సచివాలయంలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-04-11T08:27:18+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ అమరావతి సచివాలయాన్ని తాకింది. పలువురు సచివాలయ ఉద్యోగులు కొవిడ్‌ బారిన పడటం కలకలం రేపుతోంది. గతేడాది అమరావతి సచివాలయ ఉద్యోగుల్లో దాదాపు 200

సచివాలయంలో కరోనా కలకలం

తొమ్మిది మంది ఉద్యోగులకు పాజిటివ్‌

వారాంతాల్లో హైదరాబాద్‌కు రాకపోకలు

తెలంగాణ నుంచి వచ్చినవారిలోనే లక్షణాలు?


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

కరోనా సెకండ్‌ వేవ్‌ అమరావతి సచివాలయాన్ని తాకింది. పలువురు సచివాలయ ఉద్యోగులు కొవిడ్‌ బారిన పడటం కలకలం రేపుతోంది. గతేడాది అమరావతి సచివాలయ ఉద్యోగుల్లో దాదాపు 200 మందికి పైగా కోవిడ్‌ బారిన పడ్డారు. కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురైన ఇద్దరు ఉద్యోగులు మృతి చెందగా, మిగిలిన వారు కోలుకున్నారు. అయితే, ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌లో గత 15 రోజుల్లో పలువురు ఉద్యోగులు కోవిడ్‌ బారిన పడినట్లు తెలుస్తోంది. కరోనా లక్షణాలున్న ఉద్యోగులు పరీక్షలు చేయించుకుని, పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారు సెలవులు పెట్టుకుని సెల్ఫ్‌ క్వారంటైన్‌ లో ఉన్నట్లు ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి.


తాజాగా సచివాలయంలోని మున్సిపల్‌, పరిశ్రమలు, మైనింగ్‌శాఖల్లో తొమ్మిది మంది ఉద్యోగులు కరోనా బారినపడినట్లు తెలిసింది. వీరిలో.. పరిశ్రమలశాఖలోని అసిస్టెంట్‌ సెక్రటరీ, మైనింగ్‌శాఖలో ఎస్‌వో, ఏఎ్‌సవో, పురపాలకశాఖ జాయింట్‌ సెక్రటరీ, అదేశాఖలోని ఇద్దరు ఎస్‌వోలు, ఇద్దర ఏఎ్‌సవోలు, ఒక డీఈవో కరోనా బారినపడినట్లు తెలిసింది. తీవ్ర అస్వస్థత గురైన వారు ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నట్లు పలువురు చెబుతున్నారు. సచివాలయ ఉద్యోగుల్లో సగం మందిపైగా వారాంతాల్లో హైదరాబాద్‌ వెళ్లి వస్తున్నారు. అటు తెలంగాణ, ఇటు ఏపీలోనూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అటు ఇటూ రాకపోకల వల్ల కరోనా వ్యాపిస్తోందనే ఆందోళన కనిపిస్తోంది.


పరీక్షలు ఎక్కడ?

గతంలో సచివాలయంలో వారానికి రెండు రోజులు ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేసేవారు. అయితే, ఇప్పుడు చేయడంలేదు. దీంతో ఉద్యోగులు బయట పరీక్షలు చేయించుకుంటున్నారు. ఫలితంగా ఏ ఉద్యోగి కరోనా బారిన పడ్డారు.. అనే విషయం బయటకు తెలియడంలేదు. తొమ్మిది మంది ఉద్యోగులతోపాటు గత పదిహేనురోజులుగా వివిధ శాఖల్లోని పలువురు ఉద్యోగులు కరోనా బారినపడినట్లు తెలిసింది. నిత్యం వందల సంఖ్యలో ఉద్యోగులు సచివాలయంలో విధులు నిర్వర్తిస్తుండడంతో ఎవరి ద్వారా ఎప్పుడు కరోనా తమకు కూడా వ్యాప్తి చెందుతుందో అని పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.


కరోనా నిబంధనలు గాలికి

సచివాలయంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. కోవిడ్‌ నిబంధనలు ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మాస్కులు ధరించడం కూడా అంతంత మాత్రంగానే ఉంది. శానిటైజర్లు దాదాపు కనుమరుగయ్యాయి. భౌతిక దూరం నిబంధనను ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రధానంగా సందర్శకులు సచివాలయం ప్రధాన గేటు వద్ద తప్ప లోపలికి వచ్చాక భౌతిక దూరం, మాస్కులు ధరించడాన్ని విస్మరిస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్నా సచివాలయంలో ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. 


వ్యాక్సిన్‌ ధైర్యమే కారణమా?

గత నెల 24, 25, 26 తేదీల్లో అసెంబ్లీ, సచివాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ, సచివాలయ ఉద్యోగులకు కోవ్యాక్సిన్‌  వేశారు. వ్యాక్సిన్‌ తీసుకున్నందున ఏమీ కాదులే అన్న భావనతో పలువురు ఉద్యోగులు కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 45 ఏళ్లలోపు వయసున్న ఉద్యోగులకు వ్యాక్సిన్‌  వేయకూడదన్న నిబంధన ఉండడంతో సచివాలయంలో పలువురు వ్యాక్సిన్‌  తీసులేదు. అయితే.. ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నందున తమకు కూడా వ్యాక్సిన్‌  ఇవ్వాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు.

Updated Date - 2021-04-11T08:27:18+05:30 IST