ఒక్కరి నుంచి 8 మందికి

ABN , First Publish Date - 2020-05-23T08:27:16+05:30 IST

రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. శుక్రవారం నమోదైన 62 కేసులతో కలిపి మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 2,514కి పెరిగింది.

ఒక్కరి నుంచి 8 మందికి

కరోనాతో మృతిచెందిన వ్యక్తి ద్వారా వ్యాప్తి ..

‘తూర్పు’ను కుదిపేస్తున్న వైరస్‌ 

విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి నిర్ధారణ 

రాష్ట్రంలో కొత్తగా 62 కేసులు నమోదు 

మొత్తం 2514కు చేరిన పాజిటివ్‌లు 

కృష్ణాలో మరొకరి మృతి 


(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌):రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. శుక్రవారం నమోదైన 62 కేసులతో కలిపి మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 2,514కి పెరిగింది. కృష్ణా జిల్లాకు చెందిన ఒకరు ఈ వైరస్‌ బారినపడి మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 55కి చేరాయి. మరోవైపు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 51మంది నుంచి డిశ్చార్జి అయ్యారు. వీటితో కలిపి కొవిడ్‌-19 నుంచి బయటపడ్డ వారి సంఖ్య 1,713కు చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం 11 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో 8 మందికి గురువారం కొవిడ్‌-19తో మృతిచెందిన వ్యక్తి(53) ద్వారా వైరస్‌ వ్యాపించినట్టు గుర్తించారు. వీరిలో ఆరుగురు పెదపూడి మండలానికి చెందినవారు కాగా, మరో ఇద్దరిది బిక్కవోలు మండలం. వీరిలో ముగ్గురు మృతుడి ఇంటిపేరుతో ఉన్నారు. మరో ఇద్దరు ఆయనకు మేనకోడలు వరుస అవుతారు. వీరిని చూసేందుకు సదరు వ్యక్తి ఇటీవల అక్కడకు వెళ్లిన సమయంలో వ్యాధి విస్తరణ జరిగిందని భావిస్తున్నారు. బొమ్మూరు క్వారంటైన్‌లో ఉంటున్న ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో ఇద్దరు మూడురోజుల కిందట విదేశాల నుంచి విశాఖ విమానాశ్రయంలో దిగి వచ్చినవారు. నెల్లూరు జిల్లాలో మరో 8 కేసులు నమోదయ్యాయి. ఇందులో నెల్లూరు కోటమిట్ట ప్రాంతానికి చెందిన ఐదుగురికి ఢిల్లీ లింకుల ద్వారా వ్యాధి సోకిందని భావిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మరో 4 కేసులు గుర్తించారు. దీంతో జిల్లాలో కోయంబేడు లింకులతో వెలుగు చూసిన కేసుల సంఖ్య 103కు చేరుకుంది.


కర్నూలులో 501మంది డిశ్చార్జ్‌ 

కర్నూలు జిల్లాలో శుక్రవారం 16మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో జిల్లాలో డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 501కి చేరింది. తాజాగా కర్నూలు జిల్లాలో మరో 7 కేసులు నమోదయ్యాయి. విజయవాడ నగరంలో శుక్రవారం మరో 16మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు 35 కరోనా కేసులు నమోదయ్యాయని జిల్లా కొవిడ్‌ అధికారి, ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.జగన్నాథం తెలిపారు. చెన్నై నుంచి వచ్చిన మత్స్యకారులను ఇటీవల పరీక్షించగా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయని చెప్పారు. 


కువైత్‌ నుంచి చిత్తూరుకు తొలి విమానం

తిరుపతి: వందే భారత్‌ మిషన్‌లో భాగంగా గురువారం కువైత్‌ నుంచి చిత్తూరు జిల్లాకు తొలి విమానం వచ్చింది. లాక్‌డౌన్‌ వల్ల కువైత్‌లో నిలిచిపోయిన 149 మంది ప్రవాసాంధ్రులు తిరుపతికి చేరుకున్నారు. వీరిలో చిత్తూరు జిల్లాకు చెందిన ఏడుగురితోపాటు చెన్నైకి చెందిన ఒకరికి, అనంతపురం వాసులు ఇద్దరికి, కర్నూలుకు చెం దిన ఒకరికి తిరుపతిలోనే క్వారంటైన్‌ చేశారు.


ఓపీలకు అనుమతివ్వండి 

ప్రయివేటు మెడికల్‌ కాలేజీల విజ్ఞప్తి 


అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): ప్రయివేటు మెడికల్‌ కాలేజీల్లో ఓపీ సేవలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని కాలేజీల యాజమా న్యం అసోసియేషన్‌ సభ్యులు కోరారు. శుక్రవారం విజయవాడలోని కరోనా కమాండ్‌ కంట్రోల్‌ సెం టర్‌లో ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. కరోనా కేసులకు చికిత్స చేసినందుకు అన్ని ప్రయివేటు మెడికల్‌ కాలేజీలకు ఆర్థిక వెసులుబాట్లు కల్పించాలని, 2019-20లో చెల్లించిన పన్నులు వెనక్కివ్వాలని కోరారు. ఈ ఏడాది పన్ను మినహాయింపుతో పాటు ఆర్థిక సహకారం ఇవ్వాలన్నారు.

Updated Date - 2020-05-23T08:27:16+05:30 IST