సింగరేణిని వణికిస్తున్న కరోనా.. వరుస మరణాలతో కార్మికుల్లో అలజడి

ABN , First Publish Date - 2020-07-24T20:37:30+05:30 IST

కరోనా మహమ్మారి సింగరేణి కార్మికులను భయాందోళనకు గురిచేస్తున్నది. పలువురు సింగరేణి కార్మికులు కరోనా బారినపడి మృతిచెందడం, పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో కార్మికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

సింగరేణిని వణికిస్తున్న కరోనా.. వరుస మరణాలతో కార్మికుల్లో అలజడి

భయంతో తగ్గున్న హాజరుశాతం

 

గోదావరిఖని(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి సింగరేణి కార్మికులను భయాందోళనకు గురిచేస్తున్నది. పలువురు సింగరేణి కార్మికులు కరోనా బారినపడి మృతిచెందడం, పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో కార్మికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎవరూ అధైర్య పడవద్దని, మెరుగైన వైద్యం అందజేస్తామని యాజమాన్యం చెబుతున్నా, కార్మికులను కరోనా భయం వెంటాడుతున్నది. పనికన్నా.. ప్రాణం మిన్న.. అనే భావనకు సింగరేణి కార్మికులు వచ్చారు. అవసరమైతే డ్యూటీలకు వెళ్లకూడదనే భావనలో కార్మికులు ఉన్నారు. దీంతో గనులపై క్రమంగా హాజరుశాతం తగ్గుతున్నది. ఇటీవల జీడీకే 2ఏ గనికి చెందిన కార్మికులకు కరోనా సోకడంతో చాలావరకు ఆ గని కార్మికులు విధులకు రావడం లేదు. 2గ్రూప్‌ పరిధిలో 40 శాతం హాజరు నమోదవుతుండడం పరిస్థితికి అద్దంపడుతున్నది. తాజాగా గురువారం 7ఎల్‌ఈపీ గనికి చెందిన ట్రామర్‌ కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దాంతో కార్మికులు విధులను బహిష్కరించారు. 


సాధ్యంకాని భౌతిక దూరం

కోవిడ్‌ వైరస్‌ విస్తరించకుండా పాటించాల్సిన నిబంధనల్లో భౌతిక దూరం మొదటిది. కానీ బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో భౌతికదూరం పాటించడం సాధ్యంకాని పని అన్నది వాస్తవం. భూగర్భ గనుల్లో నలుగురు, ఐదుగురు కార్మికులు కలిసిచేసే పనులే అధికం. ఓసీపీల్లో బేస్‌వర్క్‌షాప్‌, సీహెచ్‌పీ, ఎస్‌అండ్‌డీ వంటి సెక్షన్‌లలో సైతం ఈ నిబంధన పాటించడం కష్టం. నిన్నటి వరకు తమతో పనిచేసిన కార్మికుడు కోవిడ్‌తో మరణించాడని తెలియడంతో ఆయా విభాగాల్లోని కార్మికుల్లో ఎక్కడా లేని భయం నెలకొంటున్నది. ప్రస్తుతం అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితి మరో నాలుగైదు రోజులు గడిస్తే మరింత దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


డ్యూటీకంటే ప్రాణం ముఖ్యం..

వరుస కోవిడ్‌ కేసులు, మరణాలతో ఎక్కడ తాము కరోనా బారినపడతామోనని కార్మికులు విధులకు వెళ్లడం తగ్గిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంతో పాటు హక్కుల సాధనకు సమ్మెలు చేసిన కార్మికులు ప్రస్తుతం తమ ప్రాణాలను కాపాడుకునేందుకు విధులకు దూరంగా ఉంటున్నారు. ఇతర ప్రాంతాల్లో కరోనా వైరస్‌ సోకిన వ్యక్తులు సులభంగా కోలుకుంటుండగా, సింగరేణిలో మాత్రం తీవ్ర అనారోగ్యం పాలుకావడం లేదా మరణాలు సంభవించడం జరుగుతున్నది. బొగ్గు ఉత్పత్తి మొదలు రవాణా వరకు అనేక రకాల వాయువులు, దుమ్ము, పొగలతో కార్మికుల అవయవాలు దెబ్బతిని ఉంటాయి. ఈ కారణంగా కరోనా వైరస్‌ దాడితో మరణాలు సంభవిస్తున్నాయి. సీనియర్‌ కార్మికులను చాలా వరకు ఏదో అనారోగ్య సమస్య పట్టిపీడిస్తున్నది. అటువంటి వారికి కరోనా మరింత భయాన్ని కలిగిస్తున్నది. ప్రాణాంతక వ్యాధులు ప్రబలినపుడు కోల్‌ఇండియా మైన్స్‌ రెగ్యులేషన్‌ ప్రకారం ప్రత్యేక వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. కరోనా ప్రభావం ఉన్న గనులను లేఆఫ్‌గా ప్రకటించాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-07-24T20:37:30+05:30 IST