‘పాజిటివ్‌’ పల్లెలు

ABN , First Publish Date - 2021-05-16T06:23:41+05:30 IST

పల్లెల్లో కరోనా విస్తరిస్తోంది. పచ్చని గ్రామాలు మహమ్మారి బారిన పడుతున్నాయి. పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ భారీగా నమోదవుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో సైతం కొవిడ్‌ ప్రళయం సృష్టిస్తోంది. శనివారం నిర్ధారణ అయిన పాజిటివ్‌ కేసులే ఇందుకు నిదర్శనం.

‘పాజిటివ్‌’ పల్లెలు

గ్రామాల్లో విస్తరిస్తున్న కరోనా 

 చాపకింద నీరులా విజృంభణ

 టెస్టుల్లేవ్‌.. కిట్లు లేవ్‌

 ప్రైవేటు మెడికల్‌ షాపుల్లో మందుల కొనుగోలు

 ఇంటి వద్దే సొంత వైద్యం

 ఆర్‌ఎంపీలపైనే ఆధారం

 ఇరుకు ఇళ్లతో అవస్థలు

 వెలి భయంతో జనంలోకి వస్తున్న కొవిడ్‌ బాధితులు 

(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)

 పల్లెల్లో కరోనా విస్తరిస్తోంది. పచ్చని గ్రామాలు మహమ్మారి బారిన పడుతున్నాయి. పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ భారీగా నమోదవుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో సైతం కొవిడ్‌ ప్రళయం సృష్టిస్తోంది. శనివారం నిర్ధారణ అయిన పాజిటివ్‌ కేసులే ఇందుకు నిదర్శనం. ములుగు జిల్లా కన్నాయిగూడెం పీహెచ్‌సీలో 28 కరోనా టెస్టులు చేస్తే 16 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వాజేడు మండలంలో పేరూరు పీహెచ్‌సీలో 36 కరోనా టెస్టులు చేయగా 13 కేసులు, వెంకటాపూర్‌ పీహెచ్‌సీలో 43 కరోనా టెస్టులు చేయగా 20  కేసులు నమోదయ్యాయి. భూపాలపల్లి జిల్లా టెకుమట్ల మండలం వెలిశాల పీహెచ్‌సీలో 36 కరోనా టెస్టులు చేయగా 19 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

గణపురం పీహెచ్‌సీలో 50 టెస్టులు చేస్తే 27  కేసులు నమోదయ్యాయి. ఇలా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో చేసిన టెస్టుల్లో 45 నుంచి 60 శాతం వరకు పాజిటివ్‌ కేసులు తేలుతున్నాయి. ఇదిలా ఉండగా కరోనా టెస్టులు చేయించుకోని వారు వందల సంఖ్యలో ఉన్నారు. పీహెచ్‌సీల్లో పరిమితంగా టెస్టులు చేస్తుం డటం తో చాలా మంది లక్షణాలు కనిపిస్తే మెడికల్‌ షాపుల్లో మందులు తెచ్చుకొని వాడుతున్నారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన వారిలో 90 శాతం మంది పల్లెలకు చెందిన వారే. వీరిలో అత్యధికంగా 45 ఏళ్లు లోపు వారే ఉన్నారు.  

సొంత వైద్యానికే  మొగ్గు..

కరోనాపై పల్లె ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కనిపించటం లేదు. వ్యవసాయం, కూలీ పనుల్లో నిమగ్నమయ్యే గ్రామీణులను ఈ మహమ్మారి ఆవరిస్తోంది.  జ్వరం, ఒళ్లు నొప్పులు, జలుబు, దగ్గు లాంటి  లక్షణాలు కనిపిస్తే చాలామంది ఇంట్లోనే సొంత వైద్యం చేసుకుంటున్నారు. చిన్న చిన్న చిట్కాలకు తగ్గకపోతే నేరుగా మెడికల్‌ షాపులకు వెళ్లి కరోనా కిట్లు తీసుకోని వాడుతున్నారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో కరోనా టెస్టులపై ప్రభుత్వం పరిమితి విధించింది. రోజుకు 30 నుంచి 50 వరకు మాత్రమే పరీక్షలు చేస్తోంది. తమకు కరోనా లక్షణాలు ఉన్నాయని పీహెచ్‌సీలో వైద్య సిబ్బందికి  చెప్పినప్పటికీ కనీసం  మందుల కిట్టు కూడా ఇవ్వటం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో చాలా మంది టెస్టుల కంటే ప్రైవేటుగా మెడికల్‌ షాపుల్లో మందులు కొనుగోలు చేసి వాడకం పైనే ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.  జ్వరం, దగ్గుకు, జలుబుకు ఇలా ఏ లక్షణం ఉన్నా మాత్రలు మింగుతున్నారు. సహజంగా పల్లె జనానికి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే అవకాశం ఉంది. దీంతో చాలా మంది తొందరగానే కొలుకుంటున్నారు. వైద్యుల సలహాలు, సూచనలు లేకుండానే పల్లె జనం కరోనాతో కుస్తీ పడుతున్నారు. మరికొందరు సరైన వైద్యం అందక మృతి చెందుతున్నారు.

ఇరుకు ఇళ్లతో ఇరకాటం

 పల్లెల్లో ఒక ఇంట్లో ఒకరికి కరోనా పాజిటివ్‌ వస్తే.. ఇక ఇంట్లో అందరినీ వైరస్‌ పిండేస్తోంది. ఒకరి తర్వాత ఇంకొకరు మహమ్మారితో పోరాడాల్సి వస్తోంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఇప్పటి వరకు 80 శాతం మందికి పైగా హోం ఐసోలేషన్‌లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. టెస్టులు లేకున్నా పాజిటివ్‌ లక్షణాలు ఉన్నవారందరూ  కూడా ఇంట్లోనే ఉంటున్నారు. కరోనా వచ్చిన వ్యక్తి ప్రత్యేక గదిలో ఉండాల్సి ఉంటుంది. అయితే గ్రామాల్లో చాలా వరకు ఇరుకుగా ఇళ్లు ఉంటాయి. ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండే పల్లెలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో మిగతా కుటుంబ సభ్యులు కూడా కలిసే ఉండాల్సి వస్తోంది. పాజిటివ్‌ అని తేలినప్పటికీ ప్రత్యేకంగా గది లేకపోవటంతో అందరితో కలిసే ఉంటున్నారు. బాత్‌రూం, టాయిలేట్‌ లాంటివి వేర్వేరుగా లేకపోవటంతో ఉమ్మడిగా వాడుకుంటున్నారు. దీంతో ఒకరి నుంచి ఇంట్లో అందరికీ కరోనా వ్యాప్తి చెందుతోంది. వృద్ధులు,  పిల్లలు ఉన్న కుటుంబాల పరిస్థితి అయితే వర్ణనాతీతం. కొందరైతే ఆరు బయటనో, ఊరు చివర వ్యవసాయ బావుల వద్దనో ఉండాల్సి వస్తోంది. వీరికి ప్రత్యేకంగా ఆహారం అందించటం కష్టంగా మారింది. ఇరుకు ఇళ్లతో కరోనా బాధితుల బాధలు అన్ని ఇన్నీ కావు.

ఆర్‌ఎంపీల వైద్యంతో అవస్థలు

పీహెచ్‌సీల్లో ఇచ్చిన మందులో తాము సొంతంగా కొనుగోలు చేసిన మందులో వాడుతూ  కరోనా నుంచి బయట పడేందుకు గ్రామీణ ప్రజలు ప్రయత్నిస్తున్నారు.

ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే గ్రామాల్లో ఉండే ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు.  తెలిసీ తెలియని వైద్యం అందిస్తూ ఆర్‌ఎంపీలు కొందరు ప్రాణాల మీదకు తెస్తున్నారు. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో ఓ ఆర్‌ఎంపీ కరోనా వైద్యం పేరుతో ట్రీట్‌మెంట్‌ చేయటంతో ఇద్దరు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వారిని వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందింస్తున్నారు. అయితే వరంగల్‌ ఎంజీఎం, ములుగు ఏరియా ఆస్పత్రులకు వెళ్లేందుకు కూడా పల్లెజనం భయపడి పోతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరాలంటే కరోనాకు లక్షల్లో ఖర్చు అవుతోంది. అయినా బతుకుతారనే గ్యారంటీ లేదంటున్నారు. దీంతో గత్యంతరం లేక స్థానికంగా వైద్యం కోసం ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తూ అవస్థలు పడుతున్నారు. అయితే కొందరు మాత్రం ఆర్‌ఎంపీల సలహాలు, సూచనలతో కోలుకుంటున్నారు. చాలా గ్రామాల్లో కరోనా సమయంలో మానవతా దృక్పథంతో సేవలు చేస్తున్న ఆర్‌ఎంపీలు కూడా ఉన్నారు. 

పాజిటివ్‌ను దాచి జనంలోకి..

 పల్లెల్లో కరోనాను దాచిపెడుతున్నారు. ఎవరికైనా పాజిటివ్‌ వస్తే చాలా మంది హోం ఐసోలేషన్‌లో ఉండటం లేదు. బాజాప్తాగా గ్రామ కూడళ్ల వద్ద తచ్చాడుతున్నారు. తమకు పాజిటివ్‌ అని తెలిస్తే ఇరుగుపొరుగు వారు వెలి వేస్తారనే ఉద్దేశంతో వ్యాధిని దాచిపెడుతున్నారు. 17 రోజులు క్వారంటైన్‌ ఉండాల్సి వస్తుందని, దీంతో వ్యవసాయ పనులు చేసుకోలేకపోతామని భయపడుతున్నారు. పక్క వారే ఇంటి ముఖం చూడరని, కనీసం కిరాణం, వాటర్‌ క్యాన్‌లు, పాలు, కూరగాయలు కూడా ఎవరూ ఇవ్వరని భావిస్తూ తమకు పాజిటివ్‌ లేదన్నట్టు వ్యవహరిస్తూ మరికొంత మందికి అంటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కరోనా టెస్టులు చేసి పాజిటివ్‌ నిర్ధారణ కాకపోవటంతో ఏఎన్‌ఏంలు, ఆశా వర్కర్లు కూడా వీరి ఇంటివైపు రావటం లేదని తెలుస్తోంది. దీంతో పాజిటివ్‌ను దాచి జనంలోకి తిరుగుతున్నారు. దీంతోనే పల్లెల్లో కరోనా వ్యాప్తి పెరిగిపోతోంది. ప్రతి మండలంలో నాలుగైదు గ్రామాల్లో కరోనాతో కంటైన్మెంట్‌ జోన్లుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పల్లెల్లో కరోనా నివారణకు ప్రభుత్వం చొరవ చూపాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రతి ఊరిలోని పాఠశాల లేదా అంగన్‌వాడీ కేంద్రాల్ల్లో ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, వైద్యంతో పాటు ఆహారం అందించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2021-05-16T06:23:41+05:30 IST