ఎగరని విమానం.. ఉపాధి గగనం!

ABN , First Publish Date - 2021-09-17T05:25:40+05:30 IST

జిల్లాలో అనేక కుటుంబాలు గల్ఫ్‌ దేశంలో ఉపాధి ఊతంతో మెరుగైన జీవితాన్ని గడుపుతున్నాయి. సుమారు 1.20 లక్షల మంది జిల్లావాసులు గల్ఫ్‌ దేశంలో ఉద్యోగం, ఉపాధి పొందుతున్నారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ఏడాదిన్నర నుంచి విదేశాలకు ప్రయాణం కష్టంగా మారింది. ప్రధానంగా ఎక్కువ మంది జిల్లావాసులు ఉపాధి పొందుతున్న కువైట్‌ ప్రభుత్వం.. అనేక ఆంక్షలు అమలు చేస్తోంది. కరోనా వ్యాప్తి కారణంగా భారతదేశం నుంచి వచ్చే ప్రయాణికులను అనుమతించడం లేదు. దీంతో కొన్ని నెలలుగా విమానాల రాకపోకలు నిలిచాయి. కువైట్‌ నుంచి ప్రయాణికులు ఇక్కడికి రావటానికి ఇబ్బందులు లేకపోయినా... అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో జిల్లాలో సుమారు 30 వేల మంది ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

ఎగరని విమానం.. ఉపాధి గగనం!

- కువైట్‌లో రాకపోకలకు కరోనా ఆంక్షలు

- నిలిచిన విమాన సర్వీసులు

- జిల్లా యువతకు ఆర్థిక కష్టాలు

(ఇచ్ఛాపురం రూరల్‌)

జిల్లాలో అనేక కుటుంబాలు గల్ఫ్‌ దేశంలో ఉపాధి ఊతంతో మెరుగైన జీవితాన్ని గడుపుతున్నాయి. సుమారు 1.20 లక్షల మంది జిల్లావాసులు  గల్ఫ్‌ దేశంలో ఉద్యోగం, ఉపాధి పొందుతున్నారు. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో ఏడాదిన్నర నుంచి విదేశాలకు ప్రయాణం కష్టంగా మారింది. ప్రధానంగా ఎక్కువ మంది జిల్లావాసులు ఉపాధి పొందుతున్న కువైట్‌ ప్రభుత్వం.. అనేక ఆంక్షలు అమలు చేస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా వలసదారుల విషయంలో గల్ఫ్‌ దేశం కువైట్‌లో ఇంతకుముందెన్నడూ చూడని కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ఏడాది ప్రారంభంలో వైరస్‌ ప్రభావం మొదలవ్వగా.. ఇప్పటివరకూ ఏకంగా 1.90 లక్షలమంది ప్రవాసులు ఆ దేశాన్ని వదిలి వెళ్లిపోయారు. కరోనా ప్రభావంతో బలహీనమైన ఆర్థిక వాతావరణం కార్పొరేట్‌ తొలగింపులకు కారణమైంది. ఈ క్రమంలో కువైట్‌లో విదేశీయుల నియామకాలు బాగా తగ్గిపోయాయి. మరోవైపు కరోనా వ్యాప్తి కారణంగా భారతదేశం నుంచి వచ్చే ప్రయాణికులను అనుమతించడం లేదు. దీంతో కొన్ని నెలలుగా విమానాల రాకపోకలు నిలిచాయి. కువైట్‌ నుంచి ప్రయాణికులు ఇక్కడికి రావటానికి ఇబ్బందులు లేకపోయినా... అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో జిల్లాలో సుమారు 30 వేల మంది ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఉపాధి కోసం విదేశాలకు వెళ్లేందుకు వేచి చూస్తున్నారు. పాస్‌పోర్టులు సిద్ధం చేసుకుంటున్నారు. కువైట్‌ వెళ్లేవారికి రెండు డోసుల టీకా ధ్రువీకరణ పత్రంతో పాటు అక్కడి ప్రభుత్వం అనుమతి అవసరం. పాస్‌పోర్టు, టీకా ధ్రువీకరణ పత్రాన్ని కువైట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. వారి అనుమతి పొందాకే విమాన టికెట్లు బుక్‌ చేసుకోవాలి. ఈ మేరకు వీటన్నింటినీ సిద్ధం చేసుకుంటున్నారు. కానీ, విమానాల రాకపోకలను ఎప్పుడు పునరుద్ధరిస్తారనేది కువైట్‌ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో చాలామంది నిరాశ చెందుతున్నారు. కొవిడ్‌ ఆంక్షలు సడలించాలని, విమానాల రాకపోకలు పునరుద్ధరిస్తే వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని అభిప్రాయపడుతున్నారు. 


 రూ.3 లక్షలు నష్టపోయా.. 

కువైట్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నా. ఈ ఏడాది సంక్రాంతికి  స్వగ్రామం వచ్చాను. కరోనా వ్యాప్తితో విమానాలు వెళ్లకపోవడంతో ఇక్కడే ఉండిపోయాను.  అక్కడ నెలకు రూ.35వేల వరకు వస్తుంది. కువైట్‌లో ఇతర పనులు చేసేందుకు అవకాశం కూడా ఉంది. ఎనిమిది నెలలుగా ఇక్కడే ఉన్నాను. రూ.మూడు లక్షల వరకు నష్టపోయాను. గ్రామంలో ఇతర పనులకు వెళ్తున్నా, కూలి గిట్టుబాటు కావడం లేదు.  

- డి.పితాంబరు, శాసనం గ్రామం.


ఆర్థికంగా ఇబ్బందులు : 

గత ఏడాది సంక్రాంతికి కువైట్‌ నుంచి స్వగ్రామం వచ్చాను. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా కువైట్‌ వెళ్లలేని పరిస్థితి నెలకొంది.  కాలం వృథా అయి.. ఖర్చులు పెరిగిపోయాయి. మా గ్రామంలో వ్యవసాయం లేక.. ఇంటివద్దే ఉండి అప్పు చేసి జీవనం సాగిస్తున్నాం. ఆర్థికంగా నష్టపోయాం.  

  - ఎం.గణేష్‌, కొలిగాం గ్రామం.

Updated Date - 2021-09-17T05:25:40+05:30 IST