వైసీపీ ఎమ్మెల్యే నివాసం పక్కనే ఉంటున్న డాక్టర్‌కు కరోనా

ABN , First Publish Date - 2020-06-04T21:17:15+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఉధృతి ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా కొనసాగుతూనే ఉంది.

వైసీపీ ఎమ్మెల్యే నివాసం పక్కనే ఉంటున్న డాక్టర్‌కు కరోనా

అనంతపురం : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఉధృతి ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయే తప్ప కంట్రోల్ కావట్లేదు. ముఖ్యంగా అనంతపురం జిల్లా విషయానికొస్తే జిల్లాలో కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కియా పరిశ్రమలో బాడీ షాప్‌లో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. తాజాగా ఓ మహిళా డాక్టర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. వివరాల్లోకెళితే.. నగర ఎమ్మెల్యే నివాసం పక్కనే ఉంటున్న మహిళా డాక్టర్‌కు కరోనా పాజిటివ్ అని గురువారం నాడు అధికారులు నిర్ధారించారు. ఈ క్రమంలో డాక్టర్‌తో పాటు కుటుంబ సభ్యులను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.


ఇదిలా ఉంటే.. నగరంలోని ఐసీడీఎస్ ఉద్యోగి కూడా పాజిటివ్ అని తేలింది. ఈ క్రమంలో పాజిటివ్ ఐసీడీఎస్ కార్యాలయాన్ని వారం రోజులు పాటు అధికారులు మూసివేశారు. మరోవైపు..కార్యాలయ ఆవరణలో కార్పొరేషన్ సిబ్బంది బ్లీచింగ్, శానిటైజేషన్ చేశారు. కాగా.. కియా పరిశ్రమలో పనిచేసే ఉద్యోగికి పాజిటివ్ అని తేలడంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు భయంతో వణికిపోతున్నారు. ఇటీవలే కియా ప్రతినిధులతో జిల్లా మంత్రి శంకరనారాయణ భేటీ అయ్యారని సమాచారం. అప్రమత్తమైన కియా ప్రతినిధులు ప్రతి ఒక్కరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించిన అనంతరమే విధుల్లోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. మొత్తానికి చూస్తే ఇవాళ ఒక్కరోజే అనంత జిల్లాలో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-06-04T21:17:15+05:30 IST