Corona పరీక్ష ఫలితాల్లో తప్పులు.. ఇద్దరి మృతి!

ABN , First Publish Date - 2021-07-16T04:55:46+05:30 IST

బెంగళూరులోని జయానగర్ జనరల్ ఆస్పత్రిలో ఆర్‌టీపీసీఆర్ పరీక్షల్లో తప్పులు దొర్లడం స్థానికంగా కలకలం రేపుతోంది.

Corona పరీక్ష ఫలితాల్లో తప్పులు.. ఇద్దరి మృతి!

బెంగళూరు: బెంగళూరులోని జయానగర్ జనరల్ ఆస్పత్రిలో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షల్లో తప్పులు దొర్లడం స్థానికంగా కలకలం రేపుతోంది. వారం వ్యవధిలో ఎనిమిది మంది కరోనా రోగులకు ఈ కరోనా పరీక్ష నిర్వహించగా వారందరికీ వ్యాధి సోకలేదని తెలిపే నెగిటివ్(వైద్య పరిభాషలో ఫాల్స్ నెగెటివ్ అని అంటారు) ఫలితం రావడం అక్కడి వైద్యులను కూడా నివ్వెరపరిచింది. వీరిలో ఇద్దరు ఇప్పటికే మృతి చెందినట్టు జాతీయ మీడియా పేర్కొంది. ‘‘ఆ ఎనిమిది బాధితుల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో సీటీ స్కాన్ చేయగా.. ఇన్ఫెక్షన్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. వెంటనే వారికి ఆస్పత్రిలో చికిత్స అందించాం. దురదృష్టవశాత్తూ.. ఇద్దరు రోగులు మృతి చెందారు’’ అని ఆస్పత్రిలోని నోడల్ అధికారి పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి ఆర్‌టీ-పీసీఆర్ ఫలితాలతో సంబంధం లేకుండా సీటీ స్కాన్ పరీక్షలు చేస్తున్నామని అక్కడి వైద్యులు తెలిపారు. చికిత్సకు సంబంధించి ఇది ప్రామాణిక పద్ధతి అని కూడా వారు పేర్కొన్నారు. కాగా.. కరోనా సోకిన తొమ్మిదో రోజున కరోనా రోగి నుంచి శాంపిల్ సేకరిస్తే  వ్యాధి బారినపడ్డా కూడా నెగెటివ్ రిపోర్టు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా.. శాంపిల్ సేకరించిన తరువాత ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష జరపడంలో ఆలస్యం జరిగితే నెగెటివ్ ఫలితం వచ్చే అవకాశం పెరుగుతుందని చెబుతున్నారు.

Updated Date - 2021-07-16T04:55:46+05:30 IST