం పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిలో కూడా ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్‌ రిపోర్టు రావడంతో వైద్యశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఖమ్మం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 11కు చేరింది. 


అధికారుల అప్రమత్తతతో తప్పిన భారీ ముప్పు..

ఖమ్మం జిల్లా పెనుబల్లి, వీఎం బంజర నుంచి జీవనోపాధి కోసం మహారాష్ట్ర, గుజరాత్‌ తదితర రాష్ట్రాలకు వెళ్లి స్వగ్రామాలకు చేరుకున్న 260మందిని అధికారులు ముందుచూపుతో మండల కేంద్రంతోపాటు లంకపల్లి, కుప్పెనకుంట్ల పాఠశాలల్లోని క్వారంటైన్లలో ఉంచారు. వారిలోనే పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడం, వీరెవరినీ గ్రామాల్లో అనుమతించకపోవడం, ఫలితంగా ఎవరినీ కాంటాక్టు కాకపోవడంతో వేరేవారికి వైరస్‌ వ్యాప్తి జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ముందుజాగ్రత్తగా తమ ఆధీనంలోకి తీసుకుని, వారిని నిత్యం పర్యవేక్షించడంలో ఎస్‌ఐ నాగరాజు, తహసీల్దార్‌ రవికుమార్‌, తదితర అధికారులు తీసుకున్న చర్యలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల ముందు జాగ్రత్తల వల్లే వైరస్‌ వ్యాప్తి ప్రమాదం తప్పిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2020-05-27T18:59:58+05:30 IST