కొవిడ్‌ రెండో దశ వ్యాప్తిలో గమనించిన మార్పులేంటి..!?

ABN , First Publish Date - 2021-04-19T19:26:48+05:30 IST

‘కొవిడ్‌ రెండో దశ వ్యాప్తి ఉధృతమవుతున్న సమయంలో వ్యాధి తీవ్రతలోనూ..

కొవిడ్‌ రెండో దశ వ్యాప్తిలో గమనించిన మార్పులేంటి..!?

  • యువకుల్లో లక్షణాలు బయట పడడం లేదు
  • డాక్టర్‌ శొంఠి భవాని, సూపరింటెండెంట్‌, తెలంగాణ యోగాధ్యయన పరిషత్‌

హైదరాబాద్‌ సిటీ : ‘‘కొవిడ్‌ రెండో దశ వ్యాప్తి ఉధృతమవుతున్న సమయంలో వ్యాధి తీవ్రతలోనూ తేడాలొచ్చాయంటున్నారు తెలంగాణ యోగాధ్యయన పరిషత్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శొంఠి భవాని. కరోనా పరీక్షల్లో నలభై శాతంమందికి పాజిటివ్‌ వస్తోందని ఆమె తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్‌ భవాని ఆంధ్రజ్యోతికి వివరించారు.


కొవిడ్‌ రెండో దశ వ్యాప్తిలో మీరు గమనించిన మార్పులు ఏంటి ?

భవాని : కొవిడ్‌ మొదటి దశలో జ్వరం, తలనొప్పి, జలుబు వంటి లక్షణాలు కనిపించిన రెండు రోజుల తర్వాత, తమ శరీరంలో ఏదో మార్పు జరుగుతుందని రోగులు గుర్తించి పరీక్ష చేయించేవారు. తద్వారా వ్యాధి నిర్ధారణ జరిగేది. ఇప్పుడు, తమ ఒంట్లో ఏ కొద్దిగా భిన్నంగా అనిపించినా, వెంటనే అనుమానించి పరీక్ష చేయించుకుంటున్నారు. వ్యాధి లక్షణాలపై అంతలా అవగాహన పెరిగింది. వైరస్‌ వ్యాప్తి పెరిగింది. అమీర్‌పేట్‌ నేచర్‌క్యూర్‌లో రోజుకు మూడు వందలమందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం. అందులో నలభై శాతం పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. మొదటి దశతో పోలిస్తే, ఇప్పుడు వైరస్‌ తీవ్రతలోనూ తేడాలొచ్చాయి. కరోనా లక్షణాలు వెంటనే బయటపడుతున్నాయి. అయితే, ఇది అందరికీ ఒకేలా ఉండదు. 


ఒకసారి పాజిటివ్‌ అని తేలాక, తిరిగి ఎప్పుడు పరీక్ష చేయించాలి ?

భవాని : కరోనా లక్షణాలున్నా, ర్యాపిడ్‌ యాంటిజన్‌ టెస్టులో ఒకవేళ నెగెటివ్‌ చూపిస్తే, ఆ వ్యక్తి వెంటనే ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలి. ర్యాపిడ్‌ యాంటిజన్‌లో పాజి టివ్‌గా నిర్ధారణ అయ్యాక మాత్రం, 18 రోజుల తర్వాత తిరిగి అదే పరీక్ష చేయించాలి. నెలరోజులు గడిచాక ఆర్టీపీసీఆర్‌కు వెళ్లాలి. అప్పటి వరకు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉంటే మంచిది. 


ప్రస్తుతం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?

భవాని : మూడు రోజులుగా నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది రకరకాల ఇన్ఫెక్షన్లకు లోనయ్యే అవకాశం ఎక్కువ. కనుక వీలైనంత వరకు దూరప్రయాణాలు మానుకోవాలి. సామూహిక కలయికలకు దూరంగా ఉండటం అవసరం. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. పచ్చిమామిడి కాయ ముక్కతో పది పుదీనా ఆకులు కలిపి మిక్సీ చేయాలి. ఆ మిశ్రమంలో కొద్దిగా నిమ్మకాయ రసం, మిరియాల పొడి కలిపి రోజుకొకసారైనా తీసుకుంటే మంచిది. పచ్చి మామిడి కాయను ఉడికించి జ్యూస్‌ చేసుకొని తాగచ్చు కూడా. వడదెబ్బకు మంచి ఉపశమనమేగాక, శరీరానికి సీ విటమిన్‌ అందిస్తుంది. ఇన్ఫెక్షన్లనూ తప్పించుకోవచ్చు. 


ప్రకృతి చికిత్సాలయంలో ఎలాంటి సేవలు అందిస్తున్నారు ?

భవాని : తెలంగాణ యోగాధ్యయన పరిషత్‌ పరిధిలోని అమీర్‌పేట్‌, నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రి ఐసోలేషన్‌ కేంద్రంగా కొవిడ్‌ రోగులకు ఉచిత సేవలందిస్తోంది. మా వద్ద సుమారు 280 బెడ్లు ఉన్నాయి. ప్రస్తుతం 170 మంది ఇక్కడ ఉన్నారు. వారందరికీ మూడు పూటలా భోజనం, రెండు పూటలా అల్పాహారంతో పాటు ప్రత్యేకంగా తయారుచేసిన కషాయం రోగులకు ఇస్తాం. దాంతో పాటు రోజూ ఉదయం, సాయంత్రం కొద్దిసేపు యోగా చేయిస్తున్నాం. అదే ఆవరణలో ర్యాపిడ్‌ యాంటిజన్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు ఉచితంగా చేస్తారు. పాజిటివ్‌ అని తేలితే, వాళ్లకు మాత్రల కిట్‌ను అందిస్తారు. మా కేంద్రంలో సేవలన్నీ ఉచితమే. 


మీ పరిశీలన మేరకు ఏ వయసు వారు ఎక్కువ కొవిడ్‌ ప్రభావానికి లోనవుతున్నారు ?

భవాని : ప్రస్తుతం మా వద్ద ఉన్న రోగుల్లో అన్ని వయసులవారూ ఉన్నారు. ముఫ్ఫై ఏళ్లలోపు వారిలో ఎక్కువ లక్షణాలు కనిపించడంలేదు. కరోనా సామాజిక వ్యాప్తికి యువతే కారణమవుతున్నారు. రెండువారాలుగా పరిశీలిస్తే, కొవిడ్‌ కేసుల్లో ఆడవాళ్ల కన్నా పురుషుల సంఖ్యే ఎక్కువ ఉండటం గమనించాం. అలా అని మహిళల్లో కొవిడ్‌ వ్యాప్తి తక్కువ అనడానికి వీల్లేదు. దీనివెనుక పలు సామాజిక కారణాలూ ఉంటాయి. 


కొవిడ్‌ తగ్గాక ఆవరించే నీరసరం పోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి ?

భవాని : నిత్యం ఉదయం అల్పాహారంలో అమృతాహారాన్ని తీసుకోవాలి. ఖర్జూర, ఎండు ద్రాక్ష, అంజీర్‌ను అమృతాహారం అంటారు. వీటన్నింటినీ కలిపి ఒక గుప్పెడు వరకు రోజూ ఉదయాన్నే తినడం వల్ల నీరసం తగ్గుతుంది. ఎండు ఖర్జూర నానబెట్టిన నీళ్లు కూడా తాగచ్చు. అయితే, డయాబెటిక్‌ రోగులు ఇడ్లీ, దోశ వంటి అల్పాహారాన్ని కాస్త తక్కువ తీసుకొని, బదులుగా అమృతాహారం తీసుకోవచ్చు. శరీరంలో కఫాన్ని పెంచే స్వభావంగల పాలు, పెరుగు వంటి డెయిరీ ఉత్పత్తులను రాత్రిపూట తీసుకోకపోవడం ఉత్తమం.

Updated Date - 2021-04-19T19:26:48+05:30 IST