కరోనా రికార్డు

ABN , First Publish Date - 2020-08-06T08:37:26+05:30 IST

రాష్ట్రంలో కరోనా విజృంభణ నానాటికీ పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో కొత్త కేసులు తగ్గుతుంటే ఏపీలో మాత్రం కేసులతో పాటు మరణాలు కూడా పెరిగిపోతున్నాయి.

కరోనా రికార్డు

  • 77 మంది మృతి
  • 10,128 కేసులు
  • ఒక్క రోజులో ఇన్ని మరణాలు ఇదే తొలిసారి 
  • మొత్తం పాజిటివ్‌లు 1,86,461 
  • 1,681కి పెరిగిన మరణాలు 
  • లక్ష మార్కు దాటిన రికవరీలు 
  • మరణాల్లో ఇప్పటికీ దాగుడుమూతలు 
  • అనంతలో 10మంది బలి బులెటిన్‌లో మాత్రం ఇద్దరే 

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) 

రాష్ట్రంలో కరోనా విజృంభణ నానాటికీ పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో కొత్త కేసులు తగ్గుతుంటే ఏపీలో మాత్రం కేసులతో పాటు మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. అత్యధిక కేసుల జాబితాలో ముందున్న మహారాష్ట్ర, తమిళనాడుల్లో కూడా ప్రస్తుతం రోజుకు పదివేల కేసులు బయటపడటం లేదు. రాష్ట్రంలో మాత్రం బుధవారం ఒక్కరోజే 10,128 మంది కరోనా బారిన పడగా, మరణాలు సైతం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో ఏకంగా 77మంది కరోనాతో మృతిచెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌లు 1,86,461కు చేరాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరో 8,729మంది వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు.


ఇప్పటి వరకూ 1,04,354 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. బుధవారం గుంటూరులో 16మంది, విశాఖలో 12మంది, శ్రీకాకుళంలో 10మంది, చిత్తూరులో 8మంది, తూర్పుగోదావరి జిల్లాలో ఏడుగురు, కృష్ణాజిల్లా లో ఐదుగురు, నెల్లూరులో నలుగురు, కర్నూలు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గు రు చొప్పున, అనంత, కడప, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 1,681కి పెరిగాయి. 


ఆరోగ్యంగానే ఉన్నా: మంత్రి బాలినేని

‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హైదరాబాద్‌లోని అపోలో వైద్యశాలలో చికిత్స పొందుతున్నాను. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. త్వరలో ఇంటికి వస్తాను’ అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన పార్టీ కార్యకర్తలు, అభిమానులకు సందేశం పంపారు. ఐదు రోజులుగా చిన్నపాటి జ్వరం రావడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని తన స్వగృహంలోనే ఐసొలేషన్‌లో ఉన్నానన్నారు. మంగళవారం కొవిడ్‌ పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్‌ వచ్చిందన్నారు. కాగా, బాలినేని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అపోలో ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. 


అనంత మరణాల్లో దాగుడుమూతలు 

కరోనా మరణాల సంఖ్య వెల్లడిలో ఆరోగ్యశాఖ తీరు మారడం లేదు. క్షేత్రస్థాయిలో లెక్కలకు, ఆరోగ్యశాఖ బులెటిన్‌లో చూపిస్తున్న లెక్కలకు పొంతన ఉండటం లేదు. బుధవారం అనంతపురం జిల్లాలో కలెక్టర్‌ విడుదల చేసిన బులెటిన్‌లో 10మంది మృతి చెందినట్లు చూపించారు. రాష్ట్రస్థాయి బులెటిన్‌లో మాత్రం ఇద్దరే మరణించినట్లు పేర్కొన్నారు. ఈ ఒక్క జిల్లాల్లోనే 8మరణాలు దాచేసిన ఆరోగ్యశాఖ అధికారులు అన్ని జిల్లాల్లో కలిపి ఇంకా ఎన్ని దాచి ఉంచుతున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. 


 బతికుండగానే చంపేశారు!    

కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చేరిన మహిళను విశాఖ విమ్స్‌ సిబ్బంది బతికుండగానే చంపేశారు. ఆమె కరోనాతో మృతి చెందిందని ప్రకటించారు. తీరా కుటుంబ సభ్యులు ఫోన్‌చేసి మాట్లాడగా.. ఆమె తాను బతికే ఉన్నానని పేర్కొంది. శ్రీకాకుళం జిల్లా పాలసింగి గ్రామానికి చెందిన గిరిజన మహిళ మల్లిపురం పార్వతి(54) కిడ్నీసమస్యతో పదిరోజుల క్రితం విమ్స్‌లో చేరారు. ఆమె కరోనాతో 1న మృతిచెందిందని, మృతదేహం కోసం కుటుంబసభ్యులెవరూ రాలేదని.. ఆధార్‌ నంబరుతో సహా ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆందోళనకు గురైన కుమారులు ఆమెకు ఫోన్‌ చే యగా తాను బతికే ఉన్నానని చెప్పారు. ‘మా తల్లి బతికుండగానే మృతి చెందిం దని ప్రకటించడంతో ఆందోళన తో ఆమెకు ఫోన్‌ చేశాం. ఆమె క్షేమంగా ఉందని తెలిసి ఊపిరి పీల్చుకున్నాం. ఈ విషయంలో ఆస్పత్రి వర్గాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి’ అని పార్వతి కుమారులు యుగంధర్‌, అప్పలస్వామి అన్నారు.


కుమారుడికి పాజిటివ్‌.. తల్లికి గుండెపోటు

కొయ్యలగూడెం: పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలోని ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగికి కరోనా సోకింది. అప్పటికే అస్వస్థతతో ఉన్న తల్లికి, తనకు హైదరాబాద్‌లో చికిత్స చేయించుకుందామని బయలుదేరారు. హైదరాబాద్‌ ఎందుకు వెళ్తున్నామని ఆమె ప్రశ్నించగా అసలు విషయం చెప్పారు. దీంతో షాక్‌కు గురైన ఆమె గుండెపోటుతో బుధవారం తెల్లవారుజామున మృతిచెందింది. 

Updated Date - 2020-08-06T08:37:26+05:30 IST