పట్టించుకోరా ?

ABN , First Publish Date - 2020-06-04T09:35:23+05:30 IST

జిల్లాలో గడిచిన మూడు రోజుల్లో 40కిపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

పట్టించుకోరా ?

జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

జాగృతం చేయడంలో యంత్రాంగం విఫలం

నిబంధనల అమలు పట్టించుకోని పోలీసుశాఖ

స్వీయ నియంత్రణకు ప్రజలు తిలోదకాలు

అన్నింటా ఉల్లంఘనలే


అనంతపురం, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గడిచిన మూడు రోజుల్లో 40కిపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయినా ప్రజలను జాగృతపరచడంలో జిల్లా యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు అమలు చేయడంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సడలింపుల నేపథ్యంలో ప్రజలు సైతం ఎవరిదారి వారిదే అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయి పరిశీలనలో పలు నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. ఎక్కడ కరోనా పాజిటివ్‌ కేసు నమోదైతే స్థానిక అధికారులు అక్కడికి వెళ్లడం కంటైన్మెంట్‌ జోన్‌లు ఏర్పాటు చేయడంతో సరిపెట్టుకుంటున్నారు.


ఆ పాజిటివ్‌ వ్యక్తులు ఎవరెవరితో కాంటాక్ట్‌ అయ్యారో గుర్తించి క్వారంటైనకు తరలిస్తూ చేతులు దులుపుకుంటున్నారే తప్ప  ప్రజలను అప్రమత్తం చేయడం విస్మరిస్తున్నారు. కరోనా పాజిటివ్‌ కేసుల సమాచారాన్ని ఇవ్వడం ద్వారా ప్రజలు మరింత అప్రమత్తమవుతారన్న విషయాన్ని జిల్లా యంత్రాంగం పూర్తిగా మరిచిపోయింది. మరోవైపు పోలీసు యంత్రా ంగం ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకే పరిమితమయ్యారు. రోడ్లపైకి పోలీసులు వచ్చి లాక్‌డౌన్‌ నిబంధనలు అమలయ్యేలా  చర్యలు తీసుకోకపోవడం ప్రజలకు ఇష్టారాజ్యంగా మారింది. దుకాణదారులు మొదలుకుని కొనుగోలుదారుల వరకూ ఎవరూ నిబంధనలు పాటించడంలేదు. దుకాణ యజమానితో పాటు అందులో పనిచేసే వ్యక్తులు మాస్కులు ధరించడం లేదు.


కొనుగోలుదారులదీ అదేతీరు. రోడ్లపై మాస్కులు కూడా లేకుండానే దూసుకుపోతున్నారు. ఎక్కడా భౌ తికదూరాన్ని పాటించడం లేదు. పోలీసులు సైతం నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. ద్విచక్రవాహనాల్లో ఫ్యామిలీతో యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఆటోల్లో నిబంధనల మేరకు డ్రైవర్‌, ప్రయాణికులకు మధ్య తెర ఏర్పాటు చేసుకోవాలి. అయితే అవేమీ పట్టించుకోకుండా ఆటోలను తిప్పుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణికులు మాస్కులు వాడటం లేదు. గుంపులుగుంపులుగా బస్సు ఎక్కేందుకే ప్రాధాన్యతనిస్తున్నారు.


ప్రయాణికులకు శానిటైజర్స్‌ అందుబాటులో ఉంచడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ భౌతికదూరం పాటించకపోగా మాస్కులు వాడటం లేదు. ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి. వైన్‌షాపుల వద్ద ఒకరిపై ఒకరు తోసుకుంటూ మద్యం కొనుగోళ్లకు పోటీపడతున్నారు. ఇలా లాక్‌డౌన్‌ సడలింపులతో జిల్లాలో పరిస్థితి ఇష్టారాజ్యంగా మారింది.  జిల్లా యంత్రాంగం, పోలీసుశాఖ అప్రమత్తమైతే తప్ప కరోనాను కట్టడి చే యలేమన్నది నిర్వివాదాంశం.  

Updated Date - 2020-06-04T09:35:23+05:30 IST