ఎక్కడికక్కడ ఆంక్షలు!

ABN , First Publish Date - 2021-04-21T09:16:21+05:30 IST

చుట్టేస్తున్న కరోనా విపత్తుకు చెక్‌ పెట్టేందుకు ఎక్కడికక్కడ స్వీయ ఆంక్షలను అమల్లోకి తెస్తున్నారు. ‘ఇది ఒక్కరు చేసే యుద్ధం కాదు’ అనే స్ఫూర్తిని వ్యాపారుల నుంచి పలు జిల్లాల అధికారుల వరకు చాటుతున్నారు. కరోనా కట్టడికి తమ పరిధిలో సాధ్యమైన చర్యలన్నింటినీ చేపడుతున్నారు. కడప జిల్లా రైల్వేకోడూరులో వ్యాపార సంఘాలు సమావేశమై..

ఎక్కడికక్కడ ఆంక్షలు!

  • -ఎవరి పద్ధతిలోవారు కరోనాపై పోరు
  • -వ్యాపార వేళలు కుదించిన సంఘాలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

చుట్టేస్తున్న కరోనా విపత్తుకు చెక్‌ పెట్టేందుకు ఎక్కడికక్కడ స్వీయ ఆంక్షలను అమల్లోకి తెస్తున్నారు. ‘ఇది ఒక్కరు చేసే యుద్ధం కాదు’ అనే స్ఫూర్తిని వ్యాపారుల నుంచి పలు జిల్లాల అధికారుల వరకు చాటుతున్నారు. కరోనా కట్టడికి తమ పరిధిలో సాధ్యమైన చర్యలన్నింటినీ చేపడుతున్నారు. కడప జిల్లా రైల్వేకోడూరులో వ్యాపార సంఘాలు సమావేశమై.. బుధవారం నుంచి మధ్యాహ్నం 2 గంటల తర్వాత దుకాణాలు తెరవరాదని  స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నాయి. ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కరోనా నివారణ కోసం ఆంక్షలు మొదలయ్యాయి. కందుకూరులో ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఐదు వరకు మాత్రమే వ్యాపారాలు, ఇతర జనసంచారానికి అనుమతించాలని నిర్ణయించారు. మంగళవారం నుంచే ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. త్రిపురాంతకంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే దుకాణాలు, వ్యాపార ఇతర కార్యకలాపాలకు అవకాశం ఇచ్చి, ఆ తర్వాత అత్యవసరాలు మినహా అన్నింటినీ మూసివేయించారు. అద్దంకిలో ఈనెల 22నుంచి ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు వరకే వ్యాపారాలు అనుమతించాలని నిర్ణయించారు.


సర్వం లాక్‌..

ప్రతిరోజూ వందల్లో కరోనా కేసులు నమోదవుతున్న గుంటూరు నగరంలో ఆంక్షలు విధించాలని అధికారులు నిర్ణయించారు. గుంటూరు నగర మేయర్‌ కావటి శివనాగ మనోహర నాయుడు అధికారులు, ఎమ్మెల్యేలతో మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే షాపులు అందుబాటులో ఉంటాయి. ఈ నెల 25వ తేదీ నుంచి రాత్రి 7 తరువాత మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పూర్తి కర్ఫ్యూ ఉంటుంది. ఇదే జిల్లాలోని నరసరావుపేటలో గురువారం నుంచి లాక్‌డౌన్‌ అమలు చేయాలని నిర్ణయించారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అధికారులు, వ్యాపార, వాణిజ్య సంస్ధల ప్రతినిధులు కలిసి చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్‌లో భాగంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి మూడు గంటల వరకే వ్యాపార సంస్థలు పని చేస్తాయి. కృష్ణాజిల్లా మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో గురువారం రాత్రి లాక్‌డౌన్‌ను విధిస్తూ రెవెన్యూ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఎలాంటి జన సంచారానికి అనుమతి ఉండదని ఆర్డీవో ఖాజావలి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఉదయం 8 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని అధికారులు ఆదేశించారు. గూడూరు పట్టణంలో మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. ఆత్మకూరులో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం రెండు  గంటల వరకే దుకాణాలు తెరవాలని ఆదేశించారు.   


స్విమ్మింగ్‌ పూల్స్‌ మూత

కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని స్విమ్మింగ్‌ పూల్స్‌ను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వ్యాపార ప్రాంతాలు, ప్రజలు గుమిగూడే ప్రదేశాల్లో థర్మల్‌ స్ర్కీనింగ్‌ ఏర్పాటుచేయాలని, హ్యాండ్‌ శానిటైజేషన్‌ అందుబాటులో ఉంచాలని, భౌతిక దూరం పాటించేలా చూడాలని పేర్కొంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.




వ్యాపారాలు లేక నష్టపోతున్నాం..

కరోనా సెకండ్‌ వేవ్‌ దృష్ట్యా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ముందస్తుగా మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకు కొన్ని షరతులు విధించింది. ప్రతీ ఆదివారం పూర్తిస్ధాయిలో దుకాణాలు మూసివేయాలి. ప్రతీ రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే దుకాణాలు తెరవాలి. అయితే వాస్తవానికి గడచిన నెల రోజులుగా కరోనా కారణంగా వ్యాపారాలు డీలా పడ్డాయి. బేరాలు లేవని.. సాయంత్రం ఆరు దాక కూడా కొందరు వ్యాపారులు ఆగడం లేదు. మధ్యాహ్నమే వారు తమ దుకాణాలు మూసి వెళ్లడం కనిపించింది. ‘‘ఉదయం ఆరు గంటలకు దుకాణం తెరుస్తాను. అప్పటి  నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దాదాపు రూ.5 వేలు, అక్కడి నుంచి రాత్రి దుకాణం మూసే సమయానికి మరో రూ.10 వేలు అమ్మకాలు జరపుతాం. అయితే గడచిన నెల రోజులుగా రోజంతా అమ్మినా కనీసం రూ.3 నుంచి రూ.4వేలు రావడం లేదు’’ అని ఓ చిన్నపాటి కిరాణా దుకాణాదారుడు ఆవేదన వ్యక్తం చేశారు. 


37 వేల పడకలు అందుబాటులో ఉండాలి: జవహర్‌రెడ్డి

రాష్ట్రంలో కరోనా చికిత్సకు ప్రస్తుతం 18వేల పడకలు అందుబాటులో ఉన్నాయని, దాన్ని 37వేలకు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ చైర్‌పర్సన్‌ జవహర్‌రెడ్డి జిల్లాల అధికారులను ఆదేశించారు. కొవిడ్‌పై మంగళవారం రాత్రి కలెక్టర్లు, స్పెషల్‌ ఆఫీసర్లతో ఆన్‌లైన్‌ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నాలుగు వేల వెంటిలేటర్లను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లన్నీ వెంటనే పునరుద్ధరించాలన్నారు. డాక్టర్ల సలహా మేరకు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 35 వేల మందిహోం ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. 70 వేల మంది ప్రైమరీ కాంటాక్టులకు పరీక్షలు చేయాల్సి ఉందన్నారు.

Updated Date - 2021-04-21T09:16:21+05:30 IST