చాపకింద నీరులా కరోనా వ్యాప్తి

ABN , First Publish Date - 2021-04-21T06:15:48+05:30 IST

చాపకింద నీరులా కరోనా వ్యాప్తి

చాపకింద నీరులా కరోనా వ్యాప్తి

టెస్ట్‌ రిజల్ట్‌ ఆలస్యంతో మరింత మందికి..

వారం రోజులైనా రాని టెస్ట్‌ ఫలితాలు  

ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేందుకు భయపడుతున్న ఉద్యోగులు  

టీకాకు డిమాండ్‌ 

జి.కొండూరు, ఏప్రిల్‌ 20: మైలవరం నియోజకవర్గంలో చాప కింద నీరులా కరోనా వ్యాప్తి చెందుతోంది. కరోనా పరీక్షా ఫలితాలు వెంటనే రాకపోవడంతో వ్యాధి సోకిన వారి నుంచి వారి కుటుంబ సభ్యులకు వారితో కాంటాక్ట్‌ అయిన వారికి సోకుతోంది. ఈనెల 14న కరోనా పరీక్షలు చేయించుకున్న వారికి ఫలితం రాకపోవడంతో ఇప్పటికీ నెగిటివ్‌ లేదా పాజిటివ్‌ అనేది నిర్ధారణ కాలేదు. పీహెచ్‌సీల్లో ర్యాపిడ్‌ టెస్టులు పూర్తిగా నిలిచిపోయాయి. మైలవరంలో సీహెచ్‌సీ, చంద్రాల పీహెచ్‌సీ, జి.కొండూరు మండలంలో జి.కొండూరు, వెలగలేరు, ఇబ్రహీంపట్నం మండలంలో కొండపల్లి, ఇబ్రహీంపట్నం పీహెచ్‌సీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి శాంపిల్స్‌ను విజయవాడకు పంపుతున్నారు. అయితే అక్కడ్నుంచి ఫలితాలు వచ్చేందుకు ఆలస్యమవుతోంది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. 

పట్టణాల్లో ఉధృతంగా..

ఇబ్రహీంపట్నం, గొల్లపూడి వంటి జన సామర్థ్యం ఉన్న పట్టణాల్లో కరోనా ఉధృతంగా వ్యాపిస్తోంది. మరణాలు సంభవిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలో ఇద్దరు క్రైస్తవ మత బోధకులు, వీటీపీఎస్‌లో ఇద్దరు ఉన్నత ఉద్యోగులు ఇటీవల కరోనాతో మరణించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. కరోనా సోకిన వారి సంఖ్య వేలల్లో ఉంది. దీంతో వీటీపీఎస్‌తో పాటు మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేందుకు ఉద్యోగులు భయపడుతున్నారు. గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఒక వ్యక్తి కరోనాతో మృతి చెందినట్లు సోషల్‌ మీడియాలో పెట్టారు. మరి కొందరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిసింది. నియోజకవర్గంలో దాదాపు అన్ని చోట్ల ఒకటి రెండు పాజిటివ్‌ కేసులు బయటపడుతూనే ఉన్నాయి.   

టీకాకు డిమాండ్‌

టీకాకు డిమాండ్‌ పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు సైడ్‌ ఎఫెక్ట్సు వస్తాయని భయపడిన జనం ఇప్పుడు సెకండ్‌ వేవ్‌కు భయపడి టీకా వేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. టీకా వేయించుకునేందుకు పీహెచ్‌సీలకు క్యూ కడుతున్నారు. 40 రోజుల క్రితం మొదటి డోస్‌ టీకా వేసిన వారికి రెండో డోసు టీకా ఇప్పటి వరకు వేయలేదు. అయితే, జనం మొదటి డోసు టీకా కోసం పట్టుబట్టడం వైద్య ఆరోగ్య సిబ్బందికి ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం టీకా ఉత్సవ్‌ను ఐదు రోజులు నిర్వహించాలని షెడ్యూల్‌ పెట్టినా ఆస్థాయిలో డోస్‌లు రాకపోవడంతో ఒక్క రోజు టీకా ఉత్సవ్‌తో సరిపెట్టింది.

Updated Date - 2021-04-21T06:15:48+05:30 IST