జీజీహెచ్‌లో 31 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-04-05T09:46:44+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య కలవరపెడుతున్నా, వ్యాధికి గురైన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటం కొంత ఊరట నిస్తోంది.

జీజీహెచ్‌లో 31 పాజిటివ్‌ కేసులు

మధ్య వయస్కులు... సకాలంలో చికిత్సతో పరిస్థితి మెరుగు

అపోహలు విడనాడాలి

అవగాహనతో సంపూర్ణ ఆరోగ్యం


నెల్లూరు, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య కలవరపెడుతున్నా, వ్యాధికి గురైన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటం కొంత ఊరట నిస్తోంది. శనివారం సాయంత్రానికి జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 32గా ప్రకటించారు. ఇందులో తొలి కేసు నయమై ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. గడిచిన నాలుగు రోజుల్లో నమోదైన 31 కేసుల వారు నెల్లూరు ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం సాయంత్రానికి వీరందరి ఆరోగ్యం నిలకడగా ఉందని, అందరికీ వ్యాధి నయమయ్యే సూచన లు ఎక్కువగా ఉన్నాయని ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి. వ్యాధి లక్షణాలు బయటపడి, పడకముందే అధికారులు ప్రత్యేక చొరవ చూపి బాధితులను ఆసుపత్రికి తరలించడంతో పరిస్థితి అదుపులో ఉంది. ముఖ్యంగా బాధితుల్లో దాదాపు అందరూ ఢిల్లీ మత సభలో పాల్గొని వచ్చిన వారు కావడం, వారిని సకాలంలో గుర్తించి ఆసుపత్రికి చేర్చడంలో యంత్రాంగం కృషి అభినందనీయం.


మధ్య వయస్కులు కావడమే..

కరోనా వైరస్‌ తొలుత ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. నెమ్ముతో మొదలై క్రమంగా శరీరంలోని ఇతర ముఖ్య భాగాలపై దాడి చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తి ఉన్న వారికి దీని వల్ల ప్రాణహాని తక్కువ. చికిత్సకు వాడే మందులకు శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి తోడై కోవిడ్‌-19ను అడ్డుకుంటుంది. 15 రోజుల్లో కోలుకునేలా చేస్తుంది. వృద్ధులకు, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడే వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి వారికి కరోనా సోకితే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే అదృష్టవశాత్తు జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన 32 పాజిటివ్‌ కేసుల్లో ఇద్దరు మాత్రమే 50 ఏళ్లకు పైబడి వారు. మిగిలిన వారందరూ 30 నుంచి 45 ఏళ్ల లోపువారే. వీరందరిలో ఒకరిద్దరు మినహా అందరూ స్వతహాగా ఆరోగ్యవంతులని సమా చారం. పైగా కరోనా కేసులను వైద్య ఆరోగ్య శాఖ ఒక సవాల్‌గా తీసుకుని ప్రత్యేక శ్రద్ధతో చికిత్స చేస్తోంది. దీంతో అందరూ కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


అందరికీ మార్గదర్శకం...

వ్యాధి లక్షణాలు బయటపడిన వెంటనే చికిత్స చేయించుకుంటే తప్పక నయం అవుతుందనడానికి తొలి పాజిటివ్‌ కేసే ఉదాహరణ. విదేశాల నుంచి వచ్చిన యువకుడు తనకు పొడి దగ్గు వస్తున్నట్లు గుర్తించి స్వచ్ఛందంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి డాక్టర్లను సంప్రదించాడు. ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొంది 15 రోజుల్లో ఆరోగ్యవంతుడిగా ఇంటికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్‌ వచ్చినంత మాత్రాన ఏదో జరిగిపోతుందనే  అపోహను ప్రజలు విడనాడాలని, స్వచ్ఛందంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు, ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.   

Updated Date - 2020-04-05T09:46:44+05:30 IST