చంద్రబాబుకు కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-01-19T07:40:28+05:30 IST

చంద్రబాబుకు కరోనా పాజిటివ్‌

చంద్రబాబుకు కరోనా పాజిటివ్‌

అమరావతి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, పాజిటివ్‌ రావడంతో హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు ఆయన మంగళవారం ట్వీట్‌ చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం రాత్రి ఆయన హైదరాబాద్‌ నుంచి ఇక్కడకు చేరుకొన్నారు. స్వల్పంగా జ్వరం ఉండటంతో హైదరాబాద్‌లోనే సోమవారం పరీక్ష చేయించుకొన్నారు. ఆయన ఇక్కడకు వచ్చిన తర్వాత ఫలితం అందింది. దీంతో ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనకుండా నివాసంలో క్వారంటైన్‌ అయ్యారు. సంక్రాంతి పండుగకు ముందు మాచర్ల నియోజకవర్గంలో పార్టీ కార్యకర్త తోట చందయ్య హత్య జరగడంతో అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొని పాడె మోశారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు హాజరయ్యాయి. అక్కడ ఆయనకు కరోనా సోకి ఉండి ఉండవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. చంద్రబాబుకు కరోనా సోకడం ఇదే ప్రథమం. ఆయన కుమారుడు లోకేశ్‌కు పాజిటివ్‌ నిర్ధారణైన విషయం తెలిసిందే.  


చంద్రబాబు త్వరగా కోలుకోవాలి: గవర్నర్‌, సీఎం 

టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కరోనా బారినపడటం పట్ల గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.  కొవిడ్‌ బారి నుంచి చంద్రబాబు త్వరగా కోలుకోవాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, చంద్రబాబు కొవిడ్‌ నుంచి త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్‌ చేశారు. 


కొవిడ్‌ టెస్టులు పెంచాలి: పవన్‌

టీడీపీ అధినేత చంద్రబాబు త్వరగా కోలుకుని ప్రజ ల కోసం ఎప్పటిలానే పని చేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు. కొవిడ్‌ పరీక్ష కేంద్రాలను పెంచాలన్నారు. ఏపీలో వైరస్‌ ఉధృతి తగ్గేవరకూ పాఠశాలల్లో తరగతులను వాయిదా వేయాలని కోరారు.  

Updated Date - 2022-01-19T07:40:28+05:30 IST