ఉద్యోగుల గుండెల్లో కరోనా గుబులు

ABN , First Publish Date - 2021-04-25T06:24:15+05:30 IST

కరోనా విజృంభిస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో భయం నెలకొంది. విధుల నిర్వహణ వారికి సవాలుగా మారింది.

ఉద్యోగుల గుండెల్లో కరోనా గుబులు
ఆర్డీవో కార్యాలయానికి రెడ్‌జోన్‌ బ్యానర్‌

దాదాపు అన్ని శాఖల్లోనూ బాధితులు

సందర్శకుల రాకపోకలపై ఆంక్షలు


చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 24: కరోనా విజృంభిస్తుండటంతో  ప్రభుత్వ ఉద్యోగుల్లో భయం నెలకొంది. విధుల నిర్వహణ వారికి సవాలుగా మారింది. కీలకమైన రెవెన్యూ, పోలీస్‌, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్టీసీ, మున్సిపాలిటీ తదితర శాఖల ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఆ క్రమంలో దాదాపు 200 మందికిపైగా ఉద్యోగులు వైరస్‌ బారిన పడ్డారు. కొందరు ఉన్నతాధికారులు సైతం  హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డికి, రెండు రోజుల క్రితం జేసీ రాజశేఖర్‌ సీసీ సుకుమార్‌కు కరోన సోకింది. సంక్షేమ శాఖలో ఏడుగురు, రెవెన్యూ విభాగంలో ఆరుగురు, ప్రొటోకాల్‌ విభాగంలో ఒకరు, ఖజానాలో ముగ్గురు, డీఎస్వో కార్యాలయంలో ముగ్గురు, చిత్తూరు డీఎల్‌సీవో కార్యాలయంలో ఇద్దరికి.. ఇలా దాదాపు ప్రభుత్వ శాఖల్లో ఒకరో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులు కూడా ఆఫీసులకు రాకుండా వర్క్‌ ఫ్రం హోం కింద పనులు చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో ఇద్దరు వీఆర్వోలు, ఒక ఆర్‌ఐ, సర్వేయర్‌కు కరోన సోకి మృతి చెందినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ హరినారాయణన్‌ ఉన్నప్పుడు తన చాంబర్‌ నుంచి బయటకు వచ్చి భౌతికదూరం పాటిస్తూ ఫిర్యాదుదారుల నుంచి వినపతిత్రాలను తీసుకుని పంపిస్తున్నారు. కలెక్టరేట్‌లోని అన్ని సముదాయాల్లో శానిటైజర్‌ వాడకం తప్పనిసరి చేశారు. సందర్శకుల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఆర్డీవో కార్యాలయం వద్ద రెడ్‌జోన్‌ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. మాస్కులు తప్పనిసరి చేసి, వాటిని ధరించిన వారిని మాత్రమే కార్యాలయాల్లోకి పంపుతున్నారు.

Updated Date - 2021-04-25T06:24:15+05:30 IST