స్వాబ్‌ రణం

ABN , First Publish Date - 2020-07-08T11:00:10+05:30 IST

కరోనా పాజిటివ్‌ ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులు స్వాబ్‌ నమూనాల సేకరణ ఒక రణంగా మారుతోంది. రోజుల తరబడి బాధితులు పరీక్షల కోసం ..

స్వాబ్‌ రణం

 మూడు రోజులుగా నిరీక్షణ

మధ్యాహ్నం 4 గంటలకు భోజనం

 ఇబ్బందులు పడుతున్న మహిళలు, చిన్నారులు


(కడప-ఆంధ్రజ్యోతి): కరోనా పాజిటివ్‌ ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులు స్వాబ్‌ నమూనాల సేకరణ ఒక రణంగా మారుతోంది. రోజుల తరబడి బాధితులు పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు. ఒకటి, రెండు రోజులు కాదు.. మూడు రోజులుగా నిరీక్షిస్తున్నారు. నమూనాలు సేకరించేదెప్పుడో అంటూ ఎదురుచూస్తున్నారు. క్వారంటైన్‌ సెంటరులో కనీస వసతులు లేకపోవడం, వేళ కాని వేళ భోజనం అందిస్తుండడంతో బాఽధితులు ఆకలితో అలమటిస్తున్నారు. కనీసం స్వాబ్‌ నమూనాల సేకరణ దగ్గర భౌతికదూరం పాటించకుండా జనం గుంపులుగా ఉంటుండడంతో ఎక్కడ కరోనా వ్యాపిస్తుందోనన్న భయం వెంటాడుతోందని బాధితులు వాపోతున్నారు. కరోనా పాజిటివ్‌ ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులు, విదేశాల నుంచి వచ్చిన వారి నమూనాల సేకరణ కోసం ఫాతిమా, కేఎ్‌సఆర్‌ఎం, మరికొన్ని చోట్ల క్వారంటైన్‌లో ఉంచారు. రైల్వేకోడూరు, బద్వేలు, దువ్వూరు, మైదుకూరు నుంచి కరోనా పాజిటివ్‌ ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులను సోమవారం ప్రత్యేక బస్సుల్లో ఫాతిమా కోవిడ్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే వారిని పట్టించుకునేవారే లేరు. రాత్రి 10 గంటలైనా భోజనం అందని పరిస్థితి. మంగళవారం కొందరికి నమూనాలు సేకరించినా భౌతికదూరం పాటించకుండా గుంపులు గుంపులుగా గుమికూడుతున్నారు. కనీసం శానిటైజరు లేకపోవడం, తాగేందుకు నీరిచ్చే పరిస్థితి కూడా లేదని బాధితులు ఫోన్‌లో వాపోయారు.


రెండు రోజులుగా ఇక్కడే ఉంటున్నా నమూనాలు తీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం అందించాల్సిన భోజనం సాయంత్రం 4 గంటలకు అందించారని ఆకలికి తట్టుకోలేక పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు నకనకలాడారు. ఇక్కడే నిరీక్షిస్తున్నాం. నమూనాలు తీసుకోండయ్యా అని అడిగితే మీ ఇష్టం ఉన్నచోట చెప్పుకోండంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. స్వాబ్‌ నమూనాల సేకరణ అంటేనే రణంగా మారిందని అంటున్నారు.


పాములతో భయం భయంగా..

గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిన వారిని కేఎ్‌సఆర్‌ఎం కళాశాలలో క్వారంటైన్‌ చేశారు. రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి ప్రాంతాలకు చెందిన మహిళలు అక్కడే ఉంటున్నారు. ఇక్కడికి వచ్చి మూడు రోజులైనా స్వాబ్‌ నమూనాలు తీయలేదు. చీకటి పడిందంటే చాలు పాములు, తేళ్లు, మండ్రగబ్బలు వస్తున్నాయి. రాత్రి పూట కంటికి కునుకు లేకుండా జాగారం చేస్తున్నామని, వెంటనే మాకు స్వాబ్‌ నమూనాలు తీయాలంటూ పలువురు మహిళలు ‘ఆంధ్రజ్యోతి’తో ఫోన్‌లో వాపోయారు. విదేశాల్లో స్వాబ్‌ టెస్టులు చేయించుకుని ఆరోగ్యంగానే ఇక్కడకు వచ్చామని, ఇక్కడ ఉన్న అధ్వాన్న మరుగుదొడ్లు, పరిసరాల అపరిశుభ్రత వల్ల అనారోగ్యానికి గురవుతామేమోనని భయమేస్తోందని వాపోతున్నారు. దీంతో పాటు పగలే పాములు తిరుగుతుండడంతో క్షణం క్షణం భయం భయంగా గడుపుతున్నామన్నారు. కనీసం పట్టించుకునేవారే లేరని, త్వరగా స్వాబ్‌ టెస్టులు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-07-08T11:00:10+05:30 IST