ఈ జిల్లా అంతా కరోనా మయమేనా?

ABN , First Publish Date - 2020-04-02T22:56:06+05:30 IST

జిల్లాలో బుధవారం వరకూ కూడా ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. అనుమానితుల సంఖ్య తక్కువగానే ఉంది. కరోనా మహమ్మారి జిల్లాకు ..

ఈ జిల్లా అంతా కరోనా మయమేనా?

పశ్చిమగోదావరి:  జిల్లాలో బుధవారం వరకూ కూడా ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. అనుమానితుల సంఖ్య తక్కువగానే ఉంది. కరోనా మహమ్మారి జిల్లాకు రావడం చాలా తక్కువగానే ఉంటుందని అంతా భావించారు. కానీ ఒక్కసారిగా అందరి అంచనాలు తారుమారయ్యాయి. ఒక్క రోజులోనే 15 పాజిటివ్ కేసులు రావడంతో అన్ని వర్గాలను ఉలిక్కి పడేలా చేశాయి. జిల్లాలో మొదట్లో 23 అనుమానితులను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి పరీక్షల నిమిత్తం తరలించి వారందర్నీ ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అలా ఐసోలేషన్లో ఉన్న వారిలో వివిధ దేశాల  నుంచి వారితో పాటు స్థానికులు కూడా ఉన్నారు. అయితే వారందరికి నెగిటివ్ రావడంతో జిల్లాలకు కరోనా రావడం కష్టమేనని అంతా భావించారు. కానీ గత నెల 29వ తేదీన ఢిల్లీలోని మత ప్రార్థనలకు హాజరైన 30 మందిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసోలేషన్‌కు తరలించి వైద్య పరీక్షలు చేశారు. స్వాబ్ నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. వీరిలో ఎవరికి కరోనా లక్షణాలు లేకపోవడంతో రిపోర్టులు కూడా నెగిటివ్ గానే ఉంటాయని అంతా భావించారు. కానీ అందుకు విరుద్ధంగా ఏకంగా 15 మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. మిగిలిన వారిలో 13 మందికి నెగిటివ్ రాగా ఇంకా ఇద్దరి రిపోర్టులు రావాల్సి ఉంది. కాగా  పాజిటివ్ వచ్చిన వారి రిపోర్టులు బుధవారం రాత్రి రావడంతో అధికారులు ఆ రిపోర్టులు చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు.

Updated Date - 2020-04-02T22:56:06+05:30 IST