మరో ఇద్దరికి కరోనా

ABN , First Publish Date - 2020-06-06T10:37:26+05:30 IST

ఖమ్మం జిల్లాలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ద్వారా ఖమ్మం జిల్లా అధికారులకు

మరో ఇద్దరికి కరోనా

మధిర, ఖమ్మంలో ఒక్కొక్కరికి లక్షణాలు 

ఖమ్మం జిల్లాలో 26కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు


ఖమ్మంసంక్షేమవిభాగం, జూన్‌ 5: ఖమ్మం జిల్లాలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ద్వారా ఖమ్మం జిల్లా అధికారులకు సమాచారం అందింది. తల్లికి వైద్యం చేయించేందుకు హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లిన ఓ యువకుడికి, అలాగే ఖమ్మంలోని త్రీటౌన్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారికి లక్షణాలున్నట్టు నిర్ధారణయ్యింది. మధిర ప్రాంతానికి చెందిన 29 సంవత్సరాల ఓ యువకుడు నల్గొండ జిల్లా తుంగతుర్తిలోని ఓ ప్రైవేట్‌ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఆయన తన తల్లికి ఆనారోగ్యంగా ఉండటంతో ఆమెకు వైద్యం చేయించేందుకు హైదరాబాద్‌లోని ఓ కార్పోరేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కరోనా లక్షణాలు కనిపించటంతో ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రి అధికారులు శ్యాంపిల్స్‌ సేకరించి పంపగా కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు శుక్రవారం నిర్ధారణైంది.


అదేవిధంగా ఖమ్మంనగరంలోని త్రీ టౌన్‌కు చెందిన 50 ఏళ్ల వయసున్న ఓ వ్యాపారికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. కొద్దిరోజులుగా జలుబు, దగ్గు వస్తుండటంతో జిల్లా ఆసుపత్రిలో చేరారు. అక్కడ పరీక్షలు చేయగా పాజిటివ్‌ నిర్ధారణైంది. అయితే ఈయనకు వైరస్‌ వ్యాప్తి ఎక్కడ, ఎవరి నుంచి జరిగిందనే లింకు విషయంలో స్పష్టత రాలేదు. అయితే శుక్రవారం నమోదైన రెండు పాజిటివ్‌ కేసులతో ఖమ్మం జిల్లాలో కేసుల సంఖ్య 26కు చేరింది.  వీరిలో తొమ్మిది మంది డిశ్చార్జ్‌ అవగా.. మరో 16 మంది వైద్యం పొందుతున్నారు.

Updated Date - 2020-06-06T10:37:26+05:30 IST