Abn logo
Apr 2 2020 @ 00:23AM

కరోనా: నల్ల మబ్బుకు వెండి అంచు

‘కరోనా’ లాక్‌డౌన్‌తో కొంచెం మోదం.. కొంచెం ఖేదం. అయినా దీనిని తీపి–చేదు రుచుల సమ్మేళనంగా ఎందుకు చూడాలి? సంతోషంగా ఎందుకు స్వాగతించకూడదు? కష్టమో.. నష్టమో.. అంతా మన మంచి కోసమే అని దేనికి సరిపెట్టుకోకూడదు? అందరూ వద్దు వద్దంటున్నా పనిగట్టుకొని బయటికి వెళ్లి మహమ్మారి వైరస్‌ను కొనితెచ్చుకోవటం ఎందుకు? మనం, మన కుటుంబం, ఇరుగు–పొరుగు ఉద్దేశపూర్వకంగా బలిపీఠానికి చేరువైతే చింతించటానికి మిగిలేది ఎవరు? ఆయువు ఉంటేనే కదా, జీవిక!


‘మరక మంచిదే..’ అంటూ పేరొందిన ఒక డిటర్జెంట్‌ సబ్బు తయారీదారులు ప్రాచుర్యంలోకి తెచ్చిన వాణిజ్య ప్రకటన, కరోనా వైరస్‌కు వర్తిస్తుందని చిన్ననాటి మిత్రుడొకరు ఫోన్‌లో చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యమేసింది! దానికి అతడు చెప్పిన లాజిక్‌ నన్ను కొంతవరకు కన్విన్స్‌‌ చేసింది!!


కరోనా వైరస్‌ బారినపడి లేదా ఆ అంటువ్యాధి లక్షణాలతో చికిత్స పొందుతున్న వారి వేదన అర్థం చేసుకోదగింది. విదేశాలు, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చాక సొంత ఇల్లు లేదంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో క్వారంటైన్‌–ఐసొలేషన్‌లో ఉన్న వారి పరిస్థితి కొంత నయం. అదే సమయంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యల్లో భాగంగా ఇచ్చిన లాక్‌డౌన్‌ ఆదేశాల ప్రకారం ఇంటికే పరిమితమైన కోట్లాది కుటుంబాల అనుభవాలు వైవిధ్యంగా ఉన్నాయి.


చరిత్రలో ఎన్నడూ కనివినీ ఎరుగని లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 22వ తేదీ నుంచి నిత్యావసర సరుకులు, కూరగాయల కోసం తప్ప గడప దాటి కాలు బయటపెట్టని వారే అత్యధికులు. ఈ సందర్భంగా అత్యవసర సర్వీసులకు చెందిన వారు మినహా ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల ఉద్యోగులు, సాధారణ ప్రజానీకం, వారి కుటుంబ సభ్యులు ఇంతవరకు చవిచూడని అనుభూతులను సొంతం చేసుకుంటున్నారనేది నూటికి నూరుపాళ్ళు నిజం.


రోజువారీ బిజీ లైఫ్‌లో మానవ సంబంధాలన్నీ ఆర్థిక–అవసరాల సంబంధాలైన వేళ కుటుంబ సభ్యులందరూ ‘కరోనా’ లాక్‌డౌన్‌తో ఇష్టమున్నా లేకున్నా, ఒకే ఇంట్లో గడపాల్సి రావటమే అత్యంత కీలకమైంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో అనివార్యంగా ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది.  


‘పిల్లలు నిద్ర లేచేసరికి ఆఫీసుకు బయలుదేరాల్సి వస్తోంది. మళ్లీ ఇంటికి వెళ్లేసరికి పిల్లలు నిద్రపోతున్నారు’ అని మధనపడే అనేకమంది ఉద్యోగులకు ఇప్పుడా సమస్య లేకుండా పోయింది. ఇంట్లో ఉన్న కొద్ది సమయంలోనూ ఎవరి గ్యాడ్జెట్‌్స్‌లో వారు తలదూర్చి, అందరూ ఉన్నా ఎవరి గదిలో వారు ఒంటరి అయ్యే వాతావరణానికి బ్రేక్‌ పడింది. ఎవరైనా మొబైల్‌ ఫోన్‌, టెలివిజన్‌తో ఎంతసేపని కాలక్షేపం చేస్తారు ? అంతకుముందు వరకు నిత్యం కలుసుకునే ఆఫీసు కొలీగ్స్‌, స్నేహితులు, పరిచయస్తులతో ఉండబట్టలేక జరిపే ఫోన్‌ సంభాషణల్లో పంచుకోవటానికి ‘కరోనా’ తప్ప మిగిలిన ముచ్చట్లు ఏం మిగిలాయనీ? ఆ వైరస్‌, దాని ప్రభావం గురించి ఎన్ని గంటలని మాట్లాడుకుంటారు? ఈ పరిణామం కుటుంబ సభ్యులు పరస్పరం మాట్లాడుకోవాల్సిన అనివార్యత కల్పించింది. జీవన శైలిలో వినూత్నమైన మార్పునకు బీజం వేస్తోంది.


‘కరోనా’ లాక్‌డౌన్‌ పుణ్యమా అని, గడిచిన కొన్ని రోజులుగా దగ్గరి బంధువులు, చిన్ననాటి స్నేహితుల మధ్య ఫోన్‌ కాల్స్‌ పెరిగాయి. బతికి ఉంటామో లేదో అనే భయమో లేక భారంగా మారిన దూరం వల్ల తలెత్తిన బెంగ వల్లనో.. తెలియదు కానీ, సెల్‌ఫోన్‌ సంభాషణల్లో బంధాలు–బాంధవ్యాలు మళ్లీ పురుడు పోసుకుంటున్నాయి. ఎక్కువగా బయటి భోజనాలకే అలవాటు పడ్డ కుటుంబాలెన్నో ఎట్టకేలకు తమ చేతి వంట రుచితో మైమరిచిపోతున్నాయి. వంటల్లో రకరకాల ప్రయోగాలకు తెర తీస్తున్నాయి. చాలా మంది భర్తలు నలభీమ అవతారాలు ఎత్తుతున్నారు. నిత్యం చదువు, నెట్‌ బ్రౌజింగ్‌, సోషల్‌ మీడియా, క్రీడలు తప్ప మరో లోకం తెలియని విద్యార్థినీ విద్యార్థులు ఎంతో మంది వంట, ఇంటి పనుల్లో తల్లికి సాయం చేస్తున్నారు. ఆడపిల్లలే కాదు, మగ పిల్లలు కూడా వంటింట్లో గరిటె తిప్పటానికి పోటీ పడుతున్నారు. పఠనాసక్తి కలిగిన వారు పాత పుస్తకాల దుమ్ము దులుపుతున్నారు. నెట్టింట్లో కొత్త కథల కోసం దేవులాడుతున్నారు. ఇంటిల్లిపాది వయోభేదాన్ని మరిచి అష్టాచెమ్మా, వైకుంఠపాళి వంటి అలనాటి ఆటల్లో తమ ప్రావీణ్యాన్ని తిరగదోడుతున్నారు. చిన్నారులు తమ చిట్టి చేతులకు పని చెబుతున్నారు. ఇంటి పరిశుభ్రతలో తల్లిదండ్రులకు చే యూతనిస్తున్నారు. పుట్టి బుద్ధి ఎరిగిన నుంచి శుభ్రత మాట ఎరుగనివారి కళ్లను ‘కరోనా’ తెరిపించేసింది మరి! ఆపత్కాలంలో ఇతరులకంటే కుటుంబ సభ్యులే పెద్ద దిక్కు అనే సందేశాన్నీ ఇచ్చింది!!


ఉదయం లేకపోతే సాయంసంధ్య సమయాన నడక జీవితంలో భాగం చేసుకున్న వారు సమీప పార్క్‌లకు వెళ్లలేని పరిస్థితుల్లో ఇంట్లోనే నాలుగు అడుగులు వేస్తున్నారు. ఉత్సాహం ఉన్న వారు యోగా వైపు మళ్లుతున్నారు. మద్యం సేవించే అలవాటుకు దూరం కావాలనే యోచన ఉన్నప్పటికీ, తీరాన్ని చేరుకోలేక అల మాదిరిగా డోలాయమాన స్థితిలో ఉన్న కొందరికి ఈ లాక్‌డౌన్‌ ఒక మార్గాన్ని చూపింది. ఇక రోజూ చుక్క గొంతు దిగకుంటే, చక్కగా ఉండలేని వారు ఆర్థిక స్తోమతకు అనుగుణంగా ‘మందు’ జాగ్రత్త చర్యలు చేపట్టి ఇంట్లోనే బార్‌ తెరిచేశారు. కల్తీ కల్లు, చీప్‌ లిక్కర్‌కు బానిస అయిన వారిలో కొందరు అవి దొరక్క మతిస్థితిమితం కోల్పోతుంటే, మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకొందరు దొడ్డిదారి కొనుగోళ్లపై ఆధారపడి నకిలీ మద్యం బారిన పడుతున్నారు. గ్రామాల్లోని తాటికల్లు ప్రియులు పోలీసుల హెచ్చరికలతో ఉదయం తొమ్మిది గంటల్లోపే జల్సా ప్రణాళిక పూర్తి చేసుకుంటున్నారు.


ఇంట్లో గడిపే సమయం దొరకటంతో పలువురికి భూతకాలం–వర్తమానం–భవిష్యత్తును బేరీజు వేసుకునే వీలు చిక్కింది. ప్రతి ఒక్కరి స్వీయ పరిశీలనకు అవకాశం ఏర్పడింది. కూడబెట్టిన, కూడబెట్టాలనుకుంటున్న ఆస్తులు, కట్టాల్సిన అప్పులు, ఆదాయ, వ్యయాలపై సమగ్రమైన సమీక్షకు ‘కరోనా’ బంద్‌ ఊతమిచ్చింది.


‘తిరిగే కాలు, ఆడే నోరు’ అన్నట్టు ఉండే వారికే లాక్‌డౌన్‌ కష్టంగా గడుస్తోంది. దీనివల్ల నష్టపోయేది ఎంత అనేది కొందరు వ్యాపారులు లెక్కలు వేసుకుంటున్నారు. బ్యాంకుల నుంచి వివిధ అవసరాల కోసం రుణాలు తీసుకున్న వారు నెలవారీ చెల్లించాల్సిన కిస్తీలు ప్రస్తుతానికి వాయిదా పడినప్పటికీ, ఆదాయం, జీతాల్లో కోతలు, కొరవడిన ఉద్యోగ భద్రతతో రాబోయే అప్పుల కుప్పను తలుచుకొని దిగులు పడుతున్నారు. దేశ, విదేశాలకు చెందిన పేరొందిన ప్రైవేట్‌ సంస్థలకు చెందిన ఉద్యోగులను సైతం కొలువు ఉంటుందో.. ఊడుతుందో అనే టెన్షన్‌ వేధిస్తోంది. రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవులు ప్రభుత్వ సాయం కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. పరీక్షలు, ఉద్యోగాల భర్తీకి జరిగే ఇంటర్వ్యూలు వాయిదా పడిన కారణంగా విద్యార్థులు, నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులది విచిత్ర పరిస్థితి. ఇప్పట్లో పరీక్ష–ఇంటర్వ్యూ తేదీలు వచ్చేలా లేవని వాటిని ఎదుర్కోవాల్సిన వారు ఇతర వ్యాపకాల వైపు మళ్లిపోయారు. ఈ ‘మహమ్మారి’ సెలవులు తమ పిల్లల పరీక్షలు, ఇంటర్వ్యూలు పూర్తయ్యాక వస్తే బాగుండేదని వారి తల్లిదండ్రులు నిట్టూరుస్తున్నారు.


తాజా పరిణామం సామాజికంగానూ ఊహించని మార్పు తీసుకువచ్చింది. గ్రామాలు ఒక్కటి అవుతున్నాయి. ప్రజల్లో ఐకమత్యం పెరిగింది. ‘ఒకే మాట, ఒకే బాట’ అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. ఎప్పుడూ ఉప్పు–నిప్పులా ఉండే పాలక, ప్రతిపక్షాలు రాజకీయ వైరాన్ని పక్కనపెట్టి ‘కరోనా’పై ఏకతాటిపైకి వచ్చాయి. దేశ వ్యాప్త లాక్‌డౌన్‌తో పర్యావరణానికీ మేలు జరిగింది. వాయు, శబ్ద కాలుష్యం తగ్గింది. కానీ ఎక్కడికక్కడ జన జీవనం స్తంభించిపోవటం, ప్రజా రవాణా, వ్యాపార, వాణిజ్య సంస్థల బంద్‌తో ప్రభుత్వ ఆదాయమూ పడిపోయింది. ఇప్పటికే ఏలికలకు గుబులు పుట్టిస్తున్న ఆర్థిక మాంద్యం రాబోయే కాలంలో కోరలు చాచనున్న దృశ్యం భయపెడుతోంది. అయినా కష్టాలు తాత్కాలికమే అని అనుకుంటే తప్పేముంది? వాటిని క్రమక్రమంగానే కాకుండా, శాశ్వతంగా కడతేర్చే అల్లాఉద్దీన్‌ అద్భుత దీపం ఒకటి మన కోసం ఎదురుచూస్తుందేమో!


స్థూలంగా ‘కరోనా’ లాక్‌డౌన్‌తో కొంచెం మోదం.. కొంచెం ఖేదం. ఏ కోణంలో చూస్తే, అది భూతద్దంలో కనిపిస్తుంది. అయినా దీనిని తీపి–చేదు రుచుల సమ్మేళనంగా ఎందుకు చూడాలి? సంతోషంగా ఎందుకు స్వాగతించకూడదు? కష్టమో.. నష్టమో.. అంతా మన మంచి కోసమే అని దేనికి సరిపెట్టుకోకూడదు? అందరూ వద్దు వద్దంటున్నా పనిగట్టుకొని బయటికి వెళ్లి మహమ్మారి వైరస్‌ను కొనితెచ్చుకోవటం ఎందుకు? మనం, మన కుటుంబం, ఇరుగు–పొరుగు ఉద్దేశపూర్వకంగా బలిపీఠానికి చేరువైతే చింతించటానికి మిగిలేది ఎవరు? ఆయువు ఉంటేనే కదా, జీవిక! ఆలోచించండి ఒకసారి!!

మెండు శ్రీనివాస్‌

Advertisement
Advertisement
Advertisement