ఆకులతో కట్టడి చేద్దాం

ABN , First Publish Date - 2020-07-29T21:29:43+05:30 IST

కరోనా సోకకుండా జాగ్రత్తపడేందుకు మందులే అవసరం లేదు. చిన్న చిన్న చిట్కాలతో కరోనాను కట్టడి చేయొచ్చని అంటున్నారు

ఆకులతో కట్టడి చేద్దాం

ఆంధ్రజ్యోతి(29-07-2020)

కరోనా సోకకుండా జాగ్రత్తపడేందుకు మందులే అవసరం లేదు.  చిన్న చిన్న చిట్కాలతో కరోనాను కట్టడి చేయొచ్చని అంటున్నారు షౌష్టికాహార నిపుణులు. మన తోటలోని ఆకులు.. నిత్యం వాడే ఆకుకూరలతో ఇమ్యూనిటీని పెంచుకోవచ్చని సలహా ఇస్తున్నారు..


వేప ఆకులతో..

కొన్ని వేప ఆకులను రోటిలో దంచాలి. ఆ రుబ్బును కొద్దిపాటి నేతిలో దోరగా వేయించాలి. చిటికెటు ఉప్పునూ అందులో చేర్చాలి. వేడి వేడి అన్నంలో కలుపుకుని తినాలి. అయితే ఓ షరతు... భోజనంలో అన్నిటి కన్నా ముందు అంటే మొదటి ముద్ద ఇదే కావాలి. వేప యాంటీ బాక్టీరియల్‌ అలాగే జీర్ణ వ్యవస్థని శుభ్రపరుస్తుంది. పిల్లల చేత కూడా ఇలా తినపించడం మంచిది. వాళ్లకి రుచి సహించకపోతే వేప తీపి ఉండలు చేసి పెట్టాలి. వేప ఆకులు, బెల్లం, పసుపు కలిపి దంచి ముద్దలు చేస్తే పిల్లలకి కచ్చితంగా నచ్చుతుంది. అనాదిగా బెంగాలీయులు ఈ పద్ధతిని పాటిస్తున్నారు.


కొత్తిమీరతో

మన దేశంలో కొత్తిమీర వాడకం ఎక్కువే. కొత్తిమీర కూడా వండర్‌ హెర్బ్‌. దీనివల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలున్నాయి. కాకపోతే ఎక్కువగా కొత్తిమీరను  ఉడికించకూడదు. ఇలా చేస్తే అందులోని పోషక విలువలు ఆవిరవుతాయి. వండిన పదార్థంపైనో లేక వడ్డించేప్పుడో కొత్తిమీరను చల్లాలి.


మెంతి ఆకులు

మెంతుల్ని మనం వంటల్లో ఎక్కువగానే వాడుతుంటాం. మెంతి ఆకులు కూడా ఎంతో ఉపయోగకరమైనవి. ఇందులో విటమిన్లు ఎక్కువ. మధుమేహాన్ని నియంత్రించడానికి దోహదపడతాయి. పెద్ద మెంతి, చిన్న మెంతి ఏదైనా పోషక గనులే. చపాతి పిండిలో మెంతి ఆకులను కలిపి చేయడం అలవాటు చేసుకుంటే మంచిది. మెంతి ఆరోగ్యకరం.  


తీసిపారేయకండి

కరివేపాకును చూస్తేనే కొందరికి పడదు. కానీ కరివేపాకు లాభాలెన్నో. మన పూర్వీకులకు ఈ విషయం తెలుసు. అందుకే ప్రతి తెలుగు ఇంట్లో కరివేపాకు మొక్కలు పెంచడం సర్వసాధారణం. మనం వండుకునే ప్రతి వంటకంలోనూ కరివేపాకులు కచ్చితంగా వేస్తుంటాం. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. ఈ ఆకు మలినాలను తొలిగిస్తుంది. అంతేకాదు కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇంకా చెప్పాలంటే రోజూ ఉదయం కొన్ని కరివేపాకు ఆకుల్ని నమలడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. వేపంత చేదుగా ఈ ఆకులు ఉండవు. కాబట్టి తినొచ్చు. నోటి దుర్వాసన కూడా పోతుంది. 


మునగాకులు

మునగ చెట్టును మిరాకిల్‌ ట్రీగా పేర్కొంటారు. అందుకేనేమో సంప్రదాయ వంటకాల్లో మునక్కాయల వాడకం ఎప్పటి నుంచో ఉంది. మునగాకుల పోషక విలువల గురించి ఎంత చెప్పినా తక్కువే. మునగాకుల పొడిని భోజనంలో భాగం చేసుకోవడం మంచిది. మునగాకులో, కాయల్లో మన శరీరానికి అవసరమైన మొత్తం ఎనిమిది అమైనో ఆసిడ్లు ఉన్నాయి. దీన్నుంచి పూర్తి ప్రొటీన్లూ అందుతాయి. తోటకూర, పాలకూరల్లా వీటిని వండుకోవడం అలవాటు చేసుకుంటే అనారోగ్యం దరిచేరదు.

Updated Date - 2020-07-29T21:29:43+05:30 IST